పండుగ రోజున కేసీఆర్ ఇంట్లో ఏమైంది..?

Update: 2015-10-31 04:35 GMT
రాజకీయాల్లో ఒకరిని ఒకరు విమర్శలు చేసుకోవటం.. ఆరోపణలు చేసుకోవటం మామూలే. అయితే.. తెలంగాణ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు ఎల్. రమణ తాజాగా చేసిన ఆరోపణ ఆసక్తికరంగా మారింది. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ కు సంబంధించిన అంశంగా ఆయన చెబుతున్న వివరాలు ఆసక్తికరంగా ఉండటంతో పాటు.. కాస్తంత కొత్తగా ఉండటం విశేషం.

తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా తీసుకొని నిర్వహించిన బతుకమ్మ పండగ సందర్భంగా.. పండుగ రోజున ముఖ్యమంత్రి కేసీఆర్ ఇంటికి గవర్నర్ నరసింహన్ వెళ్లాల్సి ఉంది. అయితే.. ఆయన వెళ్లలేదు. ఎందుకిలా అన్న ప్రశ్నకు తాజాగా రమణ చెబుతున్న సమాధానాలు అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి. బతుకమ్మ పండుగ రోజున కేసీఆర్ ఇంట్లో ఏం జరిగిందో తెలుసా అంటూ ఆయన చెబుతున్న విషయాల్లో నిజం మాట ఎలా ఉన్నా.. అందరి దృష్టికి మాత్రం  విపరీతంగా ఆకర్షిస్తున్నాయని చెప్పక తప్పదు.

నాడు కేంద్రమంత్రిగా ఉన్న సమయంలో ఈఎస్ ఐ భవనాన్ని నిర్మించిన విషయంలో ఆరోపనలు ఎదుర్కొంటున్న ముఖ్యమంత్రి కేసీఆర్ ఇంటికి.. బతుకమ్మ పండుగ రోజు సీబీఐ అధికారులు వెళ్లినట్లుగా రమణ ఆరోపిస్తున్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ను ప్రశ్నించేందుకు ఆయన ఇంటికి అధికారులు బతుకమ్మ పండుగ రోజునే వెళ్లారని ఆయన చెబుతున్నారు. ఈ కారణం వల్లనే గవర్నర్ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఇంటికి వెళ్లలేదని ఆరోపిస్తున్నారు. ‘‘సీబీఐ అధికారులు ముఖ్యమంత్రి కేసీఆర్ ఇంట్లో ఉన్నారు. అందుకే.. బతుకమ్మ పండుగ సందర్భంగా సీఎం నివాసంలో నిర్వహించిన కార్యక్రమానికి గవర్నర్ వెళ్లలేదు’’ అని ఆయన చెబుతున్నారు. రమణ చేస్తున్న ఆరోపణలపై తెలంగాణ అధికారపక్ష నేతలు ఎలా రెస్పాండ్ అవుతారో చూడాలి.
Tags:    

Similar News