మోదీపై కేటీఆర్‌ కు న‌మ్మకం కుద‌ర‌లేదుగా!

Update: 2017-03-15 09:00 GMT
గ‌డ‌చిన సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో బీజేపీకి అనూహ్య విజ‌యం సాధించిపెట్ట‌డ‌మే కాకుండా... మూడు ద‌శాబ్దాల త‌ర్వాత దేశంలో తొలిసారి సంపూర్ణ మెజారిటీ క‌లిగిన ప్ర‌భుత్వాన్ని ఏర్పాటు చేసిన ప్ర‌ధాని న‌రేంద్ర మోదీకి... 2019లోనూ తిరుగులేద‌ని అంతా చెబుతున్నారు. దేశ మీడియానే కాకుండా... అగ్ర‌రాజ్యం అమెరికాకు చెందిన ప‌త్రిక‌లు కూడా ఇదే వాద‌న‌ను కాస్తంత గ‌ట్టిగానే వినిపిస్తున్నాయి. మ‌రి తెలంగాణ సీఎం కేసీఆర్ కుమారుడు - ఆ రాష్ట్ర కేబినెట్లో కీల‌క శాఖ‌ల మంత్రిగా ఉన్న కల్వ‌కుంట్ల తార‌క‌రామారావు మాత్రం... ఈ విష‌యంపై ఆస‌క్తిక‌ర వాద‌న‌ను తెరపైకి తెచ్చారు. నిన్న తెలంగాణ అసెంబ్లీలోని టీఆర్ ఎస్ ఎల్పీలో జ‌రిగిన మీడియా స‌మావేశం ముగిసిన త‌ర్వాత బ‌య‌ట‌కు వ‌చ్చిన కేటీఆర్ త‌న వ‌ద్ద‌కు వ‌చ్చిన మీడియా ప్ర‌తినిధుల‌తో పిచ్చాపాటిగా మాట్లాడారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న మోదీ భ‌విష్య‌త్తుపై ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. 2019లో మోదీ విజ‌యం సాధిస్తార‌ని ఇప్పుడే ఎలా చెబుతారంటూ ఆయ‌న చేసిన వ్యాఖ్య‌లు నిజంగానే ఆస‌క్తి రేకెత్తించేలానే ఉన్నాయ‌ని చెప్ప‌డంలో ఎలాంటి సందేహం లేద‌నే చెప్పాలి.

మోదీ భ‌విష్య‌త్తు, 2019లో జ‌ర‌గ‌నున్న ఎన్నిక‌లు - తెలుగు రాష్ట్రాల్లో అసెంబ్లీ సీట్ల పెంపు - తెలంగాణ‌లో బ‌లోపేతానికి బీజేపీ వ్య‌వ‌హ‌రిస్తున్న తీరుతెన్నుల‌కు సంబంధించిన కేటీఆర్ ఏమ‌న్నారంటే... ‘‘ఎప్పుడూ పరిస్థితులు ఒకేలా ఉండవు. 2019 వరకూ మోదీ హవా ఉంటుందో ఉండదో!! ఏమైనా జరగొచ్చు. అయితే ప్రస్తుతానికి కేంద్ర ప్రభుత్వానికి ఢోకా లేదు. అసెంబ్లీ సీట్ల పెంపున‌కు సంబంధించి బీజేపీ అధిష్ఠానం తీరు ఎలా ఉందో తెలియ‌దు. అయితే రాష్ట్ర బీజేపీ నేతలు మాత్రం సీట్ల‌ను పెంచకూడదని ప్రయత్నాలు చేస్తున్నారు. కొన్ని నియోజకవర్గాల్లో మా పార్టీ నిండుగా ఉంది. ఎక్కువ మంది నాయకులు ఉన్నారు. వారంతా అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయడానికి ఎదురు చూస్తున్నారు. వాళ్ల పార్టీలో పోటీ చేయడానికి అవకాశం ఉన్నందున, వీళ్లందరినీ బీజేపీలోకి తీసుకునే ప్రయత్నాలు చేస్తున్నారేమో?’’ అని కేటీఆర్ వ్యాఖ్యానించారు. తెలంగాణ‌లో బ‌ల‌ప‌డేందుకు బీజేపీ చేస్తున్న య‌త్నాల‌ను ప్ర‌స్తావించ‌గా... కేటీఆర్ చాలా వేగంగా స్పందించారు. ఒక్క బీజేపీ ఏమిటీ.. తెలంగాణ‌లో బ‌ల‌ప‌డేందుకు ఎవ‌రైనా, ఏ రాజ‌కీయ పార్టీ అయినా య‌త్నించుకోవ‌చ్చున‌ని ఆయ‌న పేర్కొన్నారు. ఎవ‌రెన్ని చేసినా 2019లో మాత్రం తెలంగాణ‌లో అధికారం త‌మ‌దేన‌ని కూడా కేటీఆర్ ధీమా వ్య‌క్తం చేశారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News