ఐల‌య్య‌పై కేటీఆర్ ఏమ‌న్నారంటే!

Update: 2017-09-29 12:02 GMT
ప్ర‌ముఖ విద్యావేత్త‌ - సామాజిక ఉద్య‌మ‌కారుడిగా పేరున్న కంచె ఐల‌య్య... త‌న తాజా పుస్త‌కంలో ఆర్య‌వైశ్యుల‌పై చేసిన ఘాటు వ్యాఖ్య‌ల వివాదం ఇప్పుడ‌ప్పుడే స‌మ‌సేలా లేదు. ఆర్య‌వైశ్యుల‌ను స్మ‌గ్ల‌ర్లుగా అభివ‌ర్ణిస్తూ ఐల‌య్య చేసిన వ్యాఖ్య‌ల‌పై రెండు తెలుగు రాష్ట్రాల‌కు చెందిన ఆయా సామాజిక వ‌ర్గాలు పెద్ద ఎత్తున ఉద్య‌మం చేస్తున్నాయి. ఐల‌య్య‌ను త‌క్ష‌ణ‌మే అరెస్ట్ చేయ‌డంతో పాటు ఐల‌య్య త‌మ సామాజిక వ‌ర్గంపై చేసిన ఘాటు వ్యాఖ్య‌ల‌కు సంబంధించిన పుస్త‌కాన్ని ర‌ద్దు చేయాల్సిందేన‌ని డిమాండ్ చేస్తున్నారు. అయితే ఈ వివాదంపై రాజ‌కీయ నేత‌లు ఆచితూచి స్పందిస్తున్నారు. ఇప్ప‌టికే ప‌లువురు రాజ‌కీయ వేత్త‌లు దీనిపై నోరు విప్పినా.. తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన కీల‌క నేత‌లు మాత్రం పెద్ద‌గా స్పందించిన దాఖ‌లా క‌నిపించ‌లేదు.

ఈ క్ర‌మంలో ఈ వివాదంపై స్పందించిన టీఆర్ ఎస్ కీల‌క నేత‌ - తెలంగాణ కేబినెట్లో కీల‌క శాఖ‌ల మంత్రిగా ఉన్న క‌ల్వకుంట్ల తార‌క‌రామారావు (కేటీఆర్) నిజంగానే ఆచితూచి స్పందించార‌నే చెప్పాలి. అస‌లు క‌ట్టె విర‌క్కుండా, పాము చావ‌కుండా అన్న చందంగా కేటీఆర్ స్పందించిన తీరు ఇప్పుడు నిజంగానే ఆస‌క్తి రేకెత్తిస్తోంది. ఐల‌య్య‌ను నేరుగా త‌ప్పు ప‌ట్ట‌ని కేటీఆర్‌... త‌న పుస్త‌కంలో ఐల‌య్య చేసిన వ్యాఖ్య‌ల‌పై త‌న‌దైన శైలిలో స్పందించార‌నే చెప్పాలి. ఏ ఒక్క సామాజిక వ‌ర్గానికి చెందిన మ‌నోభావాల‌ను నొప్పించే అధికారం ఏ ఒక్క‌రికీ లేద‌న్న విష‌యాన్ని ప్ర‌తి ఒక్కరూ తెలుసుకోవాల్సి ఉంద‌న్న కేటీఆర్‌... ఈ త‌ర‌హా వివాదాలు రేగిన‌ప్పుడు సంయ‌మ‌నంగా వ్య‌వ‌హ‌రించాల్సిన ఆవ‌శ్య‌కత‌ను కూడా నొక్కి చెప్పారు. ప‌లువురు నెటిజ‌న్లు స్పందించిన తీరుపైనా స్పందించిన తీరుపైనా కేటీఆర్ త‌న అభిప్రాయాన్ని వ్య‌క్తం చేశారు.

కంచె ఐల‌య్య రేపిన వివాదం - ఆ త‌ర్వాత ఐల‌య్య‌పై జ‌రిగిన భౌతిక దాడి త‌దిత‌ర విష‌యాల‌పై త‌మ ప్ర‌భుత్వం విచార‌ణ జ‌రుపుతుంద‌ని ప్ర‌క‌టించిన కేటీఆర్‌... స‌మాజంలో శాంతి భ‌ద్ర‌త‌ల‌ను ప‌ర్య‌వేక్షిస్తున్న పోలీసు శాఖ ఈ విష‌యంపై ఎలా స్పందించాలో అలాగే స్పందిస్తుంద‌ని చెప్పారు. ఈ మేర‌కు ప్ర‌భుత్వం నుంచి కూడా ఎప్పుడో ఆదేశాలు జారీ అయ్యాయ‌ని కూడా ఆయ‌న చెప్పుకొచ్చారు. అయితే ఏ విష‌యాన్ని కూడా నేరుగా చెప్ప‌ని కేటీఆర్‌... చాలా జాగ్ర‌త్త‌గా ఈ వివాదంలో తానేమీ క‌లుగ‌జేసుకోవ‌డం లేద‌న్న కోణంలోనే స్పందించార‌ని చెప్పాలి. మొత్తంగా భావ ప్రకటనా స్వేచ్ఛ, వాక్‌ స్వాతంత్య్రం అంటే ఎదుటివారిని తిట్టడం కానే కాదన్న‌ది కేటీఆర్ భావ‌న‌గా క‌నిపిస్తోంది. ఓ సామాజిక వర్గాన్ని టార్గెట్‌ గా చేసుకుని, దూషణలకు దిగడం సరికాదని కూడా కేటీఆర్ త‌న ట్విట్ట‌ర్ అకౌంట్ ద్వారా పేర్కొన్నారు.
Tags:    

Similar News