క‌ర్నూలు పోలీసులు రాజ‌స్థాన్ లో దొంగ‌ను ఏసేశారు

Update: 2017-10-28 04:20 GMT
క‌ర్నూలు పోలీసులు సంచ‌ల‌నం సృష్టించారు. దారి దోపిడీకి పాల్ప‌డిన గ‌జ‌దొంగ‌ను ప‌ట్టుకునేందుకు రాజ‌స్థాన్ వెళ్లిన వారు.. గ‌జ‌దొంగ‌ను ఎన్ కౌంట‌ర్ చేసేశారు. దాదాపు 144 దొంగ‌త‌నాల‌తో సంబంధం ఉన్న అత‌గాడ్ని అదుపులోకి తీసుకునేందుకు ప్ర‌య‌త్నించిన పోలీసులు సాధ్యం కాక‌పోవ‌టంతో.. ఎన్ కౌంట‌ర్ చేసి పారేశారు. సంచ‌ల‌నంగా మారిన ఈ ఉదంతంలోకి వెళితే..

కొద్దిరోజుల క్రితం హైద‌రాబాద్ నుంచి బెంగ‌ళూరు వెళుతున్న ఓ స్కార్పియోలో ఒక కంపెనీకి చెందిన రూ.5.5కోట్లను సేఫ్ లాక‌ర్లో ఉంచి త‌ర‌లిస్తున్నారు. అయితే.. కొంద‌రు దుండ‌గులు కారును ఆపి.. డ్రైవ‌ర్.. కంపెనీ ఉద్యోగిపై దాడి చేసి.. ఆ కారులోనే డ‌బ్బును దోచుకొని పారిపోయారు. ఈ ఉదంతం స్థానికంగా సంచ‌ల‌నం సృష్టించింది.

ఈ కేసును ప్ర‌తిష్ఠాత్మ‌కంగా తీసుకున్న క‌ర్నూలు జిల్లా పోలీసులు.. దీన్ని చేధించేందుకు ఏకంగా ఎనిమిది బృందాల్ని ఏర్పాటు చేశారు. స‌ద‌రు దొంగ‌ల్ని ప‌ట్టుకునేందుకు జ‌ల్లెడ వేయ‌టం మొద‌లెట్టారు. దొంగ‌ల్ని ప‌ట్టుకునేందుకు జిల్లాను దాటి రాష్ట్రాల‌ను కూడా దాటేశారు.  మొబైల్ డేటా.. సీసీ కెమేరాలు.. నెట్ వ‌ర్క్ ల‌ను ప‌రిశీలించిన పోలీసుల‌కు ఈ దోపిడీకి ప్ర‌ధాన సూత్ర‌ధారి భీంసింగ్ అనే వ్య‌క్తిగా గుర్తించారు.

అత‌గాడు రాజ‌స్థాన్ లోఉన్నాడ‌ని గుర్తించిన పోలీసులు స్పెష‌ల్ పార్టీగా ఏర్ప‌డి రాజ‌స్థాన్ లోని జాలోర్ జిల్లా పౌంస‌ర్ ప్రాంతానికి వెళ్లారు. త‌న‌ను పోలీసులు వెంబ‌డిస్తున్నాడ‌న్న విష‌యాన్ని గుర్తించిన భీంసింగ్ పోలీసుల‌పై కాల్పులు జ‌రిపాడు. దీంతో.. ప్ర‌తిగా కాల్పులు జ‌ర‌పాల్సిన ప‌రిస్థితి ఏర్ప‌డింది. భీంసింగ్‌పై ఎదురుకాల్పులు జ‌రిపిన క‌ర్నూలు జిల్లా పోలీసుల దెబ్బ‌కు అత‌డు హ‌త‌మ‌య్యాడు. ఈ స‌మాచారాన్ని రాజ‌స్థాన్ పోలీసుల‌కు అంద‌చేశారు. త‌మ‌పై కాల్పులు జ‌రిపిన నేప‌థ్యంలో.. ఆత్మ‌ర‌క్ష‌ణ కోసం పోలీసులు కాల్పులు జ‌ర‌పాల్సి వ‌చ్చింద‌ని క‌ర్నూలుజిల్లా ఎస్పీ గోపీనాథ్ జెట్టి వెల్ల‌డించారు. రాష్ట్రం కాని రాష్ట్రంలో క‌ర్నూలు జిల్లా పోలీసుల స్పీడ్ ఇప్పుడు అంద‌రి దృష్టిని ఆక‌ర్షిస్తోంది.
Tags:    

Similar News