వామ్మో.. 5జీ కోసం తొలిరోజే అన్ని ల‌క్ష‌ల కోట్లా?

Update: 2022-07-27 08:36 GMT
మ‌న‌దేశంలో అత్యంత వేగవంతమైన ఇంటర్నెట్ సేవ‌లు అందించ‌డం కోసం 5జీ స్పెక్ట్ర‌మ్ వేలాన్ని కేంద్ర ప్ర‌భుత్వం జూలై 26న ప్రారంభించిన సంగ‌తి తెలిసిందే. ఆన్‌లైన్ వేలం ద్వారా నిర్వ‌హిస్తున్న ఈ 5జీ స్పెక్ట్ర‌మ్ ను ద‌క్కించుకునేందుకు బ‌డా పారిశ్రామికవేత్త‌లు రంగంలోకి దిగిన సంగ‌తి తెలిసిందే. ముకేష్ అంబానీ (రిల‌య‌న్స్ జియో), గౌత‌మ్ అదానీ (అదానీ పోర్ట్స్), సునీల్ మిట్ట‌ల్ (ఎయిర్‌టెల్‌), కుమార మంగ‌ళం బిర్లా (వొడాఫోన్) రంగంలోకి దిగారు.

కాగా 5జీ స్పెక్ట్ర‌మ్ కోసం మంగళవారం ప్రారంభమైన వేలానికి భారీ స్పందన లభించింది. తొలి రోజున నాలుగు రౌండ్లలో నాలుగు కంపెనీలు ఏకంగా రూ. 1.45 లక్షల కోట్లకు బిడ్లు వేశాయి. జూలై 27న బుధవారం కూడా ఈ-వేలం కొనసాగనుంది.

అంచనాలను దాటి తొలి రోజే ఏకంగా రూ. 1.45 లక్షల కోట్ల బిడ్లు దాఖల‌వ‌డంతో 5జీ స్పెక్ట్ర‌మ్ కోసం కంపెనీల మ‌ధ్య ఏ స్థాయిలో పోటీ ఉందో అర్థం చేసుకోవ‌చ్చ‌ని అంటున్నారు. రు. ఆగస్టు 14 కల్లా బిడ్ల‌లో విజేత‌గా నిలిచిన కంపెనీకి స్పెక్ట్రంను కేటాయిస్తారు. మ‌న‌దేశంలో సెప్టెంబర్‌ నాటికి 5జీ సేవలు ప్రారంభమయ్యే అవకాశం ఉంది.  

కాగా గత వేలంలో అమ్ముడు కాకుండా మిగిలిపోయిన 700 మెగాహెట్జ్‌ బ్యాండ్‌కు కూడా ఈసారి బిడ్లు వచ్చినట్లు కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణ‌వ్ తెలిపారు. మధ్య స్థాయి 3300 మెగాహెట్జ్, పైస్థాయి 26 గిగాహెట్జ్‌ బ్యాండ్‌లపై కంపెనీలు ఎక్కువ ఆస‌క్తిని చూపాయి.

4జీ సర్వీసులతో పోలిస్తే 5జీ టెలికం సేవలు అత్యంత వేగవంతంగా ఉంటాయి. వీటితో అత్యంత నాణ్యమైన వీడియోలు, సినిమాలను కేవలం సెకన్ల వ్యవధిలోనే డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు. టెలీ మెడిసిన్, అడ్వాన్స్‌డ్‌ మొబైల్‌ క్లౌడ్‌ గేమింగ్‌ మొదలైన విభాగాల్లో 5జీ సేవలు ఉపయోగకరంగా ఉండనున్నాయి. ప్రస్తుతం 600 మెగాహెట్జ్‌ మొదలుకుని 26 గిగాహెట్జ్‌ వరకూ వివిధ ఫ్రీక్వెన్సీల్లో స్పెక్ట్రంను వేలం వేస్తున్నారు.

20 ఏళ్ల లీజు కాలానికి కేంద్ర ప్ర‌భుత్వం ఆయా కంపెనీల‌కు 5జీ స్పెక్ట్ర‌మ్ ను క‌ట్ట‌బెట్ట‌నుంది. దేశీయ అవసరాలకు అనుగుణంగా ఎప్పటికప్పుడు ఈ స్పెక్ట్రమ్‌ను ఆయా కంపెనీలకు వేలం ద్వారా కేటాయిస్తుంది. 20 ఏళ్ల‌ తర్వాత కంపెనీలు పొందిన స్పెక్ట్రమ్‌ను ప్రభుత్వానికి అప్పగించాల్సి ఉంటుంది.
Tags:    

Similar News