ఫైన‌ల్లో కాంట్ర‌వ‌ర్సీ త్రో పై స్పందించిన ధ‌ర్మ‌సేన‌!

Update: 2019-07-21 16:49 GMT
ప్రపంచకప్ క్రికెట్ ఫైనల్ మ్యాచ్ చాలా వివాస్పదంగా ముగిసిన సంగతి తెలిసిందే. ఫైనల్ ముగిసిన వారం రోజులకు కూడా దీని పై ప్రపంచ వ్యాప్తంగా అనేక విమర్శలు.. సందేహాలు తలెత్తుతున్నాయి. ముఖ్యంగా ఫైనల్లో చివరి ఓవర్లో న్యూజిలాండ్ ఆటగాడు మార్టిన్ గప్టిల్ వేసిన త్రో ఇంగ్లండ్ బ్యాట్స్‌ మెన్ బెన్ స్టోక్స్ బ్యాట్ కు తగిలి బౌండరీకి వెళ్లడంతో ధర్మసేన ఆ బంతికి మొత్తం ఆరు పరుగులు ప్రకటించి అందరికి షాక్ ఇచ్చాడు. అప్పటివరకు న్యూజిలాండ్ వైపు ఉన్న‌ మ్యాచ్ కాస్తా ఒక్క‌సారిగా ఈ బాల్ త‌ర్వాత ఇంగ్లాండ్ వైపు మళ్ళింది. గప్టిల్ విసిరిన బంతి బెన్‌ స్టోక్స్ బ్యాట్‌ కు తాకి బౌండరీకి వెళ్లడంతో ఫీల్డ్ అంపైర్ ధర్మసేన అప్పటి వరకు బ్యాట్స్‌మెన్ చేసిన రెండు పరుగులుకు .. ఫోర్ కూడా క‌లిపి మొత్తం ఆరు ప‌రుగులు ఇచ్చాడు.

అయితే వాస్త‌వంగా ఈ బంతికి ఐదు ప‌రుగులే ఇవ్వాల‌ని నిబంధ‌న‌లు చెపుతున్నాయి. బంతి బౌండ‌రీ లైన్ తాకేట‌ప్ప‌ట‌కీ బ్యాట్స్‌ మెన్ చేసిన ప‌రుగులు మాత్ర‌మే లెక్క‌లోకి తీసుకోవాలి. అప్ప‌ట‌కీ ఇంగ్లండ్ బ్యాట్స్‌ మెన్స్ ఒక్క ప‌రుగే కంప్లీట్ చేశారు. ఈ ప‌రుగుతో పాటు ఓవ‌ర్ త్రో నాలుగు ప‌రుగులు క‌లిస్తే ఐదు ప‌రుగులే వెళ‌తాయి. చివ‌ర‌కు ఈ బాల్ మ్యాచ్ ఫ‌లితాన్నే మార్చేసింది. ఐసీసీ బెస్ట్ అంఫైర్లు సైతం ఆరు ప‌రుగులు ఇవ్వ‌డాన్ని త‌ప్పుప‌ట్టారు. ఇదిలా ఉంటే వారం రోజుల త‌ర్వాత దీనిపై స్పందించిన అంపైర్ ధ‌ర్మ‌సేన త‌న త‌ప్పు స‌మ‌ర్ధించుకునే ప్ర‌య‌త్నం చేశాడు.

తాను ఒక డెసిష‌న్ తీసుకున్నాక మ‌ళ్లీ దాని గురించి ఆలోచించ‌న‌ని చెప్పాడు. త‌న నిర్ణ‌యంలో త‌ప్పు జ‌రిగింద‌న్న విష‌యం టీవీ రిప్లే చూసిన‌ప్పుడే త‌న‌కు కూడా తెలిసింద‌ని.. మాకు గ్రౌండ్‌లో పెద్ద టీవీలు లేవ‌ని.. నిర్ణ‌యం తీసుకున్నాక చింతించే అల‌వాటు త‌న‌కు లేద‌ని... ఈ బాల్‌కు ఆరు ప‌రుగులు ఇచ్చే ముందు లెగ్ అంపైర్‌ తో కూడా సంప్ర‌దించాన‌ని... ఆ టైంలో డెసిష‌న్ థ‌ర్డ్ అంపైర్‌ కు ఇవ్వాల‌న్న నిబంధ‌న క్రికెట్ చ‌ట్టంలో లేద‌ని చెప్పాడు. ధ‌ర్మ‌సేన త‌న నిర్ణ‌యం త‌ప్ప‌ని ఒప్పుకుంటూనే ప‌లు ర‌కాలుగా స‌మ‌ర్థించుకునే ప్ర‌య‌త్నం చేయ‌డం విచిత్రం. ఆ టైంలో త‌మ నిర్ణ‌యాన్ని ఐసీసీ కూడా ప్ర‌శంసించింద‌ని ధ‌ర్మ‌సేన తెలిపాడు.
 
Tags:    

Similar News