మరోసారి కుప్పం హీట్‌!

Update: 2022-12-30 10:31 GMT
టీడీపీ అధినేత చంద్రబాబు మరోసారి కుప్పంలో పర్యటించనున్నారు. జనవరి 4, 5, 6 తేదీల్లో కుప్పంలో పర్యటించబోతున్నారు. ఈ నేపథ్యంలో మరోమారు కుప్పం హీట్‌ తప్పదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. గత ఏడు పర్యాయాలుగా 1985 నుంచి ప్రస్తుతం వరకు కుప్పం ఎమ్మెల్యేగా చంద్రబాబు కొనసాగుతున్నారు.

ఈ నేపథ్యంలో వచ్చే ఎన్నికల్లో 175కి 175 సాధించాలని ఏపీ సీఎం, వైసీపీ అధినేత జగన్‌ పెద్ద టార్గెట్‌ పెట్టుకున్నారు. ఇందులో భాగంగా కుప్పంలో కూడా చంద్రబాబు ఓడిపోతారని., అక్కడ కూడా వైసీపీనే గెలుస్తుందని ఒక స్ట్రాటజీని జగన్‌ అనుసరిస్తున్నారు. పెద్ద ఎత్తున కుప్పం స్థానిక టీడీపీ నేతలను వైసీపీలో చేర్చుకున్నారు.

వైసీపీ ట్రబుల్‌ షూటర్‌ గా పేరున్న మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ప్రస్తుతం కుప్పంపై ప్రత్యేక దృష్టి సారించారు. మత్స్యకార వర్గానికి చెందిన భరత్‌ కుప్పం నియోజకవర్గ వైసీపీ ఇన్‌చార్జిగా ఉన్నారు. ఆయనకు వైసీపీ ఎమ్మెల్సీగా బాధ్యతలు కట్టబెట్టింది. అంతేకాకుండా చిత్తూరు జిల్లా వైసీపీ అధ్యక్ష పదవిని కూడా ఇచ్చింది. అధికారం అండతో భరత్‌ కూడా దూకుడుగా వ్యవహరిస్తున్నారు.

అధికారం అండ, నకిలీ ఓట్లను అక్రమంగా పెద్ద ఎత్తున చేర్చి కుప్పం స్థానిక సంస్థల ఎన్నికల్లో వైసీపీ విజయం సాధించిందని టీడీపీ ఆరోపిస్తోంది. చంద్రబాబు సైతం కుప్పంలోనే నివాసం ఉండటానికి ఇంటిని నిర్మించుకుంటున్నారు. తరచూ వీలున్నప్పుడల్లా కుప్పంలో పర్యటిస్తున్నారు.

ఇటీవల చంద్రబాబు కుప్పం పర్యటన తీవ్ర ఉద్రిక్తతలకు కారణమైంది. ఆయన పర్యటనను వైసీపీ అడుగడుగునా అడ్డుకుంది. పోలీసులు సైతం తగిన భద్రత కల్పించలేదని విమర్శలు వ్యక్తమయ్యాయి. చంద్రబాబు కుప్పంలోనే ఉండగానే వైసీపీ శ్రేణులు అన్న క్యాంటీన్‌ ను రాత్రికి రాత్రే కూల్చేశాయి. వైసీపీ, టీడీపీ కార్యకర్తలు తలలు పగిలేలా కొట్టుకున్నారు.

ఈ వ్యవహారంలో పోలీసులు 70 మంది టీడీపీ నేతలు, కార్యకర్తలను అరెస్టు చేశారు. జైలులో ఉన్న వారిని చంద్రబాబు స్వయంగా పరామర్శించారు. టీడీపీ నేతలపై నాన్‌ బెయిలబుల్‌ కేసులు పెట్టడాన్ని చంద్రబాబు తీవ్రంగా ఖండించారు. టీడీపీ అధికారంలోకి రాగానే వైసీపీకి కొమ్ముకాస్తున్న పోలీసులను వదిలేది లేదని తీవ్రంగా హెచ్చరించారు.

ఈ నేపథ్యంలో చంద్రబాబు మరోసారి కుప్పంలో పర్యటించనున్నారు. ఈ నేపథ్యంలో కుప్పం మరోసారి హీటెక్కనుందని అంటున్నారు. జనవరి 4, 5, 6 తేదీల్లో కుప్పం నియోజకవర్గంలో పర్యటిస్తున్నట్లు చంద్రబాబు వ్యక్తిగత కార్యదర్శి మనోహర్‌ వెల్లడించారు. 4వ తేదీన చంద్రబాబు బెంగళూరు నుంచి శాంతిపురం మండలం చెంగుబల్లకు చేరుకుంటారు. చెంగుబల్లతోపాటు కెనమాకుపల్లె, 121–పెద్దూరు, రామకుప్పం, కుప్పం, గుడుపల్లెల్లో ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి కార్యక్రమం నిర్వహిస్తారు.

ఎన్నికల సమయంలో కూడా చంద్రబాబు కుప్పం నియోజకవర్గం ప్రచారానికి వెళ్లేవారు కాదు. అలాంటి చంద్రబాబును వీలైనంత మేర కుప్పం దాటి వెళ్లకుండా ఉండేలా వైసీపీ వ్యవహరిస్తోంది.
చంద్రబాబును కుప్పంలోనే ఉండేలా చేస్తే రాష్ట్రమంతా ఆయన చురుకుగా తిరగలేరని తద్వారా తమ పని తేలికవుతుందని వైసీపీ భావిస్తోంది.

మరోవైపు చంద్రబాబు తనయుడు నారా లోకేష్‌ యువగళం పేరుతో చేయబోతున్న పాదయాత్ర కూడా కుప్పం నుంచే జనవరి 27 నుంచి ప్రారంభం కాబోతోంది. ఇప్పటికే ఈ యాత్రను అడ్డుకుంటామంటూ వైసీపీ నాయకులు ప్రకటిస్తున్నారు. ఈ పరిస్థితుల్లో కుప్పం మరోసారి హీట్‌ ఎక్కనుందని అంటున్నారు.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News