చంద్రబాబును ఏకిపడేసిన కేవీపీ

Update: 2018-01-22 13:44 GMT
కాంగ్రెస్ రాజ్యసభ సభ్యుడు కేవీపీ రామచంద్రరావు ఏపీ సీఎం చంద్రబాబునాయుడిని ఏకిపడేశారు. ఈ మేరకు ఆయన చంద్రబాబును ఉద్దేశించి ఆయన రాసిన బహిరంగ లేఖలో తీవ్ర వ్యాఖ్యలు చేశారు. సీఎం చంద్రబాబు తీరు ఆంధ్రప్రదేశ్‌ కు శాపంగా మారిందని ఆయన అన్నారు. సొంత ప్రయోజనాల కోసం ఆయన రాష్ట్ర ప్రయోజనాలను గాలికొదిలేశారని మండిపడ్డారు.
    
నాలుగేళ్లయినా విభజన చట్టంలోని హామీలను అమలు చేయించుకోలేకపోయారని కేవీపీ మండిపడ్డారు. దోపిడీ వాటాలు కుదరక ప్రాజెక్టులు ఆలస్యం చేస్తున్నారని...  అమరావతి లో శాశ్వత భవనాలకు ఇటుక పేర్చలేదని విమర్శించారు. విభజన చట్టం హామీల‌పై అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేయాలని కోరారు.
    
హాస్పిటల్ పేరుతో దుబాయి కంపెనీకి భూములు ఇవ్వడంలో ఉన్న ఆసక్తి ఎయిమ్స్ నిర్మాణంపై లేదంటూ తీవ్రస్థాయిలో దుయ్యబట్టారు. కాంట్రాక్టర్ల రేట్ల కోసం కేంద్రంతో తగాదాపడడం విడ్డూరంగా ఉందని కేవీపీ వ్యాఖ్యానించారు. చంద్రబాబు హెరిటేజ్‌ - బిగ్‌ బజార్ ప్రయోజనాల కోసం రాజీపడుతున్నారని ఆరోపించారు. విభజనకు కాంగ్రెస్ ఒక్కటే కారణం కాదంటూ టీడీపీ కూడా రెండుసార్లు విభజన లేఖలు ఇచ్చిందని ఆయన గుర్తు చేశారు.
    
కాగా రెండు రోజుల కిందట కూడా కేవీపీ ఏపీ పరిస్థితులపై ఏకంగా రాష్ట్రపతికి లేఖ రాశారు. విభజన హామీల అమలు విషయంలో ప్రభుత్వాలు నిర్లక్ష్యాన్ని - అలసత్వాన్ని వహిస్తున్నాయని ఆయన రాష్ర్టపతికి రాసిన లేఖలో పేర్కొన్నారు. అంతేకాదు... ఏపీ ప్రయోజనాలను పరిరక్షించేందుకు జోక్యం చేసుకోవాలని ఆయన లేఖలో కోరారు.
Tags:    

Similar News