తెలంగాణలో భూమల విలువ పెంపు.. ఇప్పుడేం జరుగుతుంది?

Update: 2021-06-29 06:30 GMT
ఓపక్క సంక్షేమ పథకాలు.. మరోపక్క తాయిలాలు.. ఇంకోపక్క హామీల అమలు. ఇలా ఏడాదికేడాది రాష్ట్ర ప్రభుత్వాల ఖర్చులు అంతకంతకూ పెరిగిపోతున్నాయి. ఇలాంటి వేళ.. ప్రభుత్వానికి ఆదాయం పెరగటం అవసరం. ఇందులో భాగంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఒక కీలక నిర్ణయాన్ని తీసుకోవాలని భావిస్తున్నట్లు చెబుతున్నారు. రాష్ట్రంలో భూమల ధరల్నిభారీగా పెంచాలన్నయోచనలో ఉన్నారు. అదే జరిగితే.. భూముల ధరలతోపాటు.. రిజిస్ట్రేషన్ల ఆదాయం ప్రభుత్వానికి భారీగా సమకూరనుంది.

రాష్ట్ర విభజనకు ముందు 2013 ఆగస్టులో అప్పటి ఉమ్మడి రాష్ట్రంలో చివరిసారి భూముల విలువ నిర్ణయాన్ని తీసుకున్నారు. రూల్ బుక్ లోని నిబంధన ప్రకారం చూస్తే.. ప్రతి రెండేళ్లకు ఒకసారి రివ్యూ చేపట్టి.. విలువల్ని నిర్దారించాల్సి అవసరం ఉంది. కానీ.. అలాంటిదేమీ జరగని పరిస్థితి. తాజాగా రిజిస్ట్రేషన్ల రూపంలో ప్రభుత్వానికి పెద్ద ఎత్తున ఆదాయం వస్తోంది. ఇంతకు మించి అన్న అంశంపై అధికారులు కసరత్తు చేస్తున్నారు.

దీనికి సంబంధించిన నివేదిక ఒకటి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ముందుకు తీసుకెళ్లినట్లు తెలుస్తోంది. దీని ప్రకారం 2019-20 లెక్కల ప్రకారం ఆస్తుల రిజిస్ట్రేషన్ల ద్వారా ప్రభుత్వానికి వచ్చే ఆదాయాన్ని లెక్కలేశారు. అధికారుల రికార్డుల ప్రకారం గత ఆర్థిక సంవత్సరంలో రూ.6299 కోట్లు వచ్చినట్లుగా తేల్చారు. సవరించిన అంచనాల నేపథ్యంలో పెంపు నిర్ణయాన్ని ప్రభుత్వం ముందు పెట్టిన అధికారులు.. సుమారు రూ.9600 కోట్ల మేర ఆదాయం పెరుగుతుందని చెబుతున్నారు.

అంటే.. భూముల విలువ పెంపుతో ప్రభుత్వానికి అదనంగా రూ.3వేల కోట్ల వరకు  వస్తుందని భావిస్తున్నారు. అదే జరిగితే రాష్ట్ర రిజిస్ట్రేషన్ రూపంలో దగ్గర దగ్గర రూ.10వేల కోట్ల మేర ఆదాయం వస్తుందని భావిస్తున్నారు. అన్ని అనుకున్నట్లుగా జరిగితే తెలంగాణలో ఆగస్టు 1 నుంచి రిజిస్ట్రేషన్ల రూపంలో భారీ ఆదాయం వస్తుందన్న అంచనాలు ఉన్నాయి. మరి.. ఇందుకు సీఎం కేసీఆర్ ఎలా రియాక్టు అవుతారో చూడాలి.
Tags:    

Similar News