బాబుతో ల‌గ‌డ‌పాటి భేటీ...టికెట్ ఓకేన‌ట‌

Update: 2017-04-14 17:25 GMT
ఏపీ రాజ‌కీయాల్లో మ‌రో కీల‌క ప‌రిణామం చోటుచేసుకుంది. ఏపీ ముఖ్య‌మంత్రి, తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడును విజయవాడ మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్ కలిశారు. వెల‌గ‌పూడిలోని తాత్కాలిక స‌చివాల‌యంలో చంద్ర‌బాబుతో ల‌గ‌డ‌పాటి స‌మావేశం అయ్యారు. ఈ స‌మావేశంపై ఇటు ముఖ్య‌మంత్రి కార్యాల‌యం కానీ అటు టీడీపీ కానీ అధికారిక ప్ర‌క‌ట‌న చేయ‌లేదు. అయితే బాబుతో భేటీ అనంత‌రం  మీడియాతో ల‌గ‌డ‌పాటి మాట్లాడుతూ సీఎం చంద్ర‌బాబును మర్యాదపూర్వకంగానే కలిశానని తెలిపారు. తొలిసారి సచివాలయానికి వచ్చానని పేర్కొంటూ తాత్కాలిక సచివాలయం చాలా అద్భుతంగా ఉందని ల‌గ‌డ‌పాటి రాజ‌గోపాల్‌ ప్ర‌శంసించారు. తాత్కాలిక సచివాలయమే ఇంత అందంగా ఉంటే ఇక అసలు సచివాలయం వరల్డ్‌క్లాస్‌గా ఉంటుందని జోస్యం చెప్పారు. సచివాలయాన్ని అందంగా తీర్చిదిద్దినందుకు సీఎం చంద్రబాబును అభినందించానని రాజ‌గోపాల్ అన్నారు.

అయితే ఈ భేటీ వెనుక రాజ‌కీయ కార‌ణాలు ఉన్నాయ‌నే చ‌ర్చ సాగుతోంది. విజ‌య‌వాడ టీడీపీ ఎంపీ కేశినేని నాని తన వ్యాపారాన్ని మూసివేస్తున్న‌ట్లు ప్ర‌క‌టించిన నేప‌థ్యంలో టీడీపీ అధినేత‌, ఏపీ సీఎం చంద్ర‌బాబుతో  ల‌గ‌డ‌పాటి రాజ‌గోపాల్ భేటీ అవ‌డం ఇందుకు ఆజ్యం పోస్తోంది. ర‌వాణాశాఖ క‌మిష‌న‌ర్‌తో దురుసు ప్ర‌వ‌ర్త‌న‌, అర్దాంత‌రంగా వ్యాపారాన్ని మూసివేయ‌డం, త‌న సంస్థ‌ల్లో ప‌నిచేసే ఉద్యోగుల‌కు న్యాయం చేయ‌కుండా న‌డిబ‌జార్లో వ‌దిలేసిన తీరుపై విమ‌ర్శ‌ల నేప‌థ్యంలో వ‌చ్చే ఎన్నిక‌ల్లో కేశినేని నానికి టికెట్ ద‌క్క‌డం క‌ష్ట‌మ‌ని వార్త‌లు వినిపిస్తున్నాయి. ఈ నేప‌థ్యంలో రాజ‌కీయంగా క్రియాశీలంగా లేని రాజ‌గోపాల్ త‌న పొలిటిక‌ల్ రీ ఎంట్రీ కోసం టీడీపీ వైపు చూశార‌ని అంటున్నారు. అదే స‌మ‌యంలో టీడీపీ సైతం రాజ‌గోపాల్ విష‌యంలో ఆస‌క్తి ప్ర‌ద‌ర్శించ‌డం వ‌ల్లే పార్టీ అధినేత‌తో నేరుగా భేటీ జ‌రిగిందని తెలుస్తోంది. ఆయ‌న‌కు విజ‌య‌వాడ పార్ల‌మెంటు నుంచి పోటీ చేసే అవ‌కాశం ద‌క్క‌వ‌చ్చున‌ని టీడీపీ వ‌ర్గాలు అంటున్నాయి.

కాగా, కొద్ది కాలం క్రితం ఏపీ రాజ‌కీయాల గురించి ల‌గ‌డ‌పాటి ఆశ్చ‌ర్య‌క‌ర వ్యాఖ్య‌లు చేశారు.  గ్రామీణ ప్రాంతాల్లో ప్ర‌ధాన ప్ర‌తిప‌క్ష‌మైన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బ‌లంగా ఉందని ల‌గ‌డ‌పాటి విశ్లేషించారు. ఇటీవ‌లి కాలంలో వైసీపీ బ‌లోపేతం అయింద‌ని తెలిపారు. పట్టణ ప్రాంతాల్లో అధికార‌ టీడీపీ- వైసీపీలకు సమాన శాతం మ‌ద్ద‌తు ఉంద‌ని విశ్లేషించారు. గ‌తంలో అధికార పార్టీ అయిన కాంగ్రెస్‌ పార్టీ మాత్రం కనుమరుగైందని ల‌గ‌డ‌పాటి వివ‌రించారు. ప్ర‌స్తుత ప‌రిణామాల‌ను బ‌ట్టి చూస్తే రాబోయే ఎన్నిక‌ల్లో ఏపీలో అధికారం కోసం గ‌ట్టి పోటీ ఉండేలా క‌నిపిస్తోంద‌ని వ్యాఖ్యానించారు. ఇక త‌న రాజకీయ భవిష్యత్ పై మీడియా అడిగిన ప్ర‌శ్న‌ల‌కు స్పందిస్తూ తాను రాజకీయాలకు దూరంగా ఉన్నట్లు ల‌గ‌డ‌పాటి ప్ర‌క‌టించారు. అయితే ఆ వ్యాఖ్య చేసిన దాదాపు నెల త‌ర్వాత చంద్ర‌బాబుతో ల‌గ‌డ‌పాటి భేటీ అవ‌డం ఆస‌క్తికరంగా మారింది.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News