లాలూ ప్ర‌చారం చేశార‌ట‌!... ఎస్పీ గెలుస్తుంద‌ట‌!

Update: 2017-03-11 04:36 GMT
దేశ ప్ర‌జలంతా ఆస‌క్తిగా ఎదురుచూస్తున్న ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఫ‌లితాలు మ‌రికొన్ని గంట‌ల్లో వెలువ‌డ‌నున్నాయి. ఐదు రాష్ట్రాల్లో ఇప్ప‌టికే పూర్తి అయిన ఎన్నిక‌ల‌కు సంబంధించిన‌ ఓట్ల లెక్కింపు నేటి ఉద‌యం ప్రారంభ‌మైంది. ఈ ప‌లితాలు త‌మ‌కు అనుకూలంగా ఉంటాయ‌ని బీజేపీ చెబుతుంటే.. కాదు త‌మ‌కే అనుకూలంగా ఉంటాయ‌ని కాంగ్రెస్ పార్టీతో పాటు ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌ లోని అధికార పార్టీ స‌మాజ్ వాదీ పార్టీతో పాటు ఆ రాష్ట్ర అసెంబ్లీలోని విప‌క్షం బ‌హుజ‌న స‌మాజ్ పార్టీ కూడా వాదిస్తున్నాయి. బ‌రిలో నిలిచిన ప్ర‌తి ఒక్క‌రి అభిప్రాయం ఇలాగే ఉంటుంద‌న్న విష‌యం మ‌న‌కు తెలిసిందే. రోజుల త‌ర‌బ‌డి ప్ర‌చారం చేసిన ఆయా పార్టీలు - ఆ పార్టీల అభ్య‌ర్థులు విజ‌యం త‌మ‌దేన‌ని చెప్పుకోవ‌డం స‌హ‌జ‌మే.

అయితే ఎన్నిక‌లు ముగిసిన త‌ర్వాత ఓట్ల లెక్కింపున‌కు ముందు వెలువడే ఎగ్జిట్ పోల్స్ అన్నీ కూడా దాదాపుగా బీజేపీదే విజ‌య‌మ‌ని చెబుతున్నాయి. కీల‌క రాష్ట్ర‌మైన ఉత్త‌ర‌ప్ర‌దేశ్ తో పాటు మిగిలిన నాలుగు రాష్ట్రాల్లోని మూడింటిలో న‌రేంద్ర మోదీ అధ్య‌క్ష‌త‌న భారీ ఎత్తున ప్రచారం చేసిన బీజేపీ గెలిచే అవ‌కాశాలున్నాయ‌ని ఆ ఎగ్జిట్ పోల్స్ తేల్చేశాయి. ఓట్ల లెక్కింపు ప్రారంభ‌మైన నేప‌థ్యంలో ఫ‌లితాలు త్వ‌ర‌లోనే వెలువ‌డ‌తాయి గానీ... ఈ ఫ‌లితాల‌పై నిన్న చాలా మంది చాలా ర‌కాలుగా త‌మ  త‌మ అభిప్రాయాల‌ను వెల్ల‌డించారు. మిగిలిన వారంద‌రి అభిప్రాయాలు ఎలా ఉన్నా.. ఈ ఎన్నిక‌ల‌తో ఏమాత్రం సంబంధం లేని, అస‌లు ఎన్నిక‌లే జ‌ర‌గ‌ని బీహార్‌ కు చెందిన కీల‌క రాజ‌కీయ వేత్త - రాష్ట్రీయ జ‌న‌తాద‌ళ్ అధ్య‌క్షుడు లాలూ ప్ర‌సాద్ యాద‌వ్ చెప్పిన ప్రిడిక్ష‌న్ కాస్తంత వెరైటీగా ఉంద‌ని చెప్ప‌క త‌ప్ప‌దు.

ఎందుకంటే బీహార్‌ కు చాలా కాలం పాటు ముఖ్య‌మంత్రిగా ప‌నిచేసిన ఆయ‌న‌... కేంద్ర మంత్రిగానూ ప‌నిచేశారు. బీహార్ రాజ‌కీయాల‌ను దాదాపుగా శాసించిన రీతిగా పాల‌న సాగించిన ఆయ‌న గ‌డ‌చిన ఎన్నిక‌ల్లో తాను త‌ప్పుకుని త‌న పుత్ర‌ర‌త్నాల‌ను బ‌రిలోకి దింపేసి వారిని మంత్రులుగా చేశారు. ఇక లాలూ చెప్పిన  ప్రిడిక్ష‌న్ విష‌యానికి వ‌స్తే... ఉత్త‌ర‌ప్ర‌దేశ్ లో స‌మాజ్ వాదీ పార్టీదే విజ‌య‌మ‌ని ఆయన చెప్పుకొచ్చారు.  ఇందుకు గ‌ల కార‌ణాల‌ను కూడా వివ‌రించిన ఆయ‌న‌... ఉత్త‌ర‌ప్ర‌దేశ్ ఎన్నిక‌ల్లో  భాగంగా తాను స‌మాజ్ వాదీ పార్టీ త‌ర‌ఫున ప్ర‌చారం చేశాన‌ని, త‌న‌తో పాటు ఉద్ధండులంతా స‌మాజ్ వాదీ పార్టీ త‌ర‌ఫున‌నే ప్ర‌చారం చేశార‌ని ఆయ‌న చెప్పుకొచ్చారు. త‌మ ప్ర‌చారం కార‌ణంగా ఓటర్లంతా స‌మాజ్ వాదీ పార్టీ వైపు మొగ్గార‌ని, ఆ పార్టీ విజ‌యం సాధిస్తుంద‌ని కూడా లాలూ చెప్పారు. చూద్దాం మ‌రి లాలూ ప్రిడిక్ష‌న్ ఎంత‌వ‌ర‌కు క‌రెక్ట్ అవుతుందో.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News