బాబే టార్గెట్‌.. ఎందుకో చెప్పిన కేటీఆర్‌!

Update: 2018-10-14 05:32 GMT
తెలంగాణ రాష్ట్ర తాజా మాజీ మంత్రి కేటీఆర్ ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. త‌మ‌కు కాంగ్రెస్ ప్ర‌త్య‌ర్థే కాదన్నారు. త‌మ టార్గెట్ అంతా చంద్ర‌బాబు నాయుడేన‌న్న ఆయ‌న ఎందుకో చెప్పుకొచ్చారు. ముంద‌స్తు ఎన్నిక‌ల‌కు సంబంధించిన ప్ర‌క‌ట‌న చేసిన నాటి నుంచి కాంగ్రెస్ ను ల‌క్ష్యంగా చేసుకొని.. ఆ పార్టీని.. ఆ పార్టీకి చెందిన నేత‌ల్ని ఉతికి ఆరేస్తున్న త‌న తండ్రి కేసీఆర్ తీరుకు భిన్నంగా కేటీఆర్ తాజా వ్యాఖ్య‌లు ఉన్నాయి.

శ‌నివారం మీడియా ప్ర‌తినిధుల‌తో మాట్లాడిన కేటీఆర్.. తెలంగాణ ప్ర‌జ‌ల‌ను ఆకాశానికి ఎత్తేశారు. "ఎవ‌రినైనా ఒక‌సారి న‌మ్మితే వారి విష‌యంలో న‌మ్మ‌కంగా ఉండ‌టం.. న‌మ్మితే ప్రాణాలు ఇవ్వ‌టం తెలంగాణ ప్ర‌జ‌ల స్వ‌భావ‌మ‌ని.. అందుకే రూ.వెయ్యి పింఛ‌న్ ఇచ్చిన కేసీఆర్ ను వారు న‌మ్ముతున్నారు. పేద‌లు ఒక‌ప్పుడు ఇందిరాగాంధీని.. ఆ త‌ర్వాత ఎన్టీఆర్ ను సొంత మ‌నుషులుగా భావించారు. వాళ్లంతా ఇప్పుడు కేసీఆర్ వైపు వ‌చ్చేశారు" అని చెప్పారు.

త‌మ టార్గెట్ కాంగ్రెస్ ఎంత మాత్రం కాద‌ని.. ఏపీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబే త‌మ అస‌లు ల‌క్ష్య‌మ‌న్నారు కేటీఆర్‌. తెలంగాణ ప్ర‌జ‌ల‌తో కేసీఆర్ ది భావోద్వేగ బంధంగా అభివ‌ర్ణించిన కేటీఆర్‌.. ఇది చాలా దృఢ‌మైన‌ది.. దీన్ని ఎవ‌రూ విచ్చిన్నం చేయ‌లేర‌న్నారు. పీసీసీ చీఫ్ ఉత్త‌మ్ కుమార్ అనే ప‌ప్పెట్ ను ముందు పెట్టి టీడీపీ అధ్య‌క్షుడు చంద్ర‌బాబు తోలుబొమ్మ‌లాట ఆడిస్తున్నార‌ని మండిప‌డ్డారు.

త‌మ టార్గెట్ చంద్ర‌బాబు ఎందుకో చెప్పిన కేటీఆర్‌.. సీఎం చంద్ర‌బాబు తెలంగాణ ప్ర‌యోజ‌నాల‌కు గండి కొడుతుంటే ఎలా అంగీక‌రిస్తామ‌ని ప్ర‌శ్నించారు. అందుకే తాము కాంగ్రెస్ ను సీరియ‌స్ గా తీసుకోకుండా బాబునే టార్గెట్ చేస్తున్నామ‌న్నారు. ఆయ‌న సైబ‌రాబాద్ క‌ట్టిన మొగోడు.. మొన‌గాడే అయితే ఐదేళ్ల‌లో అమ‌రావ‌తిని ఎందుకు నిర్మించ‌లేక‌పోయారు?  అని ప్ర‌శ్నించిన కేటీఆర్‌.. జీహెచ్ ఎంసీ ఎన్నిక‌ల్లో బాబు.. లోకేశ్ తిరిగితే ఏమైందో చూశామంటూ ఎద్దేవా చేశారు.

అప్ప‌ట్లో హైద‌రాబాద్ లోక‌ల్ అని చెప్పుకున్న లోకేశ్‌.. త‌ర్వాత కాలంలో ఏపీకి మంత్రి అయ్యార‌న్నారు. బాబు ఆయ‌న్ను ఏపీ మంత్రిని చేసి తెలంగాణ‌లో టీడీపీ లేద‌ని సంకేతం ఇచ్చారు. టీడీపీ అధినేత ఏపీలో ఉంటే.. ఇక్క‌డ పార్టీ ఎందుకు ఉంటుంది? అని ప్ర‌శ్నించారు. గ‌తంలో టీఆర్ఎస్ అంటే సీమాంధ్రులు కోపంగా ఉండేవార‌ని.. గ్రేట‌ర్ ఎన్నిక‌ల నాటికి టీఆర్ఎస్ వైపున‌కు వ‌చ్చేసిన‌ట్లు చెప్పారు. కేటీఆర్ చెప్పిన‌ట్లు కాంగ్రెస్ అంత పిచ్చ లైట్ అయితే.. మ‌రి మీ తండ్రిగారు నెహ్రు.. ఇందిర ఇలా అంద‌రిని బండ‌కేసి బాదేసిన‌ట్లుగా అంతేసి తీవ్ర విమ‌ర్శ‌లు ఎందుకు చేసిన‌ట్లు..?

Tags:    

Similar News