ఎగ్జిట్ పోల్స్ కంటే లగడపాటి లెక్కే పక్కా

Update: 2017-03-10 06:05 GMT
పోల్ సర్వేల్లో పండిపోయిన పొలిటికల్ పండిట్ లగడపాటి రాజగోపాల్ తాజాగా యూపీ, పంజాబ్ లలో గెలుపోటములను కూడా అంచనా వేయడంతో పాటు వాటిని విశ్లేషించారు. ఆ రెండు రాష్ట్రాల్లో సర్వేలు చేయించిన లగడపాటి అక్కడ ఎవరు గెలుస్తారో చెప్పడంతో పాటు ఎందుకు గెలుస్తారో చెప్పారు. అంతేకాదు.. ఓడిపోయే పార్టీలు ఎందుకు ఓడిపోతున్నాయన్నది కూడా చెప్పారు.  యూపీలో సీఎం అఖిలేశ్ యాదవ్ పార్టీ సమాజ్ వాది 225 స్థానాల్లో పోటీ చేసినా అందులో 120 మంది ఓడిపోవడం ఖాయమని ఆయన పక్కా లెక్క చెబుతున్నారు. యూపీలో మోడీ ప్రసంగాలు.. ఆయన హామీలు బాగా వర్కవుట్ అయ్యాయని.. పంజాబ్ లో కాంగ్రెస్ లో చేరిస సిద్ధూ బాగా ప్లస్ పాయింట్ అయ్యారని.. ఫలితంగా యూపీలో బీజేపీ, పంజాబ్ లో కాంగ్రెస్ గెలవడం ఖాయమని ఆయన తేల్చేశారు.
    
లగడపాటి రాజగోపాల్ 'ఫ్లాష్ టీం' ఈసారి ఉత్తరప్రదేశ్, పంజాబ్‌లోనూ సర్వే నిర్వహించింది. యూపీలో బీజేపీ అత్యధిక స్థానాలు సాధిస్తుందని సర్వే వెల్లడించింది.  యూపీలో ఎస్పీ-కాంగ్రెస్ ఒక్కటైనా బీజేపీ గెలవడానికి అనేక కారణాలు ఉన్నాయని లగడపాటి విశ్లేషించారు. సీఎం అఖిలేశ్‌కు వివాద రహితుడిగా పేరున్నా పార్టీ ఎమ్మెల్యేలపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉందన్నారు. అలాగే కాంగ్రెస్‌ తో కలవడంతోపాటు ఆ పార్టీకి వందకు పైగా సీట్లివ్వడం కూడా ప్రజల్లో వ్యతిరేకతకు ఓ కారణమన్నారు. ఎస్పీ అభ్యర్థుల్లో చాలామందిపై క్రిమినల్ కేసులు ఉన్నాయని, వారిపై ప్రజల్లో వచ్చిన వ్యతిరేకత గురించి తెలిసినా అఖిలేశ్ పట్టించుకోలేదని పేర్కొన్నారు. ఎస్పీ తరపున బరిలోకి దిగిన 225 మందిలో 120 మందికి పరాభవం తప్పదని రాజ్‌గోపాల్ జోస్యం చెప్పారు.
    
యూపీలో మోడీ విస్తృత ప్రచారమే బీజేపీని గట్టెక్కించనుందని తెలిపారు. హిందూ ఓట్ల ఏకీకరణకు మోడీ ప్రసంగాలు బాగా పనిచేశాయన్నారు. రంజాన్ నాడు నిరంతరంగా విద్యుత్ ఇచ్చే అఖిలేశ్ దీపావళి రోజున ఇవ్వడం లేదని, ముస్లింల  ఖబరస్థాన్ కోసం స్థలాలు ఇచ్చే ఎస్పీ ప్రభుత్వం హిందువులను విస్మరించిందన్న మోదీ ప్రచారం తీవ్ర ప్రభావం చూపిందన్నారు. అలాగే అందరికంటే ముందుగా మోదీ చేసిన సన్నకారు రైతుల రుణాలు మాఫీ ప్రకటన బాగా పనిచేసిందన్నారు. యూపీలో కాంగ్రెస్‌కు 30-35 సీట్లు మాత్రమే వస్తాయని అంచనా వేశారు.
    
పంజాబ్ పీఠాన్ని కాంగ్రెస్ కైవసం చేసుకుంటుందని లగడపాటి ఫ్లాష్ టీం వెల్లడించింది. అకాలీదళ్-బీజేపీ ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత ఉందన్నారు. 117 స్థానాలున్న పంజాబ్‌లో కాంగ్రెస్ గెలుపు తథ్యమని, ఆమ్ ఆద్మీ పార్టీ రెండో స్థానంతో సరిపెట్టుకుంటుందని లగడపాటి అంచనా వేశారు. కాంగ్రెస్‌కు 70 సీట్లు వస్తాయని, సిద్ధూ చేరిక కాంగ్రెస్‌కు కలిసొస్తుందని పేర్కొన్నారు.  అక్కడ బీజేపీకి 5 సీట్ల కంటే ఎక్కువ రావని తేల్చేశారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News