సీఎంగా దిగిపోతూ బంప‌ర్ ఆఫ‌ర్ ఇచ్చిన కుమార‌స్వామి

Update: 2019-07-25 14:30 GMT
దేశవ్యాప్తంగా అందరి దృష్టిని ఆకర్షించి తీవ్ర ఉత్కంఠ రేపిన కన్నడ రాజకీయంలో చివరకు ముఖ్యమంత్రి కుమారస్వామి అవిశ్వాస పరీక్షలో ఓడి తన మంత్రి పదవికి రాజీనామా చేయక తప్ప లేదు. ప్రస్తుతం ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా ఉన్న కుమారస్వామి తన పదవికి రాజీనామా చేసే ముందు కర్ణాటకలోని పేదలకు బంపర్ ఆఫర్ ఇచ్చారు. కర్ణాటకలోని పేద ప్రజలు తీసుకున్న పలు రకాల ప్రైవేట్ రుణాలన్నీ మాఫీ కావటానికి ఆయన ప్రత్యేక చట్టం చేశారు. ఈ నిబంధన ప్రకారం రుణాలు ఇచ్చిన సంబంధిత వ్యక్తులు - సంస్థలకు ప్రభుత్వం నగదు బదిలీ చేయనుంది.

వాస్తవానికి మంగళవారం కుమారస్వామి తన పదవికి రాజీనామా చేసినా ప్రస్తుతం ఆయన ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా ఉన్నారు. సీఎం పదవికి రాజీనామా చేయడానికి ముందే కుమారస్వామి ప్రత్యేక రుణ మాఫీ చట్టం అమలు చేశారు. ఇక గత సంవత్సరం నుంచి ఈ ప్రత్యేక రుణమాఫీ చట్టం అమలు చేయడానికి ప్రయత్నాలు చేస్తామని కూడా ఆయన వివరించారు. ఈ క్రమంలోనే ఆయన మీడియాతో మాట్లాడుతూ తాను ముఖ్యమంత్రి పదవి నుంచి దిగిపోతున్నా... చివరి రోజున రాష్ట్రంలోని పేదలకు సహాయం చేసే రుణమాఫీ చట్టం అమలు చేశాన‌న్న సంతోషం మాత్రం తనకు ఎప్పటికీ మిగిలిపోతుందని చెప్పారు.

ఇక ఈ చ‌ట్టం వ‌ల్ల రాష్ట్రంలోని నిరుపేద‌ల్లో చాలా మందికి తాము తీసుకున్న వ్య‌క్తిగ‌త రుణాల (ప్రైవేట్‌) నుంచి విముక్తి క‌లుగుతుంది. ఈ చ‌ట్టం అమ‌లు కావ‌డానికి రాష్ట్ర‌ప‌తి రామ్‌ నాథ్ కోవింద్ సంత‌కం చేశారు. ఈ క్ర‌మంలోనే కుమార‌స్వామి ఆయ‌న‌కు ప్ర‌త్యేక ధ‌న్య‌వాదాలు తెలిపారు. ఈ చ‌ట్టం ప్ర‌కారం బ్యాంకులను మిన‌హాయించి పేద‌లు ప్రైవేటు వ్య‌క్తుల ద‌గ్గ‌ర తీసుకున్న బంగారం రుణాల‌తో స‌హా అన్ని మాఫీ అవుతాయి. చివ‌ర‌కు భూముల ప‌త్రాలు కుద‌వ‌పెట్టి అప్పు తీసుకున్నా దానిని కూడా మాఫీ చేయ‌నున్నారు.

భూములేని నిరుపేద‌ల‌తో పాటు రెండు హెక్టార్ల కంటే త‌క్కువ భూమి ఉన్న రైతుల‌తో పాటు వార్షిక ఆదాయం రూ 1.20 ల‌క్ష‌ల ఉన్న వారికి ఉన్న అన్ని ప్రైవేటు రుణాలు ర‌ద్దు కానున్నాయి. చివ‌ర‌కు ఫైనాన్ష్ సంస్థ‌ల నుంచి తీసుకున్న రుణాలు సైతం మాఫీ అవుతాయి. ఈ చ‌ట్టం అమ‌ల్లోకి రావ‌డంతో కుమార‌స్వామి ప‌ద‌వి నుంచి దిగిపోయినా ఆయ‌నపై రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వారంద‌రు ప్ర‌శంస‌లు కురిపిస్తున్నారు.
Tags:    

Similar News