హైదరాబాద్ భూముల ధరలు మామూలుగా దూసుకెళ్లటం లేదుగా?

Update: 2022-07-02 03:52 GMT
హైదరాబాద్ మహానగరంలో భూముల ధరలు మండిపోతున్నాయి. ఇంతకాలం ఐటీ కారిడార్ లోని భూముల ధరలు బంగారమన్నట్లుగా ఉంటే.. ఇప్పుడు శివారు ప్రాంతాల్లోనూ అలాంటి ఊపే కనిపిస్తోంది.

ఇటీవల కాలంలో హైదరాబాద్ లోని పలు ప్రాంతాల్లోని ప్రభుత్వ భూముల వేలాన్ని నిర్వహిస్తోంది హెచ్ ఎండీఏ (హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్ మెంట్ అథారిటీ).

ఇందులో భాగంగా తాజాగా శివారులోని అబ్దుల్లాపూర్ మెట్ మండలం తొర్రూరు మున్సిపాలిటీ పరిధిలో హెచ్ ఎండీఏ డెవలప్ చేసిన లేఔట్ లో వేలాన్ని నిర్వహించారు.

అబ్ధుల్లాపూర్ మెట్ అంటే.. రామోజీ ఫిలింసిటీకి దగ్గర. అలాంటి రిమోట్ ప్రాంతంలో వేసిన లే ఔట్ కు సైతం భారీగా ధరల పలకటం విశేషం. తాజాగా తొర్రూరులో రెండో దఫాగా 140 ప్లాట్లను మూడు రోజులుగా ఆన్ లైన్ లో వేలాన్ని నిర్వహించారు. శుక్రవారం జరిగిన వేలంలో రెండు సెషన్లలో 42 ప్లాట్లకు జరిగిన వేలంలో 41 ప్లాట్లను కొనేందుకు పోటీ సాగింది.

ఉదయం సెషన్ లో గరిష్ఠంగా గజం రూ.33వేలకు బిడ్ చేయగా.. కనిష్ఠంగా గజం రూ.23వేలు పలికింది. సాయంత్రం సెషన్ లో అత్యధికంగా గజం రూ.35,500 బిడ్ చేయగా.. అత్యల్పంగా రూ.21వేల ధర పలకటం గమనార్హం.

మొత్తం 41 ప్లాట్లకు రూ.33.58 కోట్లు పలకటం గమనార్హం. మిగిలిన 106 ప్లాట్లకు శనివారం ఆన్ లైన్ ద్వారా వేలం జరగనుంది. తాజాగా పలికిన ధరలు.. ఇటీవల కాలంలో మరెప్పుడూ లేవని చెబున్నారు. నగర శివారు.. అది కూడా ఐటీ కారిడార్ కు దూరంగా ఉంటే ప్రాంతంలో గజం ధర ఇంతలా పలకటం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.
Tags:    

Similar News