లాజిక్ లేని ఈ లెక్క‌లేంది కేటీఆర్‌

Update: 2017-12-05 12:08 GMT
లెక్క‌లు చెప్ప‌టంలో తెలంగాణ రాష్ట్ర మంత్రి కేటీఆర్ త‌ర్వాతే. ఇప్ప‌టివ‌ర‌కూ ఆయ‌న‌లో చాలా కోణాలు చూసిన తెలంగాణ ప్ర‌జ‌ల‌కు తాజాగా త‌న‌లోని లెక్క‌ల మాష్టారి కోణాన్ని చూపించి అవాక్కు అయ్యేలా చేస్తున్నారు. ఇంత‌కాలం లెక్క‌ల‌కు ఫేమ‌స్ చుక్కా రామ‌య్య మాష్టారు అనుకునేవాళ్లు. కానీ.. కేటీఆర్ చెప్పే లెక్క వింటే ఆయ‌న సైతం త‌న‌కిలాంటి లెక్క‌లు ఎందుకు రాలేద‌న్న భావ‌న క‌ల‌గ‌టం ఖాయ‌మేమో?

తెలంగాణ స‌ర్కారు అధికారం చేప‌ట్టి నాలుగేళ్లు అవుతున్న వేళ‌.. ఉద్యోగాల విష‌యంలో ఇచ్చిన హామీని నిల‌బెట్టుకోని వైనంపై కోదండం మాష్టారు లాంటోళ్లు గ‌ర్రుగా ఉన్నారు. తెలంగాణ ఉద్య‌మ స‌మ‌యంలో తెలంగాణ రాష్ట్ర ఏర్ప‌డితే చాలు.. బిల‌బిల‌మంటూ ఉద్యోగాలు వ‌చ్చేస్తాయంటూ కేసీఆర్ చెబితే.. చ‌ప్ప‌ట్లు కొట్టినోళ్ల‌లో కోదండం మాష్టారు లాంటోళ్లు ఉన్నారు. ప‌వ‌ర్ చేతికి వ‌చ్చిన త‌ర్వాత ప‌నుల హ‌డావుడిలో ఇచ్చిన హామీల్ని మ‌ర్చిపోవటం రాజ‌కీయ పాల‌కుల‌కు అల‌వాటే.

అలాంట‌ప్పుడు వారికి పాత విష‌యాల్ని గుర్తు చేయ‌టం ఉద్య‌మ‌కారుల బాధ్య‌త‌.  తెలంగాణ సాధ‌న వ‌ర‌కూ ఒకే బాట‌లో న‌డిచిన కేసీఆర్‌.. కోదండం మాష్టార్లు.. తెలంగాణ సాధ‌న త‌ర్వాత ఎవ‌రి దారిలోకి వారు వెళ్లిపోయారు. కాల చ‌క్రంలో నాలుగేళ్లు గ‌డిచిపోయినా.. తెలంగాణ ఉద్య‌మానికి ఊపిరి లాంటి నిధులు.. నీళ్లు.. నియ‌మ‌కాల విష‌యంలో సాగుతున్న అంతులేని జాప్యంపై గళం విప్పాల‌ని మాస్టారు ఫిక్స్ అయ్యారు. తెలంగాణ వ‌స్తే చాలు త‌మ బ‌తుకులు మారిపోతాయ‌న్న భావ‌న‌లో ఉన్న తెలంగాణ బిడ్డ‌లు తీవ్ర అసంతృప్తిలో ఉన్న విష‌యాన్ని గుర్తించిన కోదండం లాంటి ఉద్య‌మ‌కారులంతా ప్ర‌భుత్వానికి చురుకు పుట్టే ప‌ని షురూ చేశారు.

తెలంగాణ‌కు ఏం చేసినా తాము మాత్ర‌మే చేయాల‌ని.. ఇంకెవ‌రికి ఆ హ‌క్కు లేద‌న్న‌ట్లుగా ఫీల‌య్యే కేసీఆర్.. కేటీఆర్ ల‌కు కొలువ‌ల కోసం కోట్లాట ముచ్చ‌ట అస్స‌లు న‌చ్చ‌లేదు. అందుకే.. ఎన్ని అడ్డంకులు సృష్టించారో అన్ని చేశారు. అంతేనా.. కేసుల బూచితో స‌భ‌కు హాజ‌రు కావాల‌న్న వారికి చుక్క‌లు చూపించారు. ఇన్ని అవాంత‌రాల మ‌ధ్య స‌భ‌ను నిర్వ‌హించి.. పాల‌కుల మీద పంచ్ లు వేశారు.

కేటీఆర్ లాంటి వారికి అలాంటివి అస్స‌లు న‌చ్చ‌వు క‌దా. అందుకే అప్ప‌టిక‌ప్పుడు త‌న‌కు తోచిన లెక్క ఒక‌దాన్ని వేసేశారు. మాంచి మాట‌కారి అయిన కేటీఆర్‌ కు అంకెలు దొరికితే ప్ర‌త్య‌ర్థిని ఎంత‌లా ఆడుకుంటారో ప్ర‌త్యేకించి చెప్పాల్సిన అవ‌స‌రం లేదు.స‌రిగ్గా అలాంటి ప‌నే చేశారు కేటీఆర్‌.
 
త‌మ‌కు అర‌వై నెల‌లు పాలించ‌మ‌ని ప్ర‌జ‌లు టైమిచ్చార‌ని.. గ‌డిచిన మూడున్న‌రేళ్ల కాలంలో 30 వేల‌కు పైగా ఉద్యోగాలు ఇచ్చామ‌న్నారు. ప్ర‌జ‌లు త‌మ‌కిచ్చిన టైం లోపు 1.12 ల‌క్ష‌ల ఉద్యోగాలు ఇచ్చేస్తామ‌ని చెప్పేశారు. కేటీఆర్ లాంటోడి నోట అంత మాట వ‌స్తే ఎవ‌రైనా న‌మ్మేస్తారు. కానీ.. ఇక్క‌డే చిక్కంతా. ఎందుకంటే ప్ర‌జ‌లు త‌మ‌కిచ్చిన టైంను నెల‌ల్లో చెప్పిన కేటీఆర్‌.. ముగిసిన కాలాన్ని మాత్రం ఏళ్ల‌ల్లో చెప్పారు.

ఇంకా స‌రిగ్గా చెప్పాలంటే ప్ర‌జ‌లు కేసీఆర్‌ కు ఇచ్చిన స‌మ‌యం 60 నెల‌లు అయితే.. కేటీఆర్ లెక్క ప్ర‌కారం ఇప్పుడు 42 నెల‌లు పూర్తి అయిపోయాయి. ఈ 42 నెల‌ల్లో 30వేల‌కు పైగా కొలువులు ఇచ్చిన‌ట్లుగా పేర్కొన్నారు. అంటే.. త‌మ‌కున్న 18 నెల‌ల వ్య‌వ‌ధిలో 80.2వేల ఉద్యోగాలు ఇవ్వాల్సి ఉంటుంది. చివ‌రి మూడు నెల‌లు ఎన్నిక‌ల వేడి ఉంటుంది. ఈ స‌మ‌యంలో కీల‌క నిర్ణ‌యాలు తీసుకోలేరు.

అంటే.. ఉన్న‌ది స‌రిగ్గా 15 నెల‌లు అందులో ఇప్ప‌టికే కొంత కాలం పోయిన‌ట్లే. అంటే.. 42 నెల‌ల‌ వ్య‌వ‌ధిలో 30 వేల ఉద్యోగాలు ఇచ్చిన‌ప్పుడు 15 నెల‌ల వ్య‌వ‌ధిలో ఎన్ని ఉద్యోగాలు ఇవ్వొచ్చ‌న్న‌ది అస‌లు ప్ర‌శ్న‌. ఎంత లెక్కేసినా.. కేటీఆర్ చెబుతున్న మాట బ‌డాయిగా క‌నిపించ‌ట‌మే త‌ప్పించి.. వ‌ర్క్ వుట్ అయ్యే లెక్క‌గా క‌నిపించ‌దు. నిజ‌మే కేటీఆర్ అంత మాట‌కారిత‌నం.. లెక్క‌లు తేల్చేసేంత సీన్ లేక‌పోవ‌చ్చు. కానీ.. లెక్క‌ల పేరుతో ఏదేదో చెప్పి క‌న్ఫ్యూజ‌న్ చేయ‌టం భావ్య‌మేనా? అన్న‌ది అస‌లు ప్ర‌శ్న‌. ఏది ఏమైనా 18 నెల‌ల వ్య‌వ‌ధిలో 80 వేల‌కు పైగా ఉద్యోగాలు ఎలా ఇస్తారో చెప్పి పుణ్యం క‌ట్టుకుంటే బాగుంటుంది క‌దా!
Tags:    

Similar News