గ్రేటర్ ఎన్నికల వేళ.. ఇలాంటి తీపికబుర్లు మరెన్ని ఉంటాయో?

Update: 2020-11-14 17:30 GMT
ఎన్నికలు వస్తున్నాయంటే చాలు.. వరాల జల్లు ప్రకటించేవారు. పెద్ద ఎత్తున హామీలు ఇవ్వటం మామూలే. జమానా నాటి ఈ తీరును కొత్త తరహాలో తెర మీదకు తీసుకొస్తున్నాయి ప్రభుత్వాలు. తాజాగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆసక్తికర వరాన్ని దీపావళి పండుగ వేళ ప్రకటించింది. గ్రేటర్ ఎన్నికలు ముంచుకొస్తున్న వేళ.. తాజా వరాన్ని హైదరాబాద్ వరకే పరిమితం చేయకుండా.. రాష్ట్ర మొత్తానికి అమలయ్యేలా ప్రకటించిన ప్రకటన చూస్తే.. రానున్న రోజుల్లో మరెన్ని వరాలు తెర మీదకు వస్తాయన్నది ఆసక్తికరంగా మారిందని చెప్పక తప్పదు.

పండుగపూట విశ్రాంతి తీసుకోని మంత్రి కేటీఆర్.. సీఎస్ సోమేశ్ కుమార్ తోసహా ఇతర ఉన్నత అధికారులతో సమావేశమయ్యారు. మంత్రులు తలసాని.. మహమూద్ అలీ.. మేయర్ బొంతు రామ్మోహన్ తదితరులతో హాజరైన ఆయన కొత్త వరాన్ని ప్రకటించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు దీపావళి వేళ.. రాష్ట్ర ప్రజలకు దీపావళి కానుకను ఇస్తున్నట్లు ప్రకటించారు.

2020-21 ఏడాదికి జీహెచ్ఎంసీ పరిధిలో రూ.15వేల వరకు ఆస్తిపన్ను కట్టే ఇంటి యజమానలు 50 శాతం రాయితీ ఇవ్వనున్నారు. అంటే.. ఇప్పుడుకట్టే మొత్తంలో యాబై శాతం చెల్లిస్తే సరిపోతుంది. రాష్ట్రంలోని ఇతర పట్టనాల్లో రూ.10వేలవరకు ఆస్తి పన్ను చెల్లించే వారికి యాభై శాతం రాయితీ ఇవ్వనున్నారు.

ఒకవేళ ఇప్పటికే ఆస్తిపన్ను చెల్లించిన వారికి వచ్చే ఏడాది చెల్లించే మొత్తంలో మినహాయింపు ఇవ్వనున్నారు. తాజా వరంతో తెలంగాణ వ్యాప్తంగా 31.4లక్షల కుటుంబాలకు మేలు జరుగుతుందని.. రూ.326 కోట్ల మేర ప్రజలు చెల్లించే పన్ను భారం తగ్గుతుందని అంచనా వేశారు. జీహెచ్ఎంసీ పారిశుద్ధ్య కార్మికుల వేతనాన్ని రూ.14500 నుంచి రూ.17500లకు పెంచుతున్నట్లు ప్రకటించారు. చూస్తుంటే.. గ్రేటర్ ఎన్నికల నోటిఫికేషన్ విడుదలయ్యే నాటికి మరిన్ని వరాల్ని వాయు వేగంతో ప్రకటించే వీలుందన్నమాట వినిపిస్తోంది.
Tags:    

Similar News