బెజవాడ పొలిటికల్ సీన్లోకి లగడపాటి...మ్యాటరేంటి... ?

Update: 2021-12-28 14:30 GMT
లగడపాటి రాజగోపాల్. ఈ పేరు తెలియని ఉమ్మడి ఏపీ ప్రజానీకం లేరు. కాంగ్రెస్ తరఫున రెండు సార్లు ఎంపీగా పనిచేశారు.అలాగే  ఏపీ రెండుగా విడిపోకూడదు అంటూ ఆయన సమైక్యాంధ్రా కోసం నిరాహారదీక్ష చేశారు. అంతే కాదు ఏపీని ముక్కలు కానీయమని కూడానాడు తొడగొట్టి మరీ గట్టిగానే  చెప్పారు. ఇక ఏపీ విడిపోతే తాను రాజకీయ సన్యాసం తీసుకుంటానని భీషణ శపధం చేశారు. ఆ మాటకు కట్టుబడి ఆయన రాజకీయాలకు ఈ రోజుకీ  దూరంగానే  ఉన్నారు.

అయితే రాజకీయ విశ్లేషకుడిగా సర్వేలు చేయిస్తూ  2019 దాకా తనదైన శైలిలో ఆయన పాత్ర పోషించారు. ఎపుడైతే తెలంగాణా, ఏపీ ఎన్నికల ఫలితాలు తేడా కొట్టాయో ఆయన సర్వేలు దారి తప్పాయో నాటి నుంచి వాటికీ స్వస్తి అనేశారు. ఇవన్నీ పక్కన పెడితే ఆయన చంద్రబాబుకు సన్నిహితుడుగా ముద్ర ఉంది.

దాంతో ఆయన మళ్లీ రాజకీయాల్లోకి రానున్నారు అన్న టాక్ అయితే ఈ మధ్య బాగానే వినిపిస్తోంది. వచ్చే ఎన్నికల్లో విజయవాడ ఎంపీ అభ్యర్ధిగా టీడీపీ తరఫున ఆయన్ని నిలబెట్టాలని బాబు చూస్తున్నారు అని కూడా ప్రచారం ఉంది. అయితే దానికి తోడు అన్నట్లుగా ఇపుడు మరో ప్రచారం కూడా వినిపిస్తోంది. లగడపాటి కాదు ఆయన వారసుడు పొలిటికల్ గా ఎంట్రీ ఇస్తారు అన్నదే ఆ టాక్.

లగడపాటి పెద్ద కుమారుడికి గన్నవరం టికెట్ ఇచ్చి అక్కడ బలంగా పాతుకుపోయిన సిట్టింగ్ ఎమ్మెల్యే వల్లభనేని వంశీని ఓడించాలన్నదే టీడీపీ టార్గెట్ గా చెబుతున్నారు. వల్లభనేని వంశీ 2014, 2019 ఎన్నికల్లో వరసగా గెలిచి అజేయుడు అనిపించుకున్నారు. ఆయనకు గన్నవరంలో సొంత ఇమేజ్ ఉంది. లేకపోతే వైసీపీ వేవ్ లో కూడా గెలవడం అంటే ఆషామాషీ వ్యవహారం కానే కాదు.

వచ్చేసారి ఆయన వైసీపీ టికెట్ మీద అక్కడ నుంచే పోటీకి దిగడం ఖాయమని అంటున్నారు. మరి ఆయన్ని ఓడించాలి అంటే సరైన క్యాండిడేట్ ఎవరా అని వెతికి వెతికి మరీ లగడపాటి ఫ్యామిలీని టీడీపీ ఎంచుకుంది అంటున్నారు. లగడపాటి రాజకీయ ప్రతిజ్ఞకు భంగం వాటిల్లకుండా ఆయన రాజకీయ పలుకుబడిని సేవలను ఫుల్ గా వాడుకోవచ్చు అన్న ఎత్తుగడ కూడా దీని వెనక ఉందిట. అందుకే ఆయన్ని కాదని కుమారుడికి గన్నవరం ఎమ్మెల్యే టికెట్ ఇచ్చి లగడపాటి లాంటి రాజకీయ మేధావిని పక్కన ఉంచుకోవాలని టీడీపీ పెద్దలు చూస్తున్నారుట.

అర్ధబలం, అంగబలంతో పోలిస్తే లగడపాటి వల్లభనేనితో సమ ఉజ్జీ అని టీడీపీ వ్యూహకర్తలు అంచనా వేస్తున్నారుట. ఇక్కడో తమాషా చెప్పుకోవాలి. 2009 ఎన్నికల్లో లగడపాటి రాజగోపాల్ కాంగ్రెస్ నుంచి విజయవాడ ఎంపీగా పోటీ చేస్తే ఆయన్ని టీడీపీ ఎంపీ అభ్యర్ధిగా ఢీ కొట్టి ఓడింది వల్లభనేని వంశీ. మరి ఇపుడు లగడపాటి కుమారుడు కనుక గన్నవరంలో ఎంట్రీ ఇస్తే ఆయన గెలిచి పాత ఓటమిని వంశీ బదులు తీర్చుకుంటారా లేక ఓడిపోయి తండ్రీ కొడుకుల చేతిలో పరాజయం పాలు అయిన రికార్డుని సొంతం చేసుకుంటారా అన్నది కూడా చూడాలని అంటున్నారు. మొత్తానికి గన్నవరంలో వంశీని ఓడించాలన్న టీడీపీ పట్టుదలకు లగడపాటి బలం కూడా తోడు అయితే ఇక్కడ ఫైటింగ్ ఇంటెరెస్టింగే అంటున్నారు.
Tags:    

Similar News