బీజేపీలోకి లగడపాటి?

Update: 2016-02-16 06:01 GMT
 ''తినమరిగిన పిల్లికి చేపల వాసన వస్తుంటే ఊరుకుంటుందా?'' అన్న సామెత వినే ఉంటారు. మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్ పరిస్థితి అలాగే ఉంది ఇప్పుడు. ఒకప్పుడు సంచలనాలకు మారుపేరుగా ఉన్న ఈ మాజీ ఎంపీ విభజన కారణంగా రాజకీయాలకు రిటైర్ మెంట్ ప్రకటించారు. అయితే... అలవాటయిన ప్రాణం ఊరుకోదు కదా.. అందుకే మళ్లీ రాజకీయాల్లోకి వచ్చేందుకు ఆయన ప్రణాళికలు వేసుకుంటున్నట్లు తెలుస్తోంది. ఎత్తులు - పై ఎత్తులు - జిమ్మిక్కులు అన్నీ తెలిసిన లగడపాటికి ప్రస్తుతం ఉభయ తెలుగు రాష్ట్రాల్లో, కేంద్రంలో ఉన్న రాజకీయ పరిస్థితులు చూస్తుంటే రాజకీయాల్లో వెంటనే పునఃప్రవేశం చేయాలని అనిపిస్తోందట. అవకాశాలను క్యాష్ చేసుకోవడంలో దిట్ట అయిన ఆయనకు ఇప్పుడు అన్నీ మంచి శకునాలే కనిపిస్తున్నాయి. తనకు రాజకీయంగా, వ్యాపారపరంగా కూడా ఇది మంచి కాలమని భావిస్తున్న ఆయన అందుకు రాజకీయంగా యాక్టివ్ గా ఉండడం అవసరం అనుకుంటూ రిటైర్ మెంట్ కు తూచ్ చెప్పాలని అనుకుంటున్నట్లు సమాచారం. ఈ విషయంపై ఆయన క్లారిటీ ఇవ్వకపోయినా అందుకు గ్రౌండ్ ప్రిపేర్ చేస్తున్నట్లుగానే ఉంది. విజయవాడలో తాజాగా కనిపిస్తున్న పోస్టర్లు చూస్తున్న అక్కడి ప్రజలు ''కుచ్ కుచ్ హోతా హై'' అనుకుంటున్నారు.

రెండేళ్ల కిందట రాజకీయాలకు రిటైర్ మెంట్ ప్రకటించిన లగడపాటి మళ్లీ రాజకీయాల్లోకి రావాలంటూ విజయవాడలో భారీగా పోస్టర్లు కనిపిస్తున్నాయి. లగడపాటి అభిమానులమంటూ కొందరు వీటిని ఏర్పాటు చేశారు. అందులో బీజేపీ నేతలు - జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఫొటోలు కూడా పెట్టడంతో ఇందులో ఏదో మతలబు ఉందని... లగడపాటే ఈ పోస్టర్లు ఏర్పాటు చేయించి ఉంటారని భావిస్తున్నారు. దీంతో లగడపాటి బీజేపీలో చేరుతారన్న ప్రచారం పెద్ద ఎత్తున జరుగుతోంది.

అయితే... లగడపాటి పుట్టిన రోజు సందర్భంగా ఇలాంటి పోస్టర్లు కనిపించగా.. వాటికి కౌంటరుగా కూడా మరికొన్ని పోస్టర్లు వెలశాయి. లగడపాటి రాజకీయాల్లో ఉన్నప్పుడు 75 వేల కోట్ల ప్రజాధనం లూటీ చేశారని.. మళ్లీ రాజకీయాల్లోకి వచ్చి దోచుకోవాలనుకుంటున్నారా అంటూ ఆరోపణలతో కూడిన ప్లెక్సీలను కొందరు ఏర్పాటు చేశారు. దీనిపై లగడపాటి అభిమానులు ఆందోళన చేసి... వాటిని చించేశారు.

ఈ పోటాపోటీ ఫ్లెక్సీలు, గొడవల మాట ఎలా ఉన్నా రాజగోపాల్ మాత్రం రాజకీయ రీ ఎంట్రీకి రెడీగా ఉన్నారని.... బీజేపీయా - టీడీపీయా అన్నది తేల్చుకోలేకపోతున్నారని కొందరంటున్నారు. ఇంకొందరు మాత్రం ఇప్పటికే ఆయన బీజేపీతో సన్నిహితంగా ఉంటున్నారని... త్వరలో ఆయన ఆ పార్టీలో చేరి కీలకంగా వ్యవహరించబోతున్నారని వినిపిస్తోంది.
Tags:    

Similar News