అమరావతిలో ఎల్ అండ్ టీ ఆఫీసుపై కార్మికుల దాడి

Update: 2016-05-10 08:17 GMT
శరవేగంగా సాగుతున్న అమరావతి సచివాలయ నిర్మాణంలో అనుకోని ఘటన ఒకటి చోటు చేసుకుంది. రాత్రి.. పగలు అన్న తేడా లేకుండా సాగుతున్న పనులకు ఆటంకం కలిగే ఘటన ఒకటి చోటు చేసుకుంది. నిర్మాణ పనులు చేస్తున్న నిర్మాణ కార్మికుడు ఒకరు ప్రమాదవశాత్తు కాంక్రీట్ మిక్సర్ లో పడిపోవటం.. వెనువెంటనే ప్రాణాలు కోల్పోవటం జరిగింది. ప్రమాదంలో మరణించిన కార్మికుడిని ఉత్తరప్రదేశ్ కు చెందిన దేవేందర్ గా గుర్తించారు. రెండు రోజుల క్రితమే పనిలో చేరిన ఈ కార్మికుడి మరణానికి నష్టపరిహారం విషయంలో ఎల్ అండ్ టీ నిర్లక్ష్యంతో వ్యవహరించిందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.

కార్మికుడి మరణించిన నేపథ్యంలో అతని కుటుంబాన్ని ఆదుకునేలా నష్టపరిహారాన్ని ప్రకటించే విషయంలో ఎల్ అండ్ టీ అధికారులు నిర్లక్ష్యంతో వ్యవహరించి.. ఎలాంటి ప్రకటన చేయకుండానే..శవపరీక్షకు మృతదేహాన్ని తరలించే ప్రయత్నం చేయటం అక్కడి కార్మికుల్లో తీవ్ర ఆగ్రహానికి గురి చేసింది. మృతదేహాన్ని తీసుకెళ్లటానికి వచ్చిన అంబులెన్స్ మీద దాడి చేసిన కార్మికులు.. దాన్ని తగులబెట్టారు. అనంతరం ఎల్ అండ్ టీ కార్యాలయం మీద దాడి చేసి.. అందులోని ఫర్నీచర్ ను ధ్వంసం చేయటంతో పాటు.. బయట నిలిపిన వాహనాల మీదా దాడికి పాల్పడ్డారు.

దీంతో.. కార్మికుల్ని కంట్రోట్ చేయటానికి వచ్చిన పోలీసులు సైతం పెద్ద సంఖ్యలో ఉన్న కార్మికుల ఆగ్రహాన్ని కామ్ గా చూస్తూ ఉండిపోయారే తప్పించి ఏమీ చేయలేదన్న మాట వినిపిస్తోంది. కార్మికుడి మరణంపై పెద్ద ఎత్తున పెల్లుబుకుతున్న ఆగ్రహాం ప్రభుత్వాన్ని తాకింది. ఈ అంశంపై తాజాగా ఏపీ ఉప ముఖ్యమంత్రి నిమ్మకాయల చినరాజప్ప స్పందించారు. కార్మికుడి కుటుంబాన్ని ప్రభుత్వం తరఫున ఆదుకుంటామని పేర్కొన్నారు. ఇదే విషయాన్ని మొదటే ప్రకటించి ఉంటే ఇప్పుడున్న ఉద్రిక్త పరిస్థితులు తలెత్తేవికాదన్న మాట వినిపిస్తోంది. చేతులు కాలాక కానీ ఆకులు పట్టుకోవాలన్న ఆలోచన రాదేమో..?
Tags:    

Similar News