పవర్ కట్ చేస్తాం: కేంద్రానికి, కంటోన్మెంట్ కు షాకిచ్చిన కేటీఆర్

Update: 2022-03-12 15:06 GMT
హైదరాబాద్ లో ఉంటూ తెలంగాణ ప్రభుత్వానికి సహకరించకుండా.. ప్రజలను ఇబ్బందులు పెడుతున్న కంటోన్మెంట్ పై మంత్రి రెచ్చిపోయారు. సీరియస్ వార్నింగ్ ఇచ్చారు. కేంద్రం ఇలాగే వ్యవహరించే ‘పవర్’ కట్ చేస్తామని హెచ్చరించారు. కేంద్రంలోని బీజేపీపై టీఆర్ఎస్ మంత్రి నేరుగా మాటల దాడి చేశారు.

తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ మరోసారి కేంద్రంపై విరుచుకుపడ్డారు. అసెంబ్లీ వేదికగా కంటోన్మెంట్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు కేటీఆర్. హైదరాబాద్ నాలా అభివృద్ధిపై అసెంబ్లీలో సభ్యుల ప్రశ్నలకు సమాధానమిచ్చే క్రమంలో కేటీఆర్ ఈ వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ ప్రజల కోసం ఎంతకైనా తెగిస్తామని తేల్చిచెప్పారు కేటీఆర్. ఈ సందర్భంగా కంటోన్మెంట్ కు గట్టిగానే వార్నింగ్ ఇచ్చారు.

కేటీఆర్ మాట్లాడుతూ.. ‘కంటోన్మెంట్ ఏరియాలో నాలాలపై చెక్ డ్యామ్ లు కట్టడం వల్ల కాలనీలు మునిగిపోతున్నాయి. ఎన్నిసార్లు చెప్పినా అక్కడి అధికారులు తీరు మార్చుకోవడం లేదు. ఇకపై చూస్తూ ఊరుకోం.  ప్రజల కోసం తీవ్ర చర్యలు తీసుకోవాల్సి వస్తే కంటోన్మెంట్కు నీళ్లు , కరెంట్ కట్ చేస్తామని’ కేటీఆర్ హెచ్చరించారు.

అధికారులతో ఆఖరిసారి చర్చలు జరపాలని.. వినకపోతే నీళ్లు, కరెంట్ కట్ చేయాలని.. అసెంబ్లీలో ఉన్న స్పెషల్ చీఫ్ సెక్రటరీకి మంత్రి కేటీఆర్ సంచలన ఆదేశాలిచ్చారు.

గతంలో చాలా సార్లు కంటోన్మెంట్ ఇష్యూపై మాట్లాడిన కేటీఆర్.. ఇప్పుడు ఈ స్థాయిలో వార్నింగ్ ఇవ్వడం సంచలనం రేపుతోంది. కంటోన్మెంట్ అంటే హైదరాబాద్ తో కలిసి మెలిసి ఉండాలని.. ఇలా ఇష్టానుసారం వ్యవహరిస్తామంటే చూస్తూ ఊరుకోబోమని కేటీఆర్ స్పష్టం చేశారు.


Tags:    

Similar News