కుప్పంలో బాబు చాణక్యం స్టార్ట్... ?

Update: 2021-11-08 07:46 GMT
కుప్పం ఇపుడు ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా ఉంది. చంద్రబాబు సొంత నియోజకవర్గం అన్న సంగతి ఇపుడిపుడే అందరికీ తెలుస్తోంది. ఎందుకంటే గతంలో ఏ సీఎం కూడా కుప్పం వైపు చూడలేదు. కానీ జగన్ మాత్రం కుప్పం కోటను పగలగొట్టాలనుకుంటున్నారు. ఆయన అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి అదే అజెండాతో పనిచేస్తున్నారు. కుప్పంలో లోకల్ బాడీ ఎన్నికలలో ఏకపక్ష విజయాలు సాధించిన వైసీపీకి ఇపుడు కుప్పం మునిసిపాలిటీ మాత్రమే బకాయి ఉంది. అది కూడా మునిసిపాలిటీగా వైసీపీ సర్కార్ ప్రకటించింది. దాంతో తొలిసారి అక్కడ జెండా ఎగరేయాలని వైసీపీ భావిస్తోంది.

దాంతో మినీ లోకల్ బాడీ ఎన్నికల సమరంలో కుప్పం మీదనే అందరి అటెన్షన్ పడింది. ఈ మధ్యనే కుప్పంలో రెండు రోజుల పాటు టూర్ చేసి జనాలకు వంగి వంగి నమస్కరాలు పెట్టి మరీ వచ్చారు చంద్రబాబు. ఆయన తనదైన పాలిటిక్స్ తో కుప్పం మునిసిపాలిటీని కాపాడుకోవాలనుకుంటున్నారు. ఇక ఆ కాస్తా ఉసురూ తీసేస్తే కుప్పంలో బాబు ఓటమి సంపూర్ణం అవుతుంది అన్నది వైసీపీ ఎత్తుగడ. ఇక ఎన్నికల స్పెషలిస్ట్ గా పేరు గడించిన సీనియర్ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని వైసీపీ కోరి మరీ దించింది అందుకే. ఆయన కుప్పాన్నే తన సొంత సీటు అనుకుని రెండున్నరేళ్ళుగా అక్కడే మకాం వేసి మొత్తం సీన్ మార్చేస్తున్నారు.

ఇపుడు మునిసిపాలిటీ గెలవడం ఆయనకు చాలా ముఖ్యం. దాంతో పెద్దిరెడ్డి రంగంలోకి దిగిపోయారు. మరో వైపు చంద్రబాబు కూడా అసలు లైట్ తీసుకోవడంలేదు. ఇప్పటిదాకా జరిగిన కధ ఒక ఎత్తు ఇకమీదట మరో ఎత్తు అంటున్నారు. అందుకే ఆయన కుప్పంలో టీడీపీ మొత్తన్ సైన్యాన్ని మోహరిస్తున్నారు. అక్కడ తూర్పు గోదావరి జిల్లా పాలకొల్లు ఎమ్మెల్యే నిమ్మల రామనాయుడిని ఇంచార్జిగా పెట్టి మరీ కధ నడిపిస్తున్నారు. తిరుపతి బై పోల్ లో పనిచేసిన మొత్తం టీడీపీ యంత్రాంగం అంతా కూడా ఇపుడు కుప్పంలో కనిపిస్తోంది.

చంద్రబాబు ఆన్ లైన్ క్లాసులు కూడా స్టార్ట్ అయిపోయాయి. ఎక్కడ ఏం చేయాలి ఎలా నరుక్కురావాలి మొత్తానికి మొత్తం వ్యూహాలను బాబు ఆన్ లైన్ లోనే కుమ్మరిస్తున్నారు. దానికి తగినట్లుగానే తమ్ముళ్ళు పని చేసుకుపోతున్నారు. పాతిక వార్డులు ఉన్న అతి చిన్న మునిసిపాలిటీ కుప్పం ఇపుడు అధికార వైసీపీ, విపక్ష టీడీపీల మధ్య బాహా బాహీలకు రాజకీయ వేదిక అయిపోయింది. కుప్పంలో బాబుని ఓడిస్తే కానీ వైసీపీ సంతృప్తి ఉండదు అన్నది ఎంత నిజమో కుప్పంలో తన సత్తా చాటుకుని వైసీపీని మట్టికరిపించాలన్న టీడీపీ పట్టుదలా అంతే నిజం. మొత్తానికి బాబు చాణక్యానికి ఇది అగ్ని పరీక్ష. చూడాలి ఏం జరుగుతుందో.




Tags:    

Similar News