ఆమెపై కేటీఆర్ కు కోపం వ‌చ్చింది!

Update: 2018-08-07 05:00 GMT
దేశంలో మ‌రే రాష్ట్రంలో లేని రీతిలో ఆస‌క్తిక‌ర‌మైన రాజ‌కీయం తెలంగాణ‌లో క‌నిపిస్తుంది. అందునా అధికార‌ప‌క్షానికి చెందిన కీల‌క నేత‌ల తీరు మిగిలిన వారికి భిన్నంగా ఉంటుంది. ఓవైపు మోడీ ప‌రివారంతో స‌త్ సంబంధాలు కొన‌సాగిస్తూనే.. మ‌రోవైపు వారిపై విరుచుకుప‌డ‌టంతో కేసీఆర్ స‌ర్కారు త‌ర్వాతే. ప్ర‌తి విష‌యంలోనూ ఏదో ఒక రాష్ట్రంతో పోటీనో.. పోలికో పెట్టుకోవ‌ట‌మే కాదు.. వారికి అలా చేశారు.. వీరికి ఇలా చేశారు.. మాకు మాత్రం చేయ‌రంటూ చెల‌రేగిపోవ‌టం క‌నిపిస్తుంటుంది.

తాజాగా అలాంటి ప‌నే చేసి వార్త‌ల్లోకి వ‌చ్చారు మంత్రి కేటీఆర్. త‌న తండ్రి క‌మ్ రాష్ట్ర ముఖ్య‌మంత్రి కేసీఆర్.. మూడు రోజుల‌కు పైనే ఢిల్లీలో ఉండి కేంద్రంలోని మోడీ బ్యాచ్ కు విన‌తుల చిట్టా ఇచ్చి వ‌చ్చిన కొద్ది గంట‌ల వ్య‌వ‌ధిలోనే కేంద్రం తీరును కేటీఆర్ త‌ప్పు ప‌ట్ట‌టం విశేషం.

మోడీకి ర‌హ‌స్య స్నేహితుడిగా.. తాజా ఢిల్లీ ప‌ర్య‌ట‌న‌లో కేంద్రంతో గుట్టుచ‌ప్పుడు కాకుండా అప్ర‌క‌టిత రాజ‌కీయ ఒప్పందం ఒక‌టి చేసుకున్న‌ట్లుగా వార్త‌లు బ‌లంగా వినిపిస్తున్న వేళ‌.. కేంద్రం తీరును త‌ప్పు పడుతూ ట్వీట్ చేసిన వైఖ‌రి అంద‌రి దృష్టిని ఆక‌ర్షిస్తోంది. ఓవైపు త‌న తండ్రి న‌వ్వులు చిందిస్తూ.. మోడీకి త‌మ విష్ లిస్ట్ ఇస్తుంటే.. మ‌రోవైపు ప‌క్క‌నున్న రాష్ట్రాల విష‌యంలో కేంద్రం తీసుకున్న నిర్ణ‌యాన్ని పోలిక పెడుతూ ప్ర‌శ్నిస్తున్నారు కేటీఆర్.

బెంగ‌ళూరులో మౌలిక వ‌స‌తుల ప్రాజెక్టు కోసం 210 ఎక‌రాల భూముల్ని కేటాయించిన కేంద్ర ర‌క్ష‌ణ శాఖ తెలంగాణ రాష్ట్ర రాజ‌ధాని హైద‌రాబాద్‌లోని రెండు ముఖ్య‌మైన ఆకాశ మార్గాల నిర్మాణానికి రెండేళ్లుగా అనుమ‌తులు ఇవ్వ‌టం లేద‌ని మంత్రి కేటీఆర్ అసంతృప్తి వ్య‌క్తం చేయ‌టం గ‌మ‌నార్హం. కేంద్ర‌మంత్రి నిర్మ‌లా సీతారామ‌న్ ను ఉద్దేశించి ఆయ‌న ట్విట్ట‌ర్ లో ప్ర‌శ్నిస్తూ.. ఇలాంటి ద‌య‌తో కూడిన విధానాల్ని తెలంగాణ రాష్ట్రానికి ఎందుకు వ‌ర్తించేలా చేయ‌రు? అంటూ ప్ర‌శ్నించారు.

రాష్ట్ర ప్ర‌భుత్వం సిద్ధం చేసిన రెండు ఆకాశ స్కైవేల  నిర్మాణానికి కేంద్ర ర‌క్ష‌ణ శాఖ‌కు చెందిన 160 ఎక‌రాలు అవ‌స‌ర‌మ‌న్న విష‌యాన్ని గుర్తించ‌ట‌మే కాదు.. రెండేళ్ల క్రితం ర‌క్ష‌ణ శాఖకు త‌మ ముఖ్య‌మంత్రి కేసీఆర్ లేఖ రాశార‌ని.. ఈ భూములు ఇవ్వాలంటూ కేంద్ర ర‌క్ష‌ణ శాఖామంత్రులుగా వ్య‌వ‌హ‌రించిన ముగ్గురు నేత‌ల (మ‌నోహ‌ర్ పారీక‌ర్.. అరుణ్ జైట్లీ.. నిర్మ‌లా సీతారామ‌న్‌)ను తాము క‌లిశామ‌ని.. ప‌లుసార్లు వారి దృష్టికి విన‌తులు తీసుకెళ్లినా ప్ర‌యోజ‌నం లేకుండా పోయింద‌న్నారు.

రెండేళ్లుగా త‌మ‌కు ర‌క్ష‌ణ శాఖ భూముల్ని కేటాయించాల‌ని కోరుతున్నా ప‌ట్టించుకోని కేంద్రం.. బెంగ‌ళూరు కోసం 210 ఎక‌రాల్ని కేటాయించ‌టంపై విస్మ‌యాన్ని వ్య‌క్తం చేశారు. క‌ర్ణాట‌క ప్ర‌భుత్వం కంటే ముందే కేంద్రాన్ని తాము అభ్య‌ర్థిస్తున్నా ప‌ట్టించుకోవ‌టం లేద‌ని.. త‌మ ప‌క్క‌నున్న రాష్ట్రం విష‌యంలో మాత్రం నిర్ణ‌యం తీసుకున్నార‌ని.. ఇదేం ద్వంద నీతి అంటూ ప్ర‌శ్నించారు. తాము కోరినా నెర‌వేర్చ‌ని హామీ మీద కేటీఆర్ అసంతృప్తి వ్య‌క్తం చేస్తే.. ఆయ‌న ప్ర‌భుత్వం ఇచ్చిన హామీని అమ‌లు చేయ‌లేద‌న్న విష‌యాన్ని గుర్తు చేస్తూ.. ప్ర‌ముఖ బ్యాడ్మింట‌న్ క్రీడాకారిణి కేసీఆర్ స‌ర్కారుపై ట్విట్ట‌ర్ లో ట్వీట్ ఆగ్ర‌హాన్ని వ్య‌క్తం చేయ‌టం గ‌మ‌నార్హం. కొద్ది గంట‌ల తేడాతో ఇరువురు ప్ర‌ముఖులు.. ఒకే త‌ర‌హా ఆగ్ర‌హాన్ని ట్వీట్ల ద్వారా వ్య‌క్తం చేయ‌టం విశేషంగా చెప్ప‌క త‌ప్ప‌దు.
Tags:    

Similar News