ఫోన్‌ కొడితే వస్తానన్నారు కానీ ఫోన్‌ నెంబరు ఇవ్వలేదు

Update: 2015-06-30 05:55 GMT
తమిళ రాజకీయాల్లో కీలకపాత్ర పోషించాలని చాలామందే కలలు కంటారు. కానీ.. వీరికి భిన్నంగా సినీ నటి కమ్‌ రాజకీయవేత్త ఖుష్భూ మాత్రం ఏ అవకాశాన్ని విడిచిపెట్టకుండా ప్రయత్నిస్తుంటారు. తమిళనాడు కాంగ్రెస్‌ పార్టీ అధికార ప్రతినిధి అయిన ఆమె.. రాష్ట్ర కాంగ్రెస్‌ పార్టీ మహిళా అధ్యక్షురాలి పోస్ట్‌ కోసం అధినాయకత్వం పంపిన పార్టీ జాతీయ మహిళా అధ్యక్షురాలు శోభా ఓజా అధ్వర్యంలో జరిగిన ఒక సమావేశంలో తన సత్తా చాటారు.

తమిళనాడు పార్టీ మహిళా అధ్యక్ష పదవికి కోసం చాలామంది మహిళా నేతలు ప్రయత్నించినా.. ఖుష్భూ చేసిన ఒక ప్రసంగం మిగిలిన వారిలో ఆమెను భిన్నంగా నిలపింది. కాంగ్రెస్‌ పార్టీ కార్యకర్తలు ఎవరైనా సరే.. సమస్య ఏదైనా సరే.. రోడ్డు మీదకు వచ్చి పోరాటం చేస్తూ.. తనకు ఫోన్‌ చేయాలే కానీ.. క్షణాల్లో రోడ్డు మీదకు వచ్చి సదరు ఆందోళనలో పాల్గంటానంటూ ఆమె చేసిన ఆవేశపూరిత ప్రసంగానికి ఐస్‌ అయిపోయారు.

పార్టీ మహిళా అధ్యక్ష స్థానానికి ప్రజాకర్షణ కలిగిన నేతను ఎంపిక చేయాలన్నది అధినాయకత్వం ఆలోచన కాగా.. తనకు అలాంటి అర్హతలు ఉన్నాయన్న విషయాన్ని ఖుష్భూ తాజాగా చేసిన ప్రసంగంతో తేల్చి చెప్పినట్లుగా చెబుతున్నారు. తాజాగా ఆమె చేసిన ప్రసంగాన్ని స్వయంగా విన్న పార్టీ అధినాయకత్వం సన్నిహితురాలు ఓజా సైతం ఖుష్భూ ఉత్సాహానికి ఫిదా అయిపోయారని.. ఆమెను తమిళనాడు పార్టీ మహిళా అధ్యక్షురాలిగా ఎంపిక చేయటం ఖాయమని చెబుతున్నారు. కొసమెరుపు ఏమిటంటే.. ఫోన్‌ కొడితే వీధుల్లోకి వస్తానన్న ఖుష్బూ.. తన ప్రసంగంలో ఎక్కడా తన ఫోన్‌ నెంబరు ఇవ్వకపోవటం గమనార్హం.

Tags:    

Similar News