చంద్ర‌బాబుకు అల్జీమ‌ర్స్ చివ‌రి ద‌శ‌:కేవీపీ

Update: 2018-09-15 12:40 GMT
 రెండు రోజుల క్రితం చంద్ర‌బాబు కుటుంబ స‌మేతంగా చేప‌ట్టిన `గ్యాలరీ వాక్‌`....పై తీవ్ర స్థాయిలో విమ‌ర్శ‌లు వ‌చ్చిన సంగ‌తి తెలిసిందే. 40మంది టీడీపీ ఎమ్మెల్యేలంతా స‌తీ స‌మేతంగా త‌మ అధినేత కుటుంబంతో క‌లిసి ఆ గ్యాల‌రీ `వాక్` చేసి ఫొటోల‌కు పోజులిచ్చార‌ని కామెంట్స్ వ‌చ్చాయి. బాబు సతీమణి భువనేశ్వరి - కుమారుడు నారా లోకేష్‌ - కోడలు బ్రాహ్మణి - మనవడు దేవాన్ష్‌... టీడీపీ ఎమ్మెల్యేలు స‌తీ స‌మేతంగా  పిక్నిక్ స్పాట్ కు వ‌చ్చిన‌ట్లుంద‌ని మీడియాలో క‌థ‌నాలు వ‌చ్చాయి. త‌న సీఎం ప‌ద‌వీకాలం పూర్త‌య్యే లోపు ఆ ప్రాజెక్ట్ పూర్తి కాద‌నే ఉద్దేశంతోనే చంద్ర‌బాబు ఈ ర‌క‌మైన ప‌బ్లిసిటీ స్టంట్స్ చేస్తున్నారని ప్ర‌జ‌లు అనుకుంటున్నారు. ఈ క్ర‌మంలోనే ఆ గ్యాల‌రీ వాక్ చేప‌ట్టిన చంద్ర‌బాబుపై కాంగ్రెస్ నేత‌ - రాజ్య స‌భ ఎంపీ కేవీపీ రామచంద్ర‌రావు సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. చంద్ర‌బాబు మాన‌సిక స్థితి స‌రిగ్గా లేద‌ని - ఆయ‌న‌కు స్విట్జ‌ర్లాండ్ లో చికిత్స అందించాల‌ని షాకింగ్ కామెంట్స్ చేశారు. పొరుగు రాష్ట్రంలో ఉన్న ఎర్ర‌గ‌డ్డ వంటి లోకల్ హాస్ప‌ట‌ల్స్ ఆయ‌న‌కు చికిత్స అందించ‌లేవ‌ని ఎద్దేవా చేశారు.

త‌న హ‌యాంలో ఇన్ని ఇరిగేష‌న్ ప్రాజెక్టులు పూర్త‌య్యాయంటూ చంద్ర‌బాబు గ‌ప్పాలు కొట్ట‌డం త‌న‌కు ఆశ్చ‌ర్యాన్ని క‌లిగించింద‌ని కేవీపీ అన్నారు. శ్రీ కృష్ణ దేవ‌రాయ‌లు కూడా ఈ ర‌కంగా ప‌బ్లిసిటీ చేసుకోలేద‌ని ఎద్దేవా చేశారు. ఇవ‌న్నీ చూస్తుంటే చంద్ర‌బాబు మాన‌సిక స్థితిపై త‌న‌కు అనుమానాలు క‌లుగుతున్నాయ‌ని అన్నారు. ఓ వైపు 58శాతం ప‌నులు పూర్త‌య్యాయ‌ని చెప్పిన చంద్ర‌బాబు...మరోవైపు పోల‌వ‌రం పూర్త‌య్యింద‌న్న స్థాయిలో ప‌బ్లిసిటీ చేసుకోవ‌డం ఏమిట‌ని ప్ర‌శ్నించారు. పోల‌వ‌రం పూర్త‌య్యే నాటికి తాను అధికారంలో ఉండ‌న‌ని బాబుకు తెలుస‌ని అందుకే ఈ ప‌బ్లిసిటీ స్టంట్స్ అని అన్నారు. సాగ‌ర్ కు శంకుస్థాప‌న చేసిన నెహ్రూతో బాబు పోల్చుకోవ‌డం దుర‌దృష్ట‌క‌ర‌మ‌న్నారు. పోల‌వ‌రం పాకిస్థాన్ లోనో క‌జ‌కిస్థాన్ లోనో లేద‌ని - అది ఏపీలో ఉంద‌ని - దాని చ‌రిత్ర ప్ర‌జ‌ల‌కు తెలుస‌ని అన్నారు. పోల‌వరానికి టీ.అంజ‌య్య శంకుస్థాపన చేయ‌డం - వైఎస్ ఆర్ హ‌యాంలో ప‌నులు ప్రారంభం కావ‌డం అంద‌రికీ తెలుస‌న్నారు. తాను అధికారంలో ఉన్నాను గ‌నుకు తాను  చెప్పింది ప్ర‌జ‌లంతా న‌మ్మాలి అన్న భావ‌న‌లో బాబు ఉన్నారని ఎద్దేవా చేశారు. లేదంటే చంద్ర‌బాబుకు అల్జీమ‌ర్స్ చివ‌రి ద‌శ‌లో ఉంద‌ని సెటైర్ వేశారు.



Tags:    

Similar News