ల‌గ‌డ‌పాటి క్లారిటీ!... స‌ర్వే జోస్య‌మేన‌ట‌!

Update: 2017-08-24 09:47 GMT
రాజ‌కీయాల్లో త‌న‌దైన స్టైల్‌ ను ఏర్పాటు చేసుకున్న కాంగ్రెస్ మాజీ నేత‌ - విజ‌య‌వాడ మాజీ ఎంపీ ల‌గ‌డ‌పాటి రాజ‌గోపాల్ తాజాగా మ‌రోసారి వార్త‌ల్లోకి ఎక్కేశారు. రాష్ట్ర విభ‌జ‌న‌తో రాజ‌కీయాల‌కు దూరంగా ఉన్న ఆయ‌న‌.. రాష్ట్రం స‌హా దేశంలో  ఎప్పుడు ఎక్క‌డ ఎల‌క్ష‌న్స్ జ‌రిగినా.. త‌న స‌ర్వేతో జోస్యం చెప్పేందుకు ముందుకు వ‌చ్చేస్తారు. ఇప్పుడు హోరా హోరీగా సాగిన నంద్యాల ఉప ఎన్నిక‌పైనా ల‌గ‌డ‌పాటి త‌న స్టైల్‌ లో జోస్యం చెప్పేశారు. నిన్న ఎన్నిక‌లు ముగిసిన గంట‌లోనే మీడియా ముందుకు వ‌చ్చిన ఆయ‌న త‌న స‌ర్వే వివ‌రాల‌ను ప్ర‌క‌టించేశారు. నంద్యాల‌లో చంద్ర‌బాబు అండ్‌ కో విజ‌యం సాధించేస్తుంద‌ని చెప్పారు.

అంతేకాదు,  భారీ ఎత్తున జ‌రిగిన పోలింగ్ స‌ర‌ళిపైనా ఆయ‌న స్పందించారు. ఓటింగ్‌ శాతం పెరిగినందున ఫలితంలో మార్పు వస్తుందని - వైసీపీ విజయం సాధిస్తుందనడం సరికాదని కొత్త చ‌ర్చ‌కు తెర‌దీశారు. పోలింగ్‌ శాతం పెరిగినా టీడీపీ 10% ఓట్ల మెజారిటీని సాధిస్తుందన్నారు. గురువారం నాటికి మెజారిటీపై స్పష్టత వస్తుందన్నారు. నంద్యాలలో 1లక్షా 73వేల 335 మంది ఓటు వేసినందున.. 17 వేల 333 ఓట్ల మెజారిటీ టీడీపీకి రావచ్చన్నారు.  దీంతో ఒక్క‌సారిగా తెలుగు త‌మ్ముళ్లు పండ‌గ‌కి సిద్ధ‌మ‌య్యారు. అయితే, ఇంత‌లోనే ఏమ‌నుక‌న్నారో ఏమో ల‌గ‌డ‌పాటి.. వెంట‌నే మాట మార్చేశారు. తాను చెప్పిన  లెక్క‌లు కేవ‌లం అంచ‌నా మాత్ర‌మేన‌ని కుండ‌బ‌ద్ద‌లు కొట్టారు.  అంటే వైసీపీ గెలుపును ఆయ‌న ప‌రోక్షంగా అంగీక‌రించారు.

నిజ‌మైన రిజ‌ల్ట్ కోసం సోమ‌వారం వ‌ర‌కు వెయిట్ చేయాల‌ని సూచించారు.  గ్రామీణ ప్రాంతాల్లో చైత‌న్యం క‌నిపించింద‌ని, ముఖ్యంగా మ‌హిళ‌లు భారీ సంఖ్య‌లో పోలింగ్ కేంద్రాల‌కు క్యూక‌ట్టార‌ని చెప్పుకొచ్చిన ఆయ‌న  వైసీపీ బ‌లంగానే పోటీ ఇచ్చింద‌ని తెలిపారు. ఈ ఉప ఎన్నికల్లో పురుషుల కంటే మహిళలే అధికంగా ఓట్లు వేయడానికి తరలివచ్చారు. 1983 ఎన్నికల నుంచి 2014 వరకు జరిగిన ఎన్నికల్లో ఎన్నడూ 73.84 శాతం మించి ఓట్లు పోలవ్వలేదు. ఇప్పుడు మాత్రం 79.20 శాతం పోలింగ్‌ నమోదైంది. దీంతో అంచ‌నాలు  ఎవ‌రికి వారికే ఉన్నా.. ఖ‌చ్చితంగా ఏ ఒక్క‌రూ చెప్ప‌లేక‌పోతున్నారు. దీంతో అంద‌రూ ఇప్పుడు సోమ‌వారం కోసం ఎదురు చూస్తున్నారు.
Tags:    

Similar News