తెలంగాణలో కారు దూకుడు: లగడపాటి సర్వే..?

Update: 2018-11-22 07:55 GMT
లగడపాటి రాజగోపాల్. లోక్‌సభ మాజీ సభ్యుడు. సమైక్య రాష్ట్రం విడిపోకుండా ఉండేందుకు చివరి వరకూ పోరాడిన యోధుడు. అంతే కాదు పెప్పర్ స్ప్రేతో లోక్‌సభలో కలకలం రేపిన కాంగ్రెస్ పార్టీ లోక్‌సభ సభ్యుడు. రాష్ట్రం విడిపోదని, ఒకవేళ విడిపోతే తాను రాజకీయాల నుంచి తప్పుకుంటానని ప్రకటించి మాట ప్రకారం రాజకీయాల జోలికి వె‌ళ్లని నాయకుడిగా పేరు తెచ్చుకున్నారు లగడపాటి రాజగోపాల్. ఇవన్నీ ఒక ఎత్తు అయితే,  ఎన్నికలకు ముందు లగడపాటి రాజగోపాల్ చేసే సర్వేలు రాజకీయ పార్టీల్లోనూ, ప్రజల్లోనూ కూడా నిరంతరం సంచలనమే. ఇటీవల తెలుగు రాష్ట్రాల్లో లగడపాటి రాజగోపాల్ చేసిన సర్వేలు కూడా సంచలనం రేపుతున్నాయి. ప్రస్తుతం ఎన్నికల జరుగుతున్న తెలంగాణలో అధికార తెలంగాణ రాష్ట్ర సమితి విజయం ఖాయమని ఆయన సర్వేలో తేల్చారని చెబుతున్నారు. అయితే ఈ సర్వేను ఎన్నికల పోలింగ్ ముగిసిన తర్వాతే వెల్లడిస్తానని చెప్పిన లగడపాటి తనకు అత్యంత సన్నిహితులైన వారి వద్ద మాత్రం కారు జోరు ఎక్కువగానే ఉందని తేల్చినట్లు చెబుతున్నారు.

తెలంగాణలో అధికార తెలంగాణ రాష్ట్ర సమితిని ఓడించేందుకు ప్రతిపక్షాలన్నీ ఏకమై మహాకూటమిగా ఏర్పడినా వాటి పట్ల ప్రజల్లో వ్యతిరేకత ఉందని లగడపాటి సర్వేలో వెల్లడైందని చెబుతున్నారు. ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడిపై తెలంగాణ ప్రజలకు కోపం తగ్గలేదని సర్వేలో తేలినట్లు చెబుతున్నారు. తెలంగాణలో పట్టణ ప్రాంతాల్లో తెలంగాణ రాష్ట్ర సమితి పట్ల కొంత వ్యతిరేకత ఉన్నా... గ్రామాల్లో మాత్రం అనుకూలంగానే ఉందని అంటున్నారు. అలాగే వివిధ వ్రత్తుల్లో ఉన్న వారికి, రైతులకు, మహిళలకు, మైనార్టీలకు తెలంగాణ రాష్ట్ర సమితి అమలు చేసిన పథకాల ప్రభావం ఎంతో ఉందని, దీని కారణంగానే మరోసారి తెలంగాణ రాష్ట్ర సమితి తిరిగి అధికారంలోకి వస్తుందని సర్వేలో తేలినట్లు చెబుతున్నారు. మహాకూటమిలో కలగూర గంప పార్టీల్లో అనైక్యత కూడా ఆ పార్టీల పట్ల వ్యతిరేకతను పెంచుతోందని అంటున్నారు. కాంగ్రెస్ పార్టీ పట్ల మహాకూటమి ఏర్పాటుకు ముందు కాస్త సానుభూతి ఉన్నా తెలుగుదేశం పార్టీతో కలిసిన తర్వాత వ్యతిరేకత ఎక్కువైందని అంటున్నారు. దీని కారణంగానే ఈ ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్ర సమితి పట్ల ప్రజల్లో సానుకూలత వచ్చిందని సర్వేలో తేలిందటున్నారు.

Tags:    

Similar News