‘నిజాంపేట’ గోస కేసీఆర్ చెవిన పడింది

Update: 2016-09-23 05:53 GMT
ఏదైనా విషయంపై తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఫోకస్ పడిందంటే చాలు.. దాని సంగతి చివరకంటా చూసే వరకూ నిద్రపోరు. ఈ లక్షణం ఉన్న ఆయన దృష్టికి పడాల్సిన అంశమేపడిందని చెప్పాలి. ఇటీవల కాలంలో కురుస్తున్న అతి భారీ వర్షాల కారణంగా నిజాంపేటలోని బండారి లేఅవుట్ లో దారుణ పరిస్థితి నెలకొన్న సంగతి తెలిసిందే. సమీపంలోని చెరువు పొంగిపొర్లటం.. బండారీ లేఔట్ మొత్తం జలమయం కావటం.. అక్కడి నీటి ఉదృతి మీడియాలో చూసినోళ్లంతా షాక్ తినే పరిస్థితి.

చాలా తక్కువ వ్యవధిలో హైదరాబాద్ లో అత్యంత వేగంగా అభివృద్ధి చెందిన ప్రాంతం ఏదైనా ఉందంటే అది నిజాంపేట అనే చెప్పాలి. విపరీతమైన జనసమ్మర్థంతో పాటు.. నివాసిత ప్రాంతాలు అత్యధికంగా ఉన్న ప్రాంతంగా చెబుతారు. హైటెక్ సిటీకి పది కిలోమీటర్ల దూరంలో ఉండటం.. నగరానికి మధ్యలో ఉండటం.. ఒక మోస్తరు ధరలతో భవనాలు లభించటంతో ఈ ప్రాంతానికి జనాలు పోటెత్తారు. మధ్యతరగతి జీవుల ఆశల్ని క్యాష్ చేసుకునే లక్ష్యంతో బిల్డర్లు వ్యవహరించటంతో నిజాంపేట కాంక్రీట్ జంగిల్ గా మారిపోయిన పరిస్థితి.

ఇరుకైన రహదారులు.. సన్నగా ఉండే సందుల్లో కళ్లు చెదిరే బిల్డింగ్ లు నిజాంపేటలో బోలెడన్ని కనిపిస్తాయి. నిత్యం విపరీతంగా ఉండే ట్రాఫిక్ తో పాటు.. మెజార్టీ ఇళ్లకు తాగునీటి సౌకర్యం లేకున్నా.. రోజువారీగా ట్యాంకర్లను కొనుగోలు చేసి బతుకు బండి లాగించే ఐటీ జీవులే ఇక్కడ ఎక్కువగా కనిపిస్తారు. అలాంటి నిజాంపేటలోని ఒక ఫేమస్ ప్లేస్ గా భండారీ లేఅవుట్ గా చెప్పాలి. బొమ్మరిల్లును తలపించేలా ఉండే ఈ లేఅవుట్ లోని బిల్డింగుల్లో చాలావరకూ నిబంధనల్ని విస్మరించిన నిర్మించారన్న ఆరోపణ వినిపిస్తుంటుంది. అయితే..ఇలాంటి విషయాలపై అవగాహన పెద్దగా లేని ఐటీజీవులు తమ కష్టార్జితాన్ని ఇక్కడ కుమ్మరించటం.. కనీస మౌలిక వసతులు లేకున్నా బతికేయటం ఏళ్లకు ఏళ్లుగా ఒక అలవాటుగా మారింది.

ఇటీవల కురిసిన అతి భారీ వర్షపాతంతో నిజాంపేట ముచ్చట మీడియాలో పతాక శీర్షికకు ఎక్కింది. ఇక్కడి వరద తీవ్రత.. జనాల కష్టాలు పాలకుల్ని ఎంతగా కదిలించాయంటే.. మంత్రి కేటీఆర్ స్వయంగా ఈ ప్రాంతంలో పర్యటించి.. పరిస్థితిని సమీక్షించటంతో పాటు.. సహాయక చర్యల్ని ముమ్మరం చేయాలని ఆదేశించారు. ఇదిలా ఉంటే.. నిజాంపేటలోని భండారీ లేఅవుట్ లోని ప్రజల కష్టాలపై ఢిల్లీలోని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ దృష్టికి వెళ్లింది. గురువారం రాత్రి అధికారులతో మాట్లాడిన ఆయన.. నిజాంపేట భండారీ లేఅవుట్ గురించి ప్రత్యేకంగా ప్రస్తావించటంతో పాటు.. అక్కడి ప్రజల వెతల్ని తీర్చాలని ప్రత్యేకంగా ఆదేశించారు.

తాజా పరిణామాల నేపథ్యంలో కేసీఆర్ దృష్టి భండారీ లేఅవుట్ మీద పడుతుందని.. దీని చరిత్ర మొత్తాన్ని కేసీఆర్ తెలసుకోవటం ఖాయమని చెబుతున్నారు. మరింత ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. భారీ బిల్డింగులతో మరో హైటెక్ సిటీ అన్నట్లుగా కనిపించే నిజాంపేట ఇప్పటికీ పంచాయితీలోనే ఉండిపోయింది. దీనికి లోకల్ రాజకీయాలే కారణంగా చెబుతారు. నిజాంపేటకు కూతవేటు దూరంలో ఉండే బాచుపల్లితో సహా పలు ప్రాంతాలు గ్రేటర్ లో కలవాల్సి ఉన్నా.. అక్కడి స్థానిక రాజకీయ నేతల కారణంగా పంచాయితీలుగా ఉండిపోతున్నాయి. దీంతో. ప్రభుత్వ దృష్టి పడని పరిస్థితి. తాజాగా పరిస్థితుల దృష్ట్యా కేసీఆర్ దృష్టికి నిజాంపేట చరిత్ర మొత్తం వెళ్లటం ఖాయమని చెబుతున్నారు. ఇంతకాలం నిజాంపేట ప్రజలు ఎదుర్కొంటున్న ఏన్నో సమస్యలకు పరిష్కారం లభిస్తుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. మరి.. కేసీఆర్ ఏం చేస్తారో చూడాలి.
Tags:    

Similar News