లక్ష గ్రీన్‌ కార్డులు వృథా..భారతీయులకి ఝలక్ !

Update: 2021-08-06 10:34 GMT
ప్రపంచవ్యాప్తంగా యూఎస్‌ సిటిజన్‌ షిప్‌ కోసం వేచిచూస్తున్న వారి జాబితా 2020లో 1.2 మిలియన్లకు చేరింది. యూఎస్‌ సిటిజన్‌ షిప్‌ అండ్‌ ఇమ్మిగ్రేషన్‌ సర్వీసెస్‌(యూఎస్‌ సీఐఎస్‌) ఈ విషయాన్ని వెల్లడించింది. ఇది యూఎస్‌ చరిత్రలో అత్యధికమని క్యాటో ఇన్‌ స్టిట్యూట్‌ పేర్కొంది. అమెరికాలో వేలాది మంది భారతీయులు గ్రీన్‌ కార్డుల కోసం ఎంతగానో వేచి చూస్తుంటారు. అమెరికాలో శాశ్వత నివాసానికి అవకాశం కల్పించే గ్రీన్‌ కార్డు చాలామందికి చిరకాల కోరిక. అయితే అత్యంత విలువైన ఆ కార్డులు, ఈసారి లక్ష దాకా వృథా కాబోతున్నట్లు తెలుస్తోంది. అంటే లక్ష మందికి గ్రీన్‌కార్డు హోదా పొందే అవకాశం కోల్పోబోతున్నారు.

కరోనా మహమ్మారి, అనంతరం అమెరికా ఇమ్మిగ్రేషన్‌లో నత్తనడకన సాగుతున్న పనులే ఇందుకు కారణంగా తెలుస్తోంది. అయితే అమెరికాలో చట్టబద్దమైన ఇమ్మిగ్రేషన్‌ వ్యవహారాలు చూసే బాధ్యత సిటిజన్‌ షిప్‌, ఇమ్మిగ్రేషన్‌ సర్వీసెస్‌ సంస్థ  కు ఉంటుంది. 2020 అక్టోబరులో లక్షా 20వేల గ్రీన్‌కార్డుల జారీకి ఈ సంస్థ తన వార్షిక పని ప్రారంభించింది. ఈ సెప్టెంబరుతో ఈ ఏడాది పని పూర్తి కానుంది. అప్పటిదాకా ఎన్ని గ్రీన్‌కార్డులు జారీ చేస్తే అన్ని ఈ ఏడాది కోటాలో పూర్తయినట్లు లెక్క. మిగిలినవన్నీ వృథా అయినట్లే.

ఇప్పటి వరకు ఎన్నింటిని పూర్తి చేశారనేదానిపై కచ్చితమైన అధికారిక లెక్కలు లేకపోయినా, జూలైలో ఇచ్చిన ఇంటర్వ్యూలో  విదేశాంగ శాఖ అధికారి చార్లీ ఓపెన్‌ హీమ్‌ చెప్పిన సంగతి చాలామంది అమెరికా ఆశావహులకు ఆశనిపాతంలా తాకింది. ఈ సెప్టెంబరు చివరి నాటికి సుమారు లక్ష గ్రీన్‌కార్డులు ఇంకా పెండింగ్‌ లో ఉండిపోతాయని చార్లీ స్పష్టం చేశారు. అంటే సెప్టెంబరు చివరినాటికి వాటిని జారీ చేయకుంటే మురిగిపోయినట్లే. ఈసారి గ్రీన్‌ కార్డు అవకాశం వచ్చీ చేజారిపోయిన వారు వచ్చే ఏడాది కోటాలో వరుసలో ముందర ఉండరు. మళ్ళీ వారికి అవకాశం రావటానికి కనీసం ఐదేళ్లయినా పట్టవచ్చని న్యాయనిపుణులు వ్యాఖ్యానిస్తున్నారు.

కాగా, నిధుల సమస్యను ఎదుర్కొంటున్న యూఎస్‌ సీఐఎస్‌ ను కరోనా మహమ్మారి కారణంగా మరింతగా దెబ్బతీసింది. కరోనా వైరస్ తో పనితీరు నెమ్మదించి, సిబ్బంది కొరత ఏర్పడింది. ఫలితంగా గ్రీన్‌ కార్డుల జారీ మరింత ఆలస్యం అవుతోంది. సగటున ఓ గ్రీన్‌ కార్డు దరఖాస్తుల పరిష్కారానికి పదిన్నర నెలల సమయం పట్టేది. ఇప్పుడు మరో రెండు నెలలు అదనంగా పడుతోందని చెబుతున్నారు. దేశాల ప్రాతిపదికన అమెరికాలో గ్రీన్‌ కార్డుల జారీ చేస్తారు. భారతీయుల నుంచి ఎక్కువ దరఖాస్తులుండటంతో పోటీ మరింతగా ఎక్కువగా ఉంది. అవకాశం రావటానికి చాలా ఏళ్లు పడుతోంది. అదే తక్కువ మంది ఉండే దేశాల్లోని వారు వెనకాల వచ్చి దరఖాస్తు చేసినా గ్రీన్‌ కార్డు వచ్చేస్తోంది.

తాజా పరిస్థితి నేపథ్యంలో గ్రీన్‌ కార్డు దరఖాస్తుదారులంతా సోమవారం మేరీలాండ్‌ ఫెడరల్‌ డిస్ట్రిక్ట్‌ కోర్టులో ఓ పిటిషన్‌ దాఖలు చేశారు. ఒకవేళ ఈ సెప్టెంబరులోగా తమ దరఖాస్తులు ఆమోదం పూర్తికాకుంటే వచ్చే ఏడాది కోటాలో వరుసలో తమను ముందే ఉంచేలా ఆదేశాలు జారీ చేయాలని పిటిషన్‌ లో పొందుపరిచారు. యూఎస్‌ గ్రీన్‌ కార్డులు పొందేందుకు వేచిచూస్తున్న జాబితాలో భారతీయుల తదుపరి చైనీయులు అధికంగా ఉన్నట్లు యూఎస్‌ సీఐఎస్ తాజాగా వెల్లడించింది. ప్రపంచంలోని మిగిలిన దేశాలవారు 18 శాతం వాటాను ఆక్రమిస్తున్నట్లు వివరించింది. శాశ్వత ఉపాధి కార్యక్రమంలో భాగంగా యూఎస్‌ ప్రభుత్వం ఎంప్లాయ్‌ మెంట్‌ గ్రీన్‌ కార్డులను జారీ చేస్తోంది. తద్వారా అత్యంత నైపుణ్యమున్న వారికి దేశంలో నివసించేందుకు వీలు కల్పిస్తోంది. వార్షికంగా 1.4 లక్షల మందికి మించి ఎంప్లాయ్‌ మెంట్‌ గ్రీన్‌ కార్డుల జారీకి అవకాశంలేదని ఈ సందర్భంగా విశ్లేషకులు తెలియజేశారు.
Tags:    

Similar News