క‌విత మాట‌! కేటీఆర్ సంతకం! 150 కోట్లు రిలీజ్‌!

Update: 2017-11-20 08:58 GMT
పెద్ద‌లు సామెత‌లు ఊరికే చెప్ప‌లేదు. త‌మకు ఎదురైన అనుభ‌వాల నుంచి వారు ఆ సామెత‌ల‌ను చెప్పి ఉంటారు. అలా కాకుంటే... వారు చెప్పిన‌ట్లే... ఆ సామెత‌లు స‌జీవంగా ఎలా ఉంటాయి చెప్పండి. నిజ‌మే పెద్ద‌ల మాట స‌ద్ది మూటే. అయినా ఈ పెద్ద‌ల మాటలు - సామెత‌లు అంటూ ఈ సోది ఏంట‌ని అనుకుంటున్నారా?  తెలంగాణ‌లో అధికార పార్టీ టీఆర్ ఎస్ యువ‌నేత‌ - తెలంగాణ స‌ర్కారులో కీల‌క శాఖ‌ల మంత్రిగా సీఎం త‌ర్వాతి స్థానంలో ఉన్నార‌ని ప్ర‌చారం సాగుతున్న క‌ల్వ‌కుంట్ల తార‌కరామారావు - ఆయ‌న సోద‌రి - నిజామాబాదు ఎంపీ క‌ల్వ‌కుంట్ల క‌విత‌ల మ‌ధ్య అనుబంధం చూస్తే... సామెత‌లేంటీ - వాటి కంటే కూడా బ‌ల‌మైన మాట‌లేమైనా ఉంటే చెప్పుకోవాల్సిందే. వారిద్ద‌రి మ‌ధ్య అనుబంధం ఈ రోజు కొత్త‌గా క‌నిపించిందా? అంటే... కొత్త‌గా కాదు గానీ... వారిద్ద‌రి అనుబంధానికి ప్ర‌తీక‌గా ఇటీవ‌ల చోటుచేసుకున్న ఓ ఘ‌ట‌న‌ అంద‌రినీ నోరెళ్లెబ్టేలా చేసింద‌నే చెప్పాలి. ఈ విష‌యం తెలిసిన వారంతా పెద్ద‌లు చెప్పిన పాపులర్ సామెత *వ‌డ్డించే వాడు మ‌నోడైతే... బంతిలో ఎక్క‌డ కూర్చున్నా ఇబ్బంది లేదు* ను గుర్తు చేసుకోకుండా ఉండ‌లేక‌పోతున్నార‌ట‌.

అయినా అంద‌రికీ ఆ సామెత‌ను గుర్తు చేసిన ఆ ఘ‌ట‌న విష‌యంలోకి వెళితే... జ‌గిత్యాల జిల్లాలోని ప‌లు మున్సిపాలిటీల్లోని స‌మ‌స్య‌ల‌ను భుజానేసుకుని ఎంపీ క‌విత‌... పుర‌పాల‌క శాఖ మంత్రి హోదాలో ఉన్న‌ త‌న సోదరుడు కేటీఆర్‌ను క‌లిశారు. సోద‌రిని సాద‌రంగా ఆహ్వానించిన కేటీఆర్‌... ఆమె వ‌చ్చిన విష‌యాన్ని ఆరా తీశార‌ట‌. ఆయా మునిసిపాలిటీల్లోని ప‌లు అంశాలు ఏక‌రువు పెట్టిన క‌విత‌... వాటి ప‌రిష్కారానికి నిధులు కావాల‌ని విన్న‌వించారు. దీంతో అక్క‌డిక‌క్క‌డే స్పందించిన కేటీఆర్... ముందూ వెనుకా చూసుకోకుండా అక్క‌డికక్క‌డే ఓ కీల‌క నిర్ణ‌యం తీసుకున్నార‌ట‌. క‌విత ప్ర‌స్తావించిన మునిసిపాలిటీల్లోని స‌మ‌స్య‌ల ప‌రిష్కారానికి రూ.150 కోట్లు అవ‌స‌ర‌మ‌ని నిర్ధారించుకుని, ఆ నిధుల‌ను విడుద‌ల చేస్తూ వెనువెంట‌నే సంత‌కం కూడా పెట్టేశార‌ట‌. రూ.150 కోట్లు ప్రత్యేక నిధులను కేటీఆర్‌ మంజూరు చేసిన నేప‌థ్యంలో హైదరాబాద్‌లో ఎంపీ కవిత నేతృత్వంలో జగిత్యాల - కోరుట్ల - మెట్పల్లి మున్సిపాలిటీల సమన్వయ సమావేశం జరిగింది.

ఈ నిధుల‌తో ఏమేం చేయ‌నున్నార‌న్న విష‌యానికి వ‌స్తే...  మున్సిపల్  ఆఫీసులు ఈ-ఆఫీసులుగా మారనున్నాయి. వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించుకునే సౌకర్యం కూడా సిద్ధంకానుంది. టాయిలెట్స్ అవసరమున్న చోట ఏర్పాటుచేస్తారు. ప్రతి మున్సిపాలిటీలో స్వాగత తోరణాలను ఏర్పాటు చేస్తారు. మినీ టాంక్ బండ్లు - పార్కులు - జిమ్‌ లు - స్విమ్మింగ్ పూల్స్ - ఈ లైబ్రరీలు - బస్ షెల్టర్లు - మహిళా క్రీడా ప్రాంగణాలు - ఫంక్షన్ హాల్స్ - పెళ్లిళ్ల కోసం ప్రత్యేక ప్రాంగణాలు నిర్మిస్తారు. టౌన్లలోని ప్రధాన రోడ్లనుఅభివృద్ధి చేస్తారు. జగిత్యాల - కోరుట్ల - మెట్‌ ప‌ల్లి మున్సిపాలిటీల సుందరీకరణ లక్ష్యంగా స్పెషల్ ఫండ్‌ను వినియోగిస్తారు. ఇదంతా బాగానే ఉన్నా... త‌మ నియోజ‌క‌వ‌ర్గాల్లో పెద్ద ఎత్తున స‌మ‌స్య‌లు తిష్ట వేశాయ‌ని, వాటిని ప‌రిష్క‌రించ‌క‌పోతే చాలా ఇబ్బందిక‌ర వాతావ‌రణం త‌ప్ప‌ద‌ని ఎమ్మెల్యేలు - ఎమ్మెల్సీలు - చివ‌ర‌కు ఎంపీలు కూడా నిత్యం కేటీఆర్‌ ల‌ను క‌లుస్తూనే ఉంటారు. అయితే వారంద‌రి ఎదుట‌య బీద అరుపులు అరిచే కేటీఆర్‌... త‌న సోద‌రి రాగానే ఒకే విడ‌త‌లో రూ.150 కోట్ల‌ను విడుద‌ల చేయ‌డం ఇప్పుడు స‌ర్వ‌త్రా చ‌ర్చ‌కు తెర లేపింద‌ని చెప్పాలి.
Tags:    

Similar News