బాలక్రిష్ణ డైలాగ్ ను గుర్తుకొచ్చేలా చేసిన కేటీఆర్ ట్వీట్

Update: 2022-06-18 09:30 GMT
'డాక్టర్ అయి ఉండి మీరిలా చేయటం ఏంటి?' జిల్లా ఎస్పీ పాత్రధారి మాట. 'ఒక పేషెంట్ బాడీలోకి వైరస్ ప్రవేశిస్తే.. దాన్నెలా చంపేస్తానో.. సమాజం మీదకు వచ్చే వైరస్ ను అలానే చంపేస్తాను ఒక పౌరుడిగా' - సింహలో బాలయ్య పాత్రధారి డైలాగ్ 'పోలీసులం మేం ఉన్నాముగా. యాక్షన్ తీసుకుంటాముగా' - జిల్లా ఎస్పీ పాత్రధారి మాట 'పోలీస్.. ఎక్కడ? కల్తీ జరిగిందని నిలదీసిన రైతును అదే కల్తీ మందును నోట్లో పోసి చంపితే నో పోలీస్. కాంట్రాక్టర్లను చంపేసి.. టెండర్లు పిలిచిన లేడీ ఆఫీసర్ ను తీసుకెళ్లి రేప్ చేస్తే.. నో పోలీస్. ఇదేంటని ప్రశ్నిస్తే దారుణంగా చంపేసినప్పుడు నో పోలీస్. కల్తీ పాలకు 60 మంది పసి ప్రాణాలు గాల్లో కలిసి పోతే.. ఆ తల్లిదండ్రుల్ని ఓదార్చటానికి నో పోలీస్. పోలీస్ స్టేషన్ కు వెళ్లిన పాపానికి 300 మందిని మూర్ఖంగా చంపి.. బావిలో పాతేస్తే నో పోలీస్. అప్పుడు లేవని నోరు.. ఆఫ్ట్రాల్ ఒక క్రిమినల్ ను చంపితే నోరు లేస్తుందేం?

చాలా పాపులర్ డైలాగ్ ఇది. సింహ సినిమాలో బాలకృష్ణ పాత్రకు.. జిల్లా ఎస్పీ పాత్రకు మధ్య జరిగే సంభాషణ ఇది. తాజాగా తెలంగాణ రాష్ట్రంలో చోటు చేసుకుంటున్న పరిణామాలు.. అందుకు అధికారపక్షం స్పందిస్తున్న తీరును చూసినప్పుడు చప్పుడు ఈ సీన్ యాదికి రావటం ఖాయం. సినిమాలో సీన్ మాదిరి యథాతధంగా పరిస్థితి ఉందని చెప్పటం మా ఉద్దేశం కాదన్నది మర్చిపోకూడదు.కేంద్రంలోని మోడీ సర్కారు తీసుకొచ్చిన అగ్నిపథ్ కు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున విధ్వంసం చోటు చేసుకుంటున్న సంగతి తెలిసిందే. ఆర్మీలో చేరాలనుకునే వారికి సంబంధించి కొత్తగా తీసుకొచ్చి మార్గదర్శకాలపై తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. బిహార్ తో పాటు మరికొన్ని రాష్ట్రాల్లోని రైల్వే స్టేషన్లలో విధ్వంసకాండ సాగింది. అందుకు ఏ మాత్రం తగ్గని రీతిలో సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో చోటు చేసుకున్న ఆరాచకం చూస్తే.. ముక్కున వేలేసుకోవాల్సిందే.

సమస్య ఏదైనా కావొచ్చు. దాన్ని ప్రశ్నించి.. సాధించుకోవటానికి ఒక పద్దతి ఉంది. అందుకు భిన్నంగా సామాన్యుల్ని భయాందోళనలకు గురి చేస్తూ.. విధ్వంసాన్ని క్రియేట్ చేసి.. ప్రభుత్వ ఆస్తుల్ని తీవ్రంగా నష్టపరిచే వారిలో విషయంలో పార్టీలు తమ రాజకీయాల్ని పక్కన పెట్టి సమస్య తీవ్రతను గుర్తించాల్సిన అవసరం ఉంది. అందుకు భిన్నంగా వ్యవహరిస్తే విమర్శలకు గురి కాక తప్పదు. తాజాగా తెలంగాణ రాష్ట్ర మంత్రి కేటీఆర్ సంగతే తీసుకుంటే.. గడిచిన నాలుగు రోజులుగా బాసర ట్రిపుల్ ఐటీలోని వేలాది మంది విద్యార్థులు తమ సమస్యల పరిష్కారం కోసం నిరసన చేపట్టారు. శాంతియుతంగా సాగుతున్న ఈ నిరసనపై విపక్ష పార్టీలు సైతం స్పందిస్తున్నాయి. కానీ.. వారి వెతల్ని తీరుస్తామంటూ మంత్రి కేటీఆర్ ఇప్పటివరకు ఒక్క ట్వీట్ చేయలేదు.

విద్యార్థులు సైతం తమ వద్దకు ముఖ్యమంత్రి కేసీఆర్ కానీ మంత్రి కేటీఆర్ కానీ వచ్చి.. తమ సమస్యల పరిష్కారం మీద హామీ ఇస్తే తాము ఆందోళనను విరమిస్తామని చెబుతున్నారు. అయినప్పటికీ ప్రభుత్వం వైపు నుంచి ఇప్పటివరకు ఎలాంటి స్పందన లేకపోవటం తెలిసిందే. అదే సమయంలో అగ్నిపథ్ నిర్ణయాన్ని నిరసిస్తూ దాదాపు 1500 మంది ఆందోళకారులు ఒక పథకం ప్రకారం సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లోకి చేరి.. కనివిని ఎరుగని విధ్వంసాన్ని క్రియేట్ చేసిన అంశంపై గంటల వ్యవధిలోనే స్పందించారు మంత్రి కేటీఆర్.

ఆస్తుల విధ్వంసాన్ని.. వేలాది మంది ప్రయాణికుల్ని భయాందోళనకు గురి చేసి.. ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని పరుగులు తీసేలా చేసిన వారి వెతలు పట్టని మంత్రి కేటీఆర్ అందుకు భిన్నంగా కేంద్రం తీరుపై మండిపడ్డారు. తాజా నిరసన జ్వాలలు దేశంలోని నిరుద్యోగ సమస్యను ప్రతిబింబిస్తున్నట్లుగా తన ట్విటర్ ఖాతాలో పేర్కొన్నారు. 'అగ్నివీర్ పథకంపై జరుగుతోన్న హింసాత్మక ఆందోళనలు.. దేశంలో నిరుద్యోగ సంక్షోభ తీవ్రతను తెలిపే కచ్ఛితమైన సూచికలు. అప్పుడు అన్నదాతల జీవితాలతోఆడుకున్నారు. ఇప్పుడు జవాన్ల జీవితాలతో ఆడుకుంటున్నారు. మొన్నటికి మొన్న ఒకే ర్యాంక్.. ఒకే పింఛన్ విధానాన్ని తీసుకొచ్చి.. నేడు ర్యాంకు లేదు.. పింఛను లేదంటూ ట్వీట్ చేశారు.

ఓవైపు రైల్వేస్టేషన్ లో పెద్ద ఎత్తున హింస జరుగుతున్న వేళ.. కేంద్రంపై విమర్శలు చేసే కన్నా.. హింసాత్మక చర్యల కట్టడి మీద ఫోకస్ పెట్టాలి కదా? అలా కాదు.. కేంద్రం తీరును తప్పుపట్టాల్సిందే అన్నప్పుడు.. మరి రాష్ట్ర ప్రభుత్వ తీరును తప్పు పడుతూ బాసర ట్రిపుల్ ఐటీ విద్యార్థుల మాటేమిటి? సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ఎపిసోడ్ లో వెంటనే స్పందించి ట్వీట్ చేసిన కేటీఆర్ కు.. ట్రిపుల్ ఐటీ విద్యార్థుల విషయంలో నాలుగు రోజులుగా 'నో ట్వీట్' ఎందుకన్నది ప్రశ్న. అంతేనా.. గౌరెల్లి భూనిర్వాసితుల విషయంలోనూ పోలీసులు వ్యవహరించిన తీరుపై పెద్ద ఎత్తున నిరసన  వ్యక్తమవుతున్నా.. ఇంతవరకు 'నో ట్వీట్' ఏమిటన్న ప్రశ్న వ్యక్తమవుతోంది.
Tags:    

Similar News