కేటీఆర్ ప‌ప్పూ సెటైర్‌!...రాహుల్ గాంధీపైనేనా?

Update: 2018-01-31 05:08 GMT
తెలంగాణ రాష్ట్ర స‌మితి యువ నేత‌, తెలంగాణ ప‌రిశ్ర‌మ‌లు, ఐటీ, పుర‌పాల‌క శాఖ మంత్రి క‌ల్వ‌కుంట్ల తార‌క‌రామారావు... ఆది నుంచి త‌న‌దైన శైలిలో విమ‌ర్శ‌లు సంధించ‌డంలో దిట్ట‌గానే చెప్పుకోవాలి. రాజ‌కీయాల్లోకి కాస్తంత ఆల‌స్యంగానే ఎంట్రీ ఇచ్చిన కేటీఆర్‌... అతి త‌క్కువ కాలంలోనే ఉన్న‌త స్థాయికి ఎదిగిపోయారు. ఈ విష‌యంలో ఆయ‌న కేసీఆర్ కుమారుడు అయినందునే ఈ అభివృద్ది క‌నిపించింద‌న‌డంలో కొంత‌మేర సందేహాలు వినిపించినా... ఎంత కేసీఆర్ కుమారుడైతే మాత్రం ఏమీ రాకున్నా, ఎలాంటి స‌త్తా నిరూపించుకోకుండానే ఓ మంత్రి స్థాయికి ఎద‌గ‌లేరు క‌దా. కేసీఆర్ కుమారుడిగా... కేసీఆర్‌లోని రాజ‌కీయ తంత్రం కూడా కేటీఆర్‌కు అల‌వ‌డి ఉంటుంద‌న్న విష‌యంలో ఎలాంటి సందేహం లేద‌నే చెప్పాలి. అయినా ఇప్పుడు కేటీఆర్ గొప్ప‌త‌నం గురించి, మాట తీరు గురించి ప్ర‌త్యేకంగా ప్ర‌స్తావించుకోవాల్సిన అవ‌స‌రం ఏముంద‌న్న విష‌యానికి వ‌స్తే... తెలంగాణ కాంగ్రెస్ క‌మిటీ చీఫ్ ఉత్త‌మ్ కుమార్ రెడ్డి చేసిన ఓ చిన్న విష‌యాన్ని ప‌ట్టుకున్న కేటీఆర్‌... ఉత్త‌మ్‌తో పాటుగా కాంగ్రెస్ పార్టీ అధ్య‌క్షుడు రాహుల్ గాంధీపైనా త‌న‌దైన శైలిలో సెటైర్లు సంధించేశారు. త‌న‌పై ఉత్త‌మ్ ఆరోప‌ణ‌లు చేస్తే... ఉత్త‌మ్ ఆరోప‌ణ‌ల‌నే బేస్ చేసుకుని ప్ర‌తిస్పందించిన కేటీఆర్‌... ఉత్త‌మ్ తో పాటుగా ఏకంగా రాహుల్ గాంధీనే టార్గెట్ చేసేంత‌గా చెల‌రేగిపోయారంటే... ఆయ‌న స‌త్తా గురించి ప్ర‌త్యేకంగా ప్ర‌స్తావించాల్సిందే క‌దా.

ఇక అస‌లు విష‌యంలోకి వెళితే... మొన్న దావోస్‌లో జ‌రిగిన ప్ర‌పంచ ఆర్థిక వేదిక స‌మావేశానికి అన్ని దేశాల నుంచే కాకుండా భార‌త్ లోని దాదాపుగా అన్ని రాష్ట్రాల నుంచి కూడా ప్ర‌జా ప్ర‌తినిధుల‌తో పాటుగా పారిశ్రామిక‌వేత్త‌లు కూడా హాజ‌ర‌య్యారు. ఈ క్ర‌మంలో తెలంగాణ స‌ర్కారు త‌ర‌ఫున కేటీఆర్ కూడా ఆ స‌ద‌స్సుకు హాజ‌ర‌య్యారు. అయితే ఈ విష‌యంపై త‌న‌దైన శైలిలో ఆరోప‌ణ‌లు గుప్పించేందుకు రంగంలోకి దిగిన ఉత్త‌మ్‌... అస‌లు కేటీఆర్‌కు స‌ద‌స్సుకు నిర్వాహ‌కుల నుంచి ఆహ్వాన‌మే అంద‌లేద‌ని, కేటీఆరే త‌న పేరును అక్క‌డ న‌మోదు చేయించుకుని హాజ‌ర‌య్యార‌ని ఆరోపించారు. ఈ విష‌యం తెలుసుకున్న కేటీఆర్‌... చాలా ఘాటుగా స్పందించారు. త‌న‌కు వ‌ర‌ల్డ్ ఎక‌న‌మిక్ ఫోరం నుంచి అందిన ఆహ్వానం ప్ర‌తిని, ఆన్‌లైన్‌లో త‌న‌కు అందిన ఈ-మెయిల్ ఆహ్వానాన్ని బ‌హిర్గతం చేసిన కేటీఆర్‌... ఉత్త‌మ్ ఆరోప‌ణ‌ల్లో ఏమాత్రం వాస్త‌వం లేద‌ని చెప్పారు. అంత‌టితో ఆగ‌ని కేటీఆర్‌... తానేమీ ప‌ప్పూను కాద‌ని, ఇప్పటి నుంచైనా మీరు హూందాగా వ్య‌వ‌హ‌రించాల‌ని కోరారు.

ఈ య‌మేర‌కు ట్విట్ట‌ర్ వేదిక‌గా కేటీఆర్ చేసిన ట్వీట్లు వైర‌ల్‌గా మారిపోయాయి. స‌ద‌రు ట్వీట్ల‌లో కేటీఆర్ ఏమ‌న్నారంటే...  *మేధో దివాళాకోరుతనానికి ప్రతీక అయిన టీపీసీసీ చీఫ్ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి నాకు ఆహ్వానం అందలేదని ఆరోపిస్తున్నారు. ఆయన కోసం ఈ ఆహ్వానం కాపీలను బహిరంగ పరుస్తున్నాను. ఉత్తమ్ గారూ.. నేను పప్పును కాదు. ఇప్పటికైనా మిమ్మల్ని మీరు హుందాగా కరెక్ట్ చేసుకుంటారని ఆశిస్తున్నా` అని కేటీఆర్ స‌ద‌రు ట్వీట్ల‌లో పేర్కొన్నారు. అయినా ఉత్త‌మ్ కుమార్ రెడ్డిని ఏ ఒక్క‌రూ ఇప్ప‌టిదాకా ప‌ప్పూ అంటూ సంబోధించ‌లేదు. భార‌త సైన్యంలో ప‌నిచేసిన అనుభ‌వం ఉన్న ఉత్త‌మ్‌... ఆ త‌ర్వా రాష్ట్ర‌ప‌తి వ‌ద్ద కూడా చాలాకాల‌మే ప‌నిచేసి ఆ త‌ర్వాత రాజ‌కీయాల్లోకి వ‌చ్చారు. మ‌రి ఉత్త‌మ్‌ను ప్ర‌స్తావిస్తూ కేటీఆర్ చేసిన ట్వీట్ల‌లో పప్పూ అంటే ఎవ‌రు? అన్న ప్ర‌శ్న ఇక్క‌డ ఉద‌యించ‌క మాన‌దు. ఏమీ తెలియ‌ని రాజ‌కీయ నేత‌గా మొన్న‌టిదాకా ఆరోప‌ణ‌లు ఎదుర్కొన్న రాహుల్ గాంధీ ఇప్పుడిప్పుడే ప‌రిణ‌తి సాధించిన నేత‌గా క‌నిపిస్తున్నారు. ఈ క్ర‌మంలో ఉత్త‌మ్‌కు కాలేలా చేసేందుకే కేటీఆర్‌... రాహుల్ గాంధీని ప‌ప్పూగా అభివ‌ర్ణించిన విష‌యాన్ని గుర్తు చేసిన‌ట్లుగా విశ్లేష‌ణ‌లు సాగుతున్నాయి.
Tags:    

Similar News