శ్రీరాముడి సాక్షిగా 600 ఎకరాలు గోవిందా

Update: 2016-03-03 06:48 GMT
ఏపీ రాజధాని అమరావతిలో మంత్రులు, టీడీపీ నేతల భూదందాలపై పత్రికల్లో వస్తున్న కథనాలు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి.  అయితే.... ఇలాంటి భూదందా ఇంకోటి కూడా బయటపడింది. కడప జిల్లాలో కొందరు అధికార పార్టీ నాయకులు 600 ఎకరాల భూమిని కొట్టేశారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. పాలకపార్టీ నేతల అభయ హస్తంతో అధికారులు దోపిడీకి తెరతీశారని... టీడీపీ నాయకుల అనుయాయులకు బంజరు భూములను 1986లో పంపిణీ చేసినట్లు తాజాగా రికార్డులు ఆన్‌ లైన్‌ చేశారని ఆరోపణలు వస్తున్నాయి.
   
గతేడాది ఒంటిమిట్ట కోదండరామాలయానికి రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా శ్రీరామనవమి నిర్వహించే అవకాశం దక్కింది. దీంతో సమీప ప్రాంతాల్లోని భూములు, ఇళ్లస్థలాల ధరలకు రెక్కలొచ్చాయి. రూ.100 కోట్లతో ఒంటిమిట్ట కోదండరామాలయాన్ని అభివృద్ధి చేస్తామని టిటిడి ప్రకటించింది. ఇదే అదనుగా ఆ పార్టీ నేతల కన్ను ప్రభుత్వ భూములపై పడింది. దీంతో ఆ ప్రాంత టీడీపీ నాయకులు భూముల మాయాజాలం సృష్టించారని చెబుతున్నారు. ఈ విషయం ఇటీవల వెలుగులోకి రావడంతో రెవెన్యూ యంత్రాంగం కప్పిపుచ్చుకునే చర్యలను చేపట్టింది.
   
పెన్నపేరూరు - చింతరాజుపల్లి - జవుకులపల్లి - గొల్లపల్లి రెవెన్యూ గ్రామాల పరిధిలో సుమారు 600 ఎకరాల విలువైన ప్రభుత్వ భూమి స్వాహాకు గురైంది. మండలంలోని కొన్ని గ్రామాలకు చెందిన వ్యక్తుల, రాజంపేట, కడప, బెంగళూరు, హైదరాబాద్‌ ప్రాంతాల్లో నివసిస్తున్న వారి పేర్లతో రికార్డులను సృష్టించారు. ఒక్కో లబ్ధిదారునికి ఐదెకరాల చొప్పున కేటాయించారు. లబ్ధిదారు నుంచి రూ.90 వేల నుంచి రూ.లక్షన్నర వరకూ అధికార పార్టీ నాయకులు వసూలు చేశారు. ఈ వ్యవహారంలో సుమారు రూ.కోటిన్నర చేతులు మారినట్లు తెలుస్తోంది. ఇందుకు ప్రతిఫలంగా రెవెన్యూ యంత్రాంగం రూ.12 కోట్ల విలువ చేసే ప్రభుత్వ భూములను పందేరం చేసింది. జవుకులపల్లిలో సర్వే నెంబర్‌ 212, 209, చింతరాజుపల్లిలో 503, 460, 463 నెంబర్లు పిఓబిలో ఉన్నప్పటికీ, పెన్నపేరూరులో సర్వేనెంబర్‌ 658 కోర్టులో ఉన్నా, గతంలో ముంపునకు గురై పరిహారం పొందిన ఖాతా నెంబర్‌ 416 పేరుతో మరికొన్ని కొత్త భూములను ఇటీవల ఆన్‌లైన్‌లో ఎక్కించారు.
   
1986లోనే లబ్ధిదారులకు ఈ భూములను పంపిణీ చేసినట్లు ఆన్‌లైన్‌లో చూపించారు. గత నెల 14న వీటిని ఆన్‌లైన్‌ చేసినట్లు తెలుస్తోంది. డిజిటల్‌ సిగేచర్‌ పెన్‌ డ్రైవ్‌ ను మండల స్థాయి ప్రధాన రెవెన్యూ అధికారి.. జూనియర్‌ అసిస్టెంట్‌ కు అప్పగించడం బాధ్యతా రాహిత్యమనే చర్చ నడుస్తోంది. ప్రభుత్వ భూములను తమకనుకూలంగా చక్కబెట్టుకోవడానికి సహకరించినందుకు స్వాహారాయుళ్లు ఆ మండల స్థాయి ప్రధాన రెవెన్యూ అధికారికి కారును బహుమానంగా సమర్పించి, సమీప బంధువుల పేరుతో రిజిస్ట్రేషన్‌ చేయించినట్లు సమాచారం. దీనిపై ఫిబ్రవరి 27న జిల్లా కేంద్రంలోని ఎస్సీ ఎస్టీ గ్రీవెన్స్‌ సెల్‌ లో పెన్నపేరూరుకు చెందిన దళితులు ఏడో విడత భూపంపిణీ చేపట్టాలని, భూ పందేరంపై విచారణ చేపట్టాలని విన్నవించారు. దీంతో ఈ వ్యవహారమంతా బయటపడింది.
Tags:    

Similar News