ఈ ఇద్ద‌రు సీఎంల‌కు తాజా ఎన్నిక‌లు పీడ‌క‌లే

Update: 2017-03-11 12:35 GMT
ఐదు రాష్ర్టాల ఎన్నిక‌ల్లో భాగంగా ఉత్త‌రాఖండ్‌ - గోవాల్లో విచిత్ర‌మైన ప‌రిస్థితి ఎదురైంది. ముఖ్యంగా ఉత్తరాఖండ్ సీఎం హ‌రీష్ రావ‌త్ ప‌రిస్థితి అయితే చాలా ఇబ్బంది క‌రం. తాజా ఎన్నిక‌ల్లో రెండు స్థానాల నుంచి రావ‌త్‌  పోటీ చేసినా.. ఒక్క చోటా ఆయ‌న‌కు గెలుపు ద‌క్క‌లేదు. మొద‌ట హ‌రిద్వార్ రూర‌ల్ నుంచి రావ‌త్ ఓట‌మి చ‌విచూశారు. 2009 సాధార‌ణ ఎన్నిక‌ల్లో ఈ స్థానం నుంచే ఆయ‌న ఎంపీగా గెలిచారు. ఇక కిచ్చా స్థానం నుంచి కూడా ఓడిపోవ‌డం రావ‌త్‌ కు మింగుడుప‌డ‌టం లేదు. ఇక్క‌డ కేవ‌లం 1500కుపైగా ఓట్ల తేడాతో రావ‌త్ ఓడిపోయారు. జ‌న‌వ‌రి 26నే ఈ స్థానం నుంచి ఆయ‌న నామినేష‌న్ వేశారు. కిచ్చాలో క‌చ్చితంగా గెలుస్తాన‌ని ఆయ‌న విశ్వాసం వ్య‌క్తంచేసినా.. ప్ర‌జ‌లు మాత్రం మ‌రో తీర్పు ఇచ్చారు. రెండు స్థానాల నుంచి పోటీ చేసిన తొలి ఉత్త‌రాఖండ్ సీఎంగా హ‌రీష్ రావ‌త్ నిలిచారు.

మ‌రోవైపు గోవా అసెంబ్లీ ఎన్నిక‌ల్లో ఆ రాష్ట్ర సీఎం ల‌క్ష్మీకాంత్ ప‌ర్సేక‌ర్‌ కు అవ‌మానం ఎదురైంది. మాండ్రెమ్ స్థానం నుంచి పోటీ చేసిన ఆయ‌న‌కు ఓట‌మి ఎదురైంది. సీఎం పర్సేకర్ పై కాంగ్రెస్ అభ్యర్థి దయానంద్ సోప్టే గెలుపొందారు. ఈ రాష్ట్రంలో ఏ పార్టీ అధికారం చేప‌డుతుంద‌నే ఆస‌క్తి నెల‌కొంది.  గోవాలోని మొత్తం 40 స్థానాలకు గాను 14 స్థానాల్లో విజయం సాధించిన కాంగ్రెస్.. ఒక స్థానంల్లో ముందంజలో ఉంది. బీజేపీ 12 స్థానాల్లో విజయం సాధించి.. రెండు స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతోంది. ఇతరులు తొమ్మిది స్థానాల్లో గెలుపొందారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News