పంచ్ అదిరింది.. డబుల్ ఇంజిన్ సర్కారుకు కొత్త అర్థం చెప్పేశారు

Update: 2022-07-16 10:30 GMT
దేశంలో ఇప్పుడున్న రాజకీయ పరిస్థితుల్లో ఎవరు మంచి? ఎవరు చెడు? అన్న ప్రశ్నలకు మించిన క్లిష్టమైన.. కష్టమైన ప్రశ్నలు మరొకటి ఉండవు. కేంద్రంలోని మోడీ సర్కారు కానీ తెలుగు రాష్ట్రాల్లోని కేసీఆర్.. జగన్ సర్కారులో కానీ మంచి ఏంటి? చెడు ఏంటి? మంచోళ్లు ఎవరు? చెడ్డోళ్లు ఎవరు? లాంటి ప్రశ్నలు వేస్తే సమాధానాలు ఎవరూ చెప్పలేరు.

ఎవరికి వారు వారికి సంబంధించిన మంచిని మాత్రమే చెప్పుకోవటం తప్పించి.. తప్పుల్ని ఒప్పుకునే పెద్ద మనసు ఎప్పుడో చిన్నదైపోయింది. వ్యక్తిత్వ వికాస నిపుణుడిగా తన మాటలతో మనసు దోచే ప్రధాని నరేంద్ర మోడీ సైతం.. వేలెత్తి చూపించుకునేలా నిర్ణయాలు తీసుకుంటున్న పరిస్థితి.

గతంలోని కేంద్ర ప్రభుత్వాలతో పోల్చినా.. ప్రధానమంత్రులతో పోల్చినా.. మోడీ మిగిలిన వారికి చాలా భిన్నమని చెప్పాలి. కేంద్రాన్ని మరింత బలోపేతం చేయటాన్ని అర్థం చేసుకోవచ్చు కానీ.. తాము టార్గెట్ చేసిన రాష్ట్రాల్లో అధికారం కోసం దేనికైనా సిద్దమన్నట్లుగా వ్యవహరించే తీరుతోనే ఇబ్బంది అంతా. ఆయన మాటలకు చేసే చేతలకు ఏ మాత్రం పొంతన లేకుండా ఉంటున్న వ్యవహారాలపై పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

ఇటీవల కాలంలో కమలనాథుల నోట తరచూ వినిపించే మాటల్లో ఒకటి డబుల్ ఇంజిన్ సర్కార్. కేంద్రంలోనూ.. రాష్ట్రంలోనే ఒకే పార్టీ అధికారంలో ఉంటే డబుల్ ఇంజిన్ సర్కారు అవుతుందని.. దాంతో డెవలప్ మెంట్ మరింత వేగంగా దూసుకెళుతుందన్న మాట విన్నప్పుడు బాగానే ఉంటుంది కానీ.. అలాంటి పరిస్థితి కోసం మోడీ పార్టీ అనుసరిస్తున్న విధానాలే వేలెత్తి చూపించేలా ఉంటున్నాయి.

తాజాగా బీజేపీ నేతల నోటి నుంచి వినిపిస్తున్న డబుల్ ఇంజిన్ సర్కార్ కు బలమైన సమాధానం ఇచ్చారు మంత్రి కేటీఆర్. డబుల్ ఇంజిన్ సర్కార్ అంటే మోడీ.. ఈడీ అన్న మంత్రి కేటీఆర్.. ‘ముఖ్యమంత్రి కేసీఆర్ దేనికీ బెదరరు’’ అంటూ వ్యాఖ్యానించటం గమనార్హం. మామూలుగా చెప్పినట్లు చెప్పినా.. విన్నంతనే ప్రజల మనసుల్లో ఇట్టే రిజిస్టర్ అయ్యేలా కేటీఆర్ పంచ్ ఉందని చెప్పాలి.

డబుల్ ఇంజిన్ సర్కారు అన్న మాటకు కేటీఆర్ చెప్పిన అర్థం తర్వాత కమలనాథుల నోటి నుంచి డబుల్ ఇంజిన్ సర్కారు అన్న మాట రావాలంటే కాస్తంత ఇబ్బంది పడేలా తాజా పంచ్ ఉందన్న మాట వినిపిస్తోంది. ఏమైనా ఇప్పటివరకు తమ గొప్పగా చెప్పుకునే డబుల్ ఇంజిన్ సర్కార్ అన్న మాటకు కేటీఆర్ కౌంటర్ ను రాబోయే రోజుల్లో ఇతర రాష్ట్రాలకు చెందిన నేతలు వాడేసినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదని చెప్పక తప్పదు.
Tags:    

Similar News