ప్ర‌గ‌తిభ‌వ‌న్ త‌ర్వాత‌.. మీ బాబు ఖ‌ర్చుల మాటేంది?

Update: 2017-11-04 07:23 GMT
మాట‌లేముంది ఎవ‌రైనా చెబుతారు. కానీ.. వేలెత్తి చూపించే ముందు ఒక వేలు ఎదుటోడిని చూపిస్తే.. మిగిలిన నాలుగు వేళ్ల‌లో మూడు వేళ్ల మ‌న‌వైపే చూపిస్తాయ‌న్న చిన్న విష‌యాన్ని మ‌రిచిపోతుంటారు రాజ‌కీయ నేత‌లు. ఈకార‌ణంతోనే నోటికి వ‌చ్చిన‌ట్లుగా మాట్లాడేస్తుంటారు. తాము మాట్లాడే మాట‌ల్ని విన్న ప్ర‌జ‌లు న‌వ్వుకుంటార‌న్న దాన్ని ప‌ట్టించుకోరు.

తాజాగా తెలంగాణ తెలుగుదేశం పార్టీ అధ్య‌క్షుడు ఎల్ ర‌మ‌ణ మాట‌లు వింటే న‌వ్వుకోవాల్సిందే. మొన్నామ‌ధ్య ఎన్టీఆర్ భ‌వ‌న్ లో బాబు ఏం చెప్పారో కానీ.. అప్ప‌టినుంచి ర‌మ‌ణ మాట‌ల్లో మార్పు వ‌చ్చేసింది. వ‌చ్చే ఎన్నిక‌ల్లో త‌మ పార్టీ అధికారంలోకి వ‌స్తుందంటూ న‌వ్వు పుట్టించే మాట‌ను చెబుతున్నారు. ప‌దంటే ప‌ది మంది బ‌ల‌మైన నాయ‌కులు.. పార్టీని న‌డిపించే ఐకాన్ లీడ‌ర్ లేని పార్టీ అధికారంలోకి రావ‌టం సంగ‌తి త‌ర్వాత‌.. ప‌ది సీట్లు గెలుచుకునే స‌త్తా ఉందా? అన్న‌ది ప్ర‌శ్న‌. ఎన్నిక‌లు.. గెలుపు ఓట‌ముల్ని ప‌క్క‌న పెడితే.. తాము ప‌వ‌ర్ లోకి వ‌చ్చిన వెంట‌నే తెలంగాణ రాష్ట్ర ముఖ్య‌మంత్రి కేసీఆర్ అధికార నివాస‌మైన ప్ర‌గ‌తిభ‌వ‌న్‌ను ప్ర‌భుత్వ ఆసుప‌త్రిగా మారుస్తామ‌న్నారు. రాష్ట్రంలో టీడీపీని మ‌రింత బ‌లోపేతం చేస్తామ‌ని చెప్పారు.

ర‌మ‌ణ మాట‌ల్ని వింటే న‌వ్వు రావాల్సిందే. త‌మిళ‌నాడులో దివంగ‌త అమ్మ జ‌య‌ల‌లిత ఇలాంటి శ‌ప‌ధం చేయ‌ట‌మే కాదు.. అనుకున్న‌ది చేశారు. అమ్మ ఎక్క‌డ‌..? ర‌మ‌ణ ఎక్క‌డ‌?  కేసీఆర్ దుబారా గురించి ప్ర‌శ్నించే వేళ‌లో.. ఏపీలో అధికారంలో ఉన్న పార్టీ అధినేత చంద్ర‌బాబు ఖ‌ర్చు గురించి కూడా కాస్త ఆలోచించి మాట్లాడితే బాగుండేది. ఎడాపెడా ఖ‌ర్చులు చేసేసే బాబు దుబారాతో ఏపీ ప్ర‌జ‌లు బేజారెత్తిపోతున్నారు.

సార్వ‌త్రిక ఎన్నిక‌లు ముగిసిన త‌ర్వాత దాదాపు రూ.15 కోట్ల కంటే ఎక్కువ ఖ‌ర్చు చేసి.. మూణ్నాళ్ల ముచ్చ‌టైన సీఎంవోకి భారీ హంగులు చేసిన ఖ‌ర్చు మొద‌లు.. సీఎం కాన్వాయ్ వాహ‌నాలను అంత‌కంత‌కూ పెంచుకునే బాబు ఓ ప‌క్క‌న పెట్టుకొని కేసీఆర్ ను విమ‌ర్శించ‌టంలో అర్థ‌మేమైనా ఉందా? అన్నది ప్ర‌శ్న‌. ఎదుటోడిని తిట్ట‌ట‌మేకాదు.. త‌మ త‌ప్పుల గురించి ప‌ట్ట‌ని నేత‌లు ఉన్న‌ప్పుడు ర‌మ‌ణ లాంటి నేత‌ల నోటి నుంచి ఈ త‌ర‌హా మాట‌లే వ‌స్తాయ‌ని చెప్ప‌క త‌ప్ప‌దు.
Tags:    

Similar News