టీడీపీ నీతి: ఏపీలో త‌ప్పు.. తెలంగాణ‌లో ఒప్పు

Update: 2017-10-06 10:05 GMT
తాను ప‌ట్టిన కుందేలుకు మూడేకాళ్ల‌ని వితండ వాదం చేసే టీడీపీ అధినేత చంద్ర‌బాబు.. అండ్ కో రాజ‌కీయాలు కూడా అలానే ఉంటున్నాయి. తాను పాలిస్తున్న రాష్ట్రంలో తాను ఏం చేసినా ఒప్పు.. అదే విప‌క్షం ఏం చేసినా త‌ప్పు! అదే స‌మ‌యంలో తాను విప‌క్షంగా ఉన్న రాష్ట్రంలో మాత్రం ఈ నీతి తిర‌గ‌బ‌డుతుంది! ఇక్క‌డి త‌ప్పుల‌న్నీ.. అక్క‌డ ఒప్పుల‌వుతాయి! దీనిపై ఎవ‌రూ ప్ర‌శ్నించ‌జాల‌రు! తాజాగా జ‌రిగిన ఓ విష‌యం బాబు అండ‌కో రాజ‌కీయ నీతిని మ‌రోసారి బ‌ట్ట‌బ‌య‌లు చేసింది. తెలంగాణ‌లో ప్ర‌తి ప‌ల్లె నుంచి ప‌ట్నం వ‌ర‌కు పెద్ద ఎత్తున జ‌రుపుకొనే బ‌తుక‌మ్మ పండుగ‌ను కేసీఆర్ రాష్ట్ర పండుగ చేసిన విష‌యం తెలిసిందే.

ఈ క్ర‌మంలో గ‌త రెండేళ్ల‌లో లేనిది ఈ ద‌ఫా కేసీఆర్ రాష్ట్రంలోని పేద‌ మ‌హిళ‌ల‌కు బ‌తుక‌మ్మ పండ‌గ సంద‌ర్భంగా చీర‌లు పంచారు. అయితే, వీటిని విప‌క్షాలు రాజ‌కీయం చేశాయి. ప్ర‌భుత్వం నాశిరకం చీరలు పంచిందని పేర్కొంటూ.. పెద్ద ఎత్తున ఉద్య‌మించాయి. ఈ క్ర‌మంలోనే టీడీపీ సైతం విమ‌ర్శ‌లు మొద‌లు పెట్టింది. తాజాగా మీడియాతో మాట్లాడిన టీడీపీ రాష్ట్ర అధ్య‌క్షుడు ఎల్‌. ర‌మ‌ణ బ‌తుక‌మ్మ చీర‌ల్లో కేసీఆర్ క‌మీష‌న్లు దండుకున్నార‌ని కామెంట్లు చేశారు. త‌ర్వాత ఈ క‌మీష‌న్ల‌నే సింగ‌రేణి కార్మిక సంఘాల‌కు జ‌రిగిన ఎన్నిక‌ల్లో పంచార‌ని విమ‌ర్శించారు.

అంత‌టితో ఆగ‌కుండా.. ఆ బ‌తుక‌మ్మ చీర‌ల‌తోనే ఉరేయాల‌ని సంచ‌ల‌న వ్యాఖ్య చేశారు. దీంతో టీడీపీ స్థానిక నేత‌లు ఆహా వోహో అంటూ ర‌మ‌ణ‌ను పొగడ్త‌ల‌తో ముంచెత్తారు. కేసీఆర్‌ ను మాబాగా తిట్టిపోశావ్ అంటూ.. స‌న్మానించిన టైపులో చ‌ప్ప‌ట్లు కొట్టి ప్ర‌స్తుతించారు. ఇక‌, ఏపీ విష‌యానికి వ‌ద్దాం. సేమ్ ఇవే కామెంట్ల‌ను వైసీపీ అధినేత జ‌గ‌న్ ఆయ‌న పార్టీ ఎమ్మెల్యేలు  వివిధ సంద‌ర్భాల్లో చేశారు. అది కూడా కీల‌క‌మైన ప్రాజెక్టులు - కీల‌క‌మైన నంద్యాల ఉప ఎన్నిక సంద‌ర్బంలో అన్నారు. అయితే, ఈ వ్యాఖ్య‌ల‌పై మాత్రం స్థానిక టీడీపీ పెద్ద ఎత్తున దుమారం రేపింది. విప‌క్షం నిర్మాణాత్మ‌కంగా వెళ్ల‌డం లేద‌ని, ప్ర‌జ‌ల‌ను రెచ్చ‌గొడుతోంద‌ని, మేం లంచాలు తీసుకుని ప‌నులు చేస్తున్నామ‌ని ఆరోపిస్తోంద‌ని అనుకూల మీడియాలో క‌థ‌నాలు కూడా రాయించింది.

పోల‌వ‌రం ప్రాజెక్టులో లంచాలు మేస్తున్నార‌ని, నంద్యాల ఉప ఎన్నిక‌లో ఓటు రూ.5 వేలు ఇచ్చార‌ని, ఎన్నిక‌ల హామీల‌ను అమ‌లు చేయ‌ని సీఎం ఏం చేసినా త‌ప్పులేద‌నిపిస్తోంద‌ని అన‌డాన్ని పెద్ద ఎత్తున త‌ప్పుప‌ట్టిన ఏపీ టీడీపీకి, ఇవే విష‌యాల్లో తెలంగాణ కేసీఆర్ స‌ర్కారును ఏకేసేట‌ప్పుడు మాత్రం నీతులు గుర్తుకు రాలేదు! పైగా ఎంత బాగా ఏకితే.. అన్ని చ‌ప్ప‌ట్లు అనే ప‌థ‌కాన్ని సైతం అమ‌లు చేస్తూ.. విరుచుకుప‌డుతున్నారు. ఇక్క‌డ మాత్రం త‌ప్పు ఎత్తి చూపితే.. విప‌క్షం ద్రోహి.. ప్ర‌భుత్వానికి అడ్డంకులు సృష్టిస్తోంద‌ని కామెంట్లు.. సో.. ఇదీ బాబు మార్క్ పొలిటిక‌ల్ నీతి!!
Tags:    

Similar News