బాబు, వెంక‌య్య‌ను క‌లిసి ఉతికేసిన కేవీపీ

Update: 2016-08-25 05:28 GMT
కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు - రాజ్యసభ సభ్యుడు కేవీపీ రామచంద్రరావు మరోమారు ఏపీ ముఖ్య‌మంత్రి నారా చంద్ర‌బాబు నాయుడుపై విరుచుకుప‌డ్డారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణం జరుగకుండా చూసేందుకు భయంకరమైన కుట్ర జరుగుతోందని, ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తన కమీషన్లు - స్వార్థ ప్రయోజనాల కోసం రాష్ట్ర పరిధిలో ప్రాజెక్టు నిర్మాణం కొనసాగిస్తున్నారని ఆరోపించారు. చంద్రబాబు ఏ ప్రయోజనాల కోసం కేంద్రం నిర్మించాల్సిన పోలవరం ప్రాజెక్టును రాష్ట్ర ప్రభుత్వం పరిధిలో నిర్మిస్తున్నారని ప్రశ్నించారు. పోలవరం జాతీయ ప్రాజెక్టు అని పేర్కొంటూ దీన్ని 2018లోగా నిర్మించవలసిన బాధ్యత కేంద్ర ప్రభుత్వానిద‌ని తెలిపారు. ఈ మేరకు రాష్ట్ర విభజన చట్టంలో హామీ ఇచ్చారని కేవీపీ గుర్తు చేశారు.

ఆంధ్రప్రదేశ్‌ కు ప్రత్యేక హోదా ఇవ్వాలని విభజన చట్టంలో లేకపోయినా దాని గురించి పట్టుపడుతున్న బాబు చట్టంలో ఉన్న పోలవరం ప్రాజెక్టును కేంద్ర ప్రభుత్వం చేపట్టాలని ఎందుకు అడగటం లేదని కేవీపీ నిలదీశారు. కేంద్రం - రాష్ట్ర ప్రభుత్వం కలిసి పోలవరాన్ని దెబ్బ తీస్తున్నాయని ఆయన దుయ్యబట్టారు. ‘విభజన చట్టం ప్రకారం పోలవరం ప్రాజెక్టును జాతీయ ప్రాజెక్టుగా కేంద్రం నిర్మించవలసి ఉంది. అయితే ఎందుకోగానీ కేంద్రం ప్రాజెక్టు నిర్మాణం పనిని చేపట్టటం లేదు. నిర్మాణ బాధ్యతలు తమకు అప్పగించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరటం లేదు. ఇదే విధంగా చంద్రబాబుకూడా ప్రాజెక్టు నిర్మాణాన్ని కేంద్రానికి అప్పగించటం లేదు. ఎందుకిలా జరుగుతోంది?’ అని ఆయన నిలదీశారు. ‘చంద్రబాబు తెలివిలేనివాడా? సామర్థ్యం లేనివాడా? చేవ చచ్చినవాడా? ధైర్యం లేనివాడా? పోలవరం ప్రాజెక్టును త్వరగా పూర్తి చేయటం గురించి కేంద్రంతో ఎందుకు మాట్లాడటం లేదు?’ అంటూ కేవీపీ ప్రశ్నల వ‌ర్షం కురిపించారు.

చంద్రబాబు - కేంద్ర సమాచార శాఖ మంత్రి ఎం.వెంకయ్యనాయుడు ఒకరినొకరు పొగుడుకుంటూ భట్రాజుల్లా వ్యవహరిస్తున్నారని కేవీపీ ఆరోపించారు. వీళ్లిద్దరూ తమ ప్రయోజనాల కోసం ఒకరినొకరు పొగుడుకుంటూ రాష్ట్ర ప్రయోజనాలను దెబ్బ తీస్తున్నారని ఆయన ఆరోపించారు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి పోలవరం కోసం నిర్మించిన కాలువలను ఉపయోగించుకుని పట్టిసీమ ప్రాజెక్టును పూర్తి చేసిన చంద్రబాబు - ఆయనకు వంత పాడుతున్న వెంకయ్య గత రెండేళ్లలో రాష్ట్రాభివృద్ధికి ఏమీ చేయలేదని చెప్పారు. ‘వీరిద్దరూ కలిసి రాష్ట్రంలో ఒక్క కొత్త ప్రాజెక్టునైనా పూర్తి చేశారా?’ అని ప్రశ్నించారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణాన్ని వెంటనే కేంద్ర ప్రభుత్వానికి అప్పగించాలని చంద్రబాబును డిమాండ్ చేశారు.
Tags:    

Similar News