గడ్డి కరచిన పాపం.. లేటు వయసులో శాపం

Update: 2018-01-06 12:42 GMT
‘‘నా వయస్సు ఇప్పుడు డెబ్భయ్యేళ్లు.. అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నాను. తీర్పు ఇచ్చేప్పుడు మానవతా దృక్పథంతో పరిశీలించండి.. నాకు తక్కువ శిక్ష వేసేలా దయపెట్టండి’’ అని లాలూ ప్రసాద్ యాదవ్ న్యాయస్థానాన్ని వేడుకున్నారు. కానీ.. తీర్పు ఇవ్వడానికి ముందు న్యాయమూర్తికి లాలూ దళాల నుంచి ఫోన్ కాల్స్ కూడా వచ్చాయి. అవి బెదిరింపులో, విజ్ఞప్తులో స్పష్టత లేదు గానీ.. వాటి గురించి కూడా ప్రస్తావిస్తూనే.. తాను న్యాయం చట్టం ప్రకారం మాత్రమే నడుచుకుంటా అని సెలవిచ్చిన న్యాయమూర్తి లాలూ ప్రసాద్ కు మూడున్నరేళ్ల జైలు శిక్ష విధించారు.

‘‘జబ్ తక్ సమోసా మే ఆలూ రహతా హై.. తబ్ తక్ బీహార్ మే లాలూ రహతా హై’’ అనేది ఒకప్పుడు లాలూ ప్రసాద్ తన గురించి తాను స్వాతిశయంతో చెప్పుకునే మాట. ఆ హీరోయిజం ఆయనలో ఇప్పుడు లేదు. వార్ధక్యంతో, అనారోగ్యంతో కోర్టుకు రాలేని పరిస్థితిలో ఆయన జైలునుంచి వీడియో కాన్ఫరెన్సు ద్వారా పాల్గొని తనకు చేదు తీర్పును వినవలసి వచ్చింది. ఇప్పటికీ సమోసాలో ఆలూ అలాగే ఉంది. బీహార్ లో లాలూ కూడా ఉన్నారు.. కాకపోతే, రాంచీలోని బిస్రాముండా జైలులో ఉన్నారు.

వందల కోట్ల రూపాయలు స్వాహా చేసిన గడ్డి స్కాం ఇది. దీనిపై సుదీర్ఘకాలంగా విచారణలు జరుగుతూనే ఉన్నాయి. ఇదివరలోనే లాలూ ప్రసాద్ కు గడ్డిస్కాంలోని ఒక కేసులో ఐదేళ్ల జైలు శిక్ష పడింది. ఇది తాజాగా మరో గడ్డి కేసులో మూడున్నరేళ్ల శిక్ష. దీనితో పాటూ రెండు జరిమానాలుగా మొత్తం పదిలక్షల జరిమానా కూడా విధించారు. లాలూ ప్రసాద్ రాజకీయ జీవితానికి ఎప్పుడో తెరపడిపోయింది. ఆయన కేవలం ఎన్నికల ప్రచారాలకు- రాజకీయ వ్యూహరచనలకు పరిమితం కావడం తప్ప.. పదవుల్లోకి వచ్చే అర్హతను ఎన్నడో కోల్పోయారు. ఇప్పుడు మళ్లీ జైలు శిక్ష పడింది. కోర్టు ఆవరణలో ఆయన కుమారుడు తేజస్వీ యాదవ్ చెప్పినట్లుగా.. చట్టం తన పని తాను చేసుకుపోయింది.. వీరు హైకోర్టులో అప్పీలు చేసుకోగలరు. కానీ ఈ వయసులో లాలూప్రసాద్ కు సంక్రమించిన దురవస్థను చక్కదిద్దుకోలేరు. గడ్డికరచిన పాపం.. లాలూకు శాపంగా మారినట్లు కనిపిస్తోంది.
Tags:    

Similar News