కేసీఆర్‌ పై కేటీఆర్ షాకింగ్ కామెంట్స్

Update: 2020-02-13 11:30 GMT
త్వ‌ర‌లోనే కేటీఆర్ సీఎం కాబోతున్నారంటూ తెలంగాణ రాజ‌కీయాల్లో జోరుగా ప్ర‌చారం జ‌రుగుతోన్న సంగ‌తి తెలిసిందే. కేటీఆర్‌కు కేసీఆర్ ప‌ట్టాభిషేకం చేయ‌బోతున్నారని, ఎంపీగా ఓట‌మి పాలైన క‌విత త్వ‌ర‌లోనే మంత్రి కాబోతోంద‌ని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఇటువంటి నేప‌థ్యంలో త‌న తండ్రి కేసీఆర్ గ‌తంలో తీసుకున్న ఓ నిర్ణ‌యాన్ని కేటీఆర్ త‌ప్పుబ‌ట్టారు. గ‌తంలో పెద్ద‌నోట్ల ర‌ద్దు స‌మ‌యంలో ప్ర‌ధాని మోడీని స‌మ‌ర్థించిన కేసీఆర్ చాలా పెద్ద త‌ప్పు చేశార‌ని సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. అయితే, నోట్ల ర‌ద్దు వ‌ల్ల ప‌రిణామాలు చూసిన త‌ర్వాత నాడు తీసుకున్న నిర్ణ‌యం ప‌ట్ల నేడు కేసీఆర్ చాలా బాధ‌ప‌డుతున్నార‌ని కేటీఆర్ అన్నారు. ‘దేశ నిర్మాణంలో రాష్ట్రాల పాత్ర' అనే అంశంపై ఓ చానెల్ నిర్వ‌హించిన స‌ద‌స్సులో పాల్గొన్న కేటీఆర్....మోడీ స‌ర్కార్‌పై సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు.


తెలంగాణ‌పై కేంద్రం క‌క్ష సాధిస్తోంద‌ని, త‌మ‌కు నిధులివ్వ‌డం లేద‌ని కేసీఆర్, కేటీఆర్ కొంత‌కాలంగా ఆరోపిస్తోన్న సంగ‌తి తెలిసిందే. ప్ర‌ధాని మోడీ నియంతృత్వ విధానాల‌ను కేసీఆర్ వ్య‌తిరేకించినందునే కేంద్రం త‌మ రాష్ట్రాన్ని చిన్న‌చూపు చూస్తోంద‌ని టీఆర్ఎస్ నేత‌లు ఆరోపిస్తున్నారు. ఈ నేప‌థ్యంలోనే తాజాగా అదే విష‌యాన్ని కేటీఆర్ మ‌రోసారి ప్ర‌స్తావించారు. రాష్ట్రాలను కేంద్ర ప్రభుత్వం ఉద్ధరిస్తోందనే భావన స‌రికాద‌ని, కేంద్రానికి రాష్ట్రాలే నిధులు స‌మ‌కూరుస్తున్నాయ‌ని అన్నారు. కేంద్రానికి ఏటా 2.72 లక్షల కోట్లు ప‌న్నులు తెలంగాణ చెల్లిస్తే...తిరిగి రాష్ట్రానికి కేంద్రం ఇచ్చింది 1.12లక్షల కోట్లేనని కేటీఆర్ అన్నారు.



పెద్ద నోట్ల రద్దుపై సీఎం కేసీఆర్ చాలా పెద్ద తప్పు చేశార‌ని, మోడీ మాటల‌పై న‌మ్మ‌కంతోనే నాడు టీఆర్ఎస్ అసెంబ్లీలో తీర్మానం చేసిందని అన్నారు. నోట్ల ర‌ద్దు నిర్ణ‌యం ప‌రిణామాలు చూసి త‌మ త‌ప్పు తెలుసుకున్నామ‌ని అన్నారు. సీఏఏపై త‌మ వైఖ‌రి ఎప్పుడో స్ప‌ష్టం చేశామ‌ని, పార్లమెంటులోనూ సీఏఏకు వ్య‌తిరేక ఓటేశామని కేటీఆర్ చెప్పారు. సీఏఏకు వ్యతిరేకంగా రాష్ట్ర అసెంబ్లీలోనూ తీర్మానం చేస్తామని కేటీఆర్ చెప్పారు. దేశ పురోగతికి కేంద్ర, రాష్ట్రాల మధ్య స‌త్సంబంధాలుండాల‌ని,  మోడీ ప్ర‌భుత్వం ఫెడ‌ర‌ల్ స్ఫూర్తికి తూట్లు పొడుస్తోంద‌ని దుయ్య‌బ‌ట్టారు. త‌మ‌ నిర్ణ‌యాల వ‌ల్ల రాష్ట్రాల్లో జ‌రుగుతున్న‌ ప‌రిణామాల‌పై కేంద్రం నిమ్మ‌కునీరెత్తిన‌ట్లు వ్య‌వ‌హరిస్తోంద‌ని మండిప‌డ్డారు. బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు దేశాన్ని నాశనం చేశాయని, ప్రాంతీయ పార్టీల ఐక్య‌తోనే దేశాభివృద్ధి సాధ్య‌మ‌ని అన్నారు.
Tags:    

Similar News