ర‌మ‌ణ కామెంట్‌: రేవంత్ దెయ్యం వ‌దిలింది

Update: 2017-10-31 10:46 GMT
ఇష్ట‌మైతే పొరుగింటి పుల్ల కూర కూడా రుచిగా ఉంటుంద‌ని సామెత‌! మ‌రి ఇష్టం లేక‌పోతే.. వేడి వేడి బిర్యానీ కూడా పాచి కంపుకొడుతుంద‌ట‌!! ఇప్పుడు తెలంగాణ టీడీపీలో రేవంత్ పై కామెంట్లు ఇలానే ప‌డుతున్నాయి. నాలుగు రోజుల ముందు ఎంతో ప‌ద్ధ‌తిగా పార్టీ అధినేత చంద్ర‌బాబుకు చెప్పి - అటు పార్టీకి - ఇటు ఆ పార్టీ వ‌ల్ల వ‌చ్చిన ప‌ద‌వికి సైతం రాజీనామా స‌మ‌ర్పించారు రేవంత్ రెడ్డి. అయితే, ఆయ‌న పోతూ పోతూ.. టీడీపీ నేతులు అటు ఏపీలోకానీ - ఇటు తెలంగాణ‌లో కానీ చేసిన నిర్వాకాల‌ను కొన్నింటిని బ‌య‌ట‌పెట్టి పోయారు. దీంతో ఆయా నేత‌ల‌కు త‌ల‌కొట్టేసిన‌ట్ట‌యింది.

అయితే, పార్టీలో రేవంత్ ఉండ‌గా మౌనం వ‌హించిన ఆ నేత‌లు తాజాగా నోళ్లు తెరిచారు. రేవంత్‌ పై దుమ్మెత్తి పోస్తున్నారు. ముఖ్యంగా తెలంగాణ టీడీపీ అధ్య‌క్షుడు ఎల్ ర‌మ‌ణ.. మంగ‌ళ‌వారం ప‌నిగ‌ట్టుకుని మ‌రీ రేవంత్‌ పై సంచ‌ల‌న కామెంట్లు కుమ్మ‌రించారు. రేవంత్‌ ను దెయ్యం అంటూ సంబోధించారు. రేవంత్ రెడ్డి అనే దెయ్యం టీడీపీ అధినేత చంద్రబాబుకు దగ్గరై... ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ కు గ్రహణంలా పట్టిందని తీవ్ర‌స్థాయిలో విరుచుకుప‌డ్డారు.  టీడీపీ కార్యాలయానికి పట్టిన ఆ గ్రహణం ఇప్పుడు తొలగిపోయిందని చెప్పారు. ఇప్పుడు ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీకి ఆ దెయ్యం పట్టిందని సెటైర్ విసిరారు.

వ‌చ్చే ఏడాది మార్చి 29 తర్వాత రేవంత్ నియోజకవర్గం కొడంగల్ లో ప్రజా బ్యాలెట్ నిర్వహిస్తామని ర‌మ‌ణ‌ చెప్పారు. కొడంగల్ నియోజకవర్గానికి జరిగే ఉప ఎన్నికల్లో ఏ పార్టీతోనూ పొత్తు పెట్టుకోబోమని - ఒంటరిగానే పోటీ చేస్తామని తెలిపారు. తెలుగుదేశం పార్టీ కార్యక్రమాలను కూడా రేవంత్ హైజాక్ చేశారని... రైతుపోరు - విద్యార్థి పోరుయాత్ర కార్యక్రమాలు తమవేనని చెప్పారు.  అయితే, ఈ రెండు కార్య‌క్ర‌మాలూ టీడీపీవే అయితే, అప్ప‌ట్లో రేవంత్ చేప‌ట్టిన‌ప్పుడు ఎందుకు మ‌ద్ద‌తివ్వ‌లేదో ర‌మ‌ణ గారే చెప్పాల‌ని అంటున్నారు రేవంత్ అభిమానులు.

ఇప్పుడు ఎందుకు అంత అక్క‌సు? అని కూడా వారు ప్ర‌శ్నిస్తున్నారు.  టీడీపీ నుంచి ఎంద‌రో వెళ్లిపోయార‌ని, వారిలో క‌నీసం స‌గం మందైనా రేవంత్ మాదిరిగా నిజాయితీగా పార్టీకి, ప‌ద‌వికీ రాజీనామా చేసిన‌వారు ఎంద‌రున్నారో చెప్పాల‌ని కూడా ప్ర‌శ్నిస్తున్నారు. సో.. ఏదేమైనా.. ర‌మ‌ణ ఇప్పుడు వ్యాఖ్య‌లు చేయ‌డం స‌రికాద‌ని సూచిస్తున్నారు రాజ‌కీయ పండితులు. ఒక‌ట‌ని..  వంద అనిపించుకోవ‌డం క‌న్నా.. మౌనంగా ఉంటే మేల‌ని సూచిస్తున్నారు. మ‌రి ర‌మ‌ణ ఆగుతాడా?  చూడాలి!!
Tags:    

Similar News