వైరస్ తో కానిస్టేబుల్ మ‌ృతి..తెలంగాణలో తోలి మరణం !

Update: 2020-05-21 12:31 GMT
వైరస్ కారణంగా పోలీస్ కానిస్టేబుల్ మరణించడంతో తెలంగాణ పోలీసు శాఖలో కలకలం సృష్టించింది. హైదరాబాద్ నగరంలోని కుల్సుంపురా పోలీసు స్టేషన్ ‌లో విధులు నిర్వహిస్తున్న పోలీసు కానిస్టేబుల్ దయాకర్ రెడ్డి బుధవారం రాత్రి 10.30 గంటల సమయంలో తుదిశ్వాస విడిచారు. కాగా తెలంగాణ పోలీసు శాఖలో ఇది తొలి కరోనా మరణంగా నమోదయ్యింది. ఇప్పటివరకు తెలంగాణ పోలీస్ శాఖ లో ఏడుగురికి వైరస్ సోకింది.

నల్గొండ జిల్లాకు చెందిన కానిస్టేబుల్ హైదరాబాద్‌ వనస్థలిపురంలో ఉంటున్నారు. ఇతనికి భార్య, ఇద్దరు పిల్లలు కాగా.. కుల్సుంపురా పోలీసు స్టేషన్‌లో విధులు నిర్వహిస్తున్నారు. 2007 బ్యాచ్‌కి చెందిన కానిస్టేబుల్.. గత 15 రోజుల నుంచి పురణాపూల్ చెక్ పోస్ట్ వద్ద టూ వీలర్స్ చెక్ చేస్తున్నారు. అయితే ఈ ప్రాంతం కరోనా పాజిటివ్ కేసులు ఎక్కువ సంఖ్యలో నమోదైన జియాగూడ మార్కెట్‌కు సమీపంలో ఉంది. కానిస్టేబుల్ దయాకర్ రెడ్డికి కరోనా జియాగూడ మార్కెట్ నుంచి సోకి ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు.

అక్కడ విధులు నిర్వర్తించే సమయంలో టెంపరేచర్ పెరగడంతో అతనిని ఈ నెల 13వ తేదీన ప్రైవేట్ ఆస్పత్రిలో చేర్చారు. రెండురోజులకు అతనికి కరోనా వైరస్ సోకిందని వైద్యులు నిర్ధారించారు. దీంతో అతనిని గాంధీ ఆస్పత్రికి తరలించారు. కానీ అతను వైద్యానికి స్పందించడం లేదని, బుధవారం రాత్రి 10.30 గంటలకు చనిపోయాడని డాక్టర్లు తెలిపారు. దయాకర్ రెడ్డి మరణ వార్త తెలియగానే కుల్సుంపురా పోలీసు స్టేషన్‌లో పనిచేస్తున్న సిబ్బందితో పాటు సీనియర్ అధికారులను క్వారంటైన్ చేశారు.

ఈ ఘటన పై తెలంగాణ డీజీపీ మహేందర్ రెడ్డి ట్విట్టర్ ద్వారా స్పందించారు. వైరస్ సోకి గత రాత్రి హైదరాబాద్‌ లోని గాంధీ ఆస్పత్రిలో దయాకర్ రెడ్డి అనే కానిస్టేబుల్ చనిపోయినట్లు తెలంగాణ డీజీపీ మహేందర్ రెడ్డి ట్వీట్ చేశారు. అతని కుటుంబానికి ప్రగాఢ సానుభూతి ప్రకటిస్తున్నట్లు తెలిపారు. కానిస్టేబుల్ కుటుంబానికి రాష్ట్ర ప్రభుత్వంతో పాటు తెలంగాణ పోలీస్ శాఖ అండగా ఉంటుందని డీజీపీ మహేందర్ రెడ్డి ట్విట్టర్ ద్వారా తెలిపారు.
Tags:    

Similar News