4 కోట్ల నుంచి 11 కోట్లకు.. ఆంధ్రా క్రికెటర్ తలరాత మార్చిన బీసీసీఐ

ఒకవేళ భారత్ రెండు మ్యాచ్ లు ముందుగానే నెగ్గితే.. చివరిదాంట్లో నితీశ్, హర్షిత్ లకు అవకాశం దక్కొచ్చు. అదే జరిగితే ముగ్గురూ అన్‌ క్యాప్‌డ్ జాబితాకు దూరంగా ఉంటారు.

Update: 2024-10-05 17:30 GMT

ఎన్నో మార్పులు.. మరెన్నో విశేషాలతో ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 18వ సీజన్ మెగా వేలం వచ్చే నెలలో జరగనుంది. దీనికి సంబంధించి విధివిధానాలను గత వారం భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు ప్రకటించింది. ఆటగాళ్లలో ఎంతమందిని రిటైన్ చేసుకోవాలి..? అనే ప్రధాన ప్రశ్నకు సమాధానం దొరికింది. ఆటగాళ్లకు మ్యాచ్ ఫీజు సహా కీలక మార్పులతో వచ్చే సీజన్ జరగనుంది. ఇందులోభాగంగా ఆంధ్రా క్రికెటర్ కు బంపర్ ఆఫర్ దక్కింది. రేపటి నుంచి బంగ్లాదేశ్ తో జరిగే టి20 సిరీస్ లో అతడితో పాటు మరో ఇద్దరికీ లక్ గట్టిగా తగలనుంది.

మనోడు నక్కను తొక్కాడు..

తెలుగు రాష్ట్రాల నుంచి ఇటీవలి కాలంలో జాతీయ జట్టుకు ఎంపికైన క్రికెటర్ లేరు. చివరగా హైదరాబాద్, ఆంధ్రా సంఘాల నుంచి పేసర్ మొహమ్మద్ సిరాజ్, బ్యాట్స్ మన్ హనుమ విహారి మాత్రమే దేశానికి ఆడారు. అయితే 2024 సీజన్ లో అనూహ్యంగా దూసుకొచ్చాడు విశాఖపట్టణానికి చెందిన యువ పేస్ బౌలింగ్ ఆల్ రౌండర్ నితీశ్ కుమార్ రెడ్డి. ఇప్పటికే జింబాబ్వే సిరీస్ కు ఎంపికైనా నితీశ్ అనారోగ్యంతో దూరమయ్యాడు. రేపటి నుంచి బంగ్లాతో జరిగే సిరీస్ లో ఆడనున్నాడు. లీగ్ తాజా నిబంధనల ప్రకారం అన్‌ క్యాప్డ్ జాబితా నుంచి రిటైన్ చేసిన ఆటగాళ్లకు రూ.4 కోట్లు మాత్రమే ఇవాల్సి ఉంటుంది. గత సీజన్ లో ఐపీఎల్ లో దుమ్మురేపిన నితీశ్ కు మాత్రం రూ.11 కోట్లు దక్కనున్నాయి. అన్ క్యాప్డ్ (ఇప్పటివరకు దేశానికి ఆడని) రూల్స్ సవరించడమే దీనికి కారణం.

ఈ ఇద్దరికీ..

బంగ్లాతో సిరీస్ కు ఎంపికైన జట్టులో నితీశ్ తో పాటు పేస్ బౌలింగ్ ఆల్ రౌండర్ హర్షిత్ రాణా, సూపర్ ఫాస్ట్ పేసర్ మయాంక్ యాదవ్ ఉన్నారు. వీరంతా అన్ క్యాప్డ్. తాజాగా తెచ్చిన నిబంధనతో ఈ ముగ్గురికీ రూ.11 కోట్లు దక్కనున్నాయి. బంగ్లాతో భారత్ మూడు టి20లు ఆడనుంది. వీటిలో ఈ ముగ్గురు ఒక్కదాంట్లోనైనా ఆడినా చాలు.. రూ.4 కోట్లు ఉన్న ఐపీఎల్ ధర రూ.11 కోట్లకు చేరుతుంది. ఆదివారం గ్వాలియర్ లో భారత్-బంగ్లా తొలి టి20 జరగనుంది.

వారిద్దరూ ఓకే.. మనోడు?

నితీశ్ రెడ్డి బంగ్లాతో టి20 సిరీస్ లో అరంగేట్రం చేయడం అనుమానమే. మయాంక్ యాదవ్ ను మాత్రం మరో పేసర్ అర్షదీప్ సింగ్ కు తోడుగా కచ్చితంగా ఆడిస్తారు. హర్షిత్ రాణాకూ అవకాశాలు సగం సగమే. ఒకవేళ భారత్ రెండు మ్యాచ్ లు ముందుగానే నెగ్గితే.. చివరిదాంట్లో నితీశ్, హర్షిత్ లకు అవకాశం దక్కొచ్చు. అదే జరిగితే ముగ్గురూ అన్‌ క్యాప్‌డ్ జాబితాకు దూరంగా ఉంటారు.

బీసీసీఐ నిబంధనలు ఇలా

ఐపీఎల్ నిబంధనల ప్రకారం అసలు అరంగేంట్రం చేయని, ఐదేళ్లుగా అంతర్జాతీయ క్రికెట్ ఆడని ఆటగాళ్లను అన్ క్యాప్డ్ గా పరిగణిస్తారు. ఈ ఆటగాళ్లను మెగా వేలానికి ముందు 5+1 లేదా 4+2 ఫార్ములా కింద ఉంచుకోవచ్చు. ఫ్రాంచైజీ ఆరుగురు ఆటగాళ్లను ఉంచుకోవాలనుకుంటే, వారిలో ఒకరు తప్పనిసరిగా అన్‌ క్యాప్డ్ ఆటగాడు అయి ఉండాలి. మెగా వేలానికి ముందు గరిష్ఠంగా ఇద్దరు అన్‌ క్యాప్డ్ ఆటగాళ్లను రిటైన్ చేసుకోవచ్చని సమాచారం. తద్వారా అన్‌ క్యాప్‌డ్ జాబితాలో ఉంచిన ఆటగాళ్లకు కేవలం రూ.4 కోట్లు మాత్రమే ఇస్తే సరిపోతుంది.150 కిలోమీటర్లపైగా వేగంతో బంతులేసే మయాంక్ యాదవ్ లక్నో సూపర్ జెయింట్స్ కు ఆడుతున్నాడు. గత సీజన్ లో ఆడిన మూడు మ్యాచ్ ల్లోనూ రెండింట్లో ఇతడే మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్. కాబట్టి ఇతడిని లక్నో ఎలాగూ వదులుకోదు. కనీస మొత్తం రూ.11 కోట్లు చెల్లించాల్సి ఉంటుంది.

సన్ రైజర్స్ ఆలోచనేంటో?

నితీశ్ కుమార్ రెడ్డి ఈ ఏడాది ఐపీఎల్ సన్ రైజర్స్ కు ఆడాడు. తన ప్రతిభతో ఆకట్టుకున్నాడు. పేస్ బౌలింగ్ కూడా వేసే ఆల్ రౌండర్. దీంతో నితీశ్ ను సన్ రైజర్స్ విడిచిపెట్టదు. బంగ్లా సిరీస్ లో ఆడకపోతే అన్ క్యాప్డ్ రూ.4 కోట్లు ఇస్తే సరిపోతుంది. టీమ్ ఇండియాకు ఆడితే మాత్రం రిటైన్ చేసుకునేందుకు కనీస మొత్తం రూ.11 కోట్లు ఉంటుంది.

చాంపియన్ జట్టులో చాంపియన్ బౌలర్

ఈ సీజన్ లో కోల్ కతా నైట్ రైడర్స్ విజేతగా నిలవడంలో ఆల్ రౌండర్ హర్షిత్ రాణా కీలకంగా నిలిచాడు. అతడూ బంగ్లాదేశ్‌ సిరీస్‌ లో ఆడితే రిటెన్షన్ ఫీజు రూ.11 కోట్లు అవుతుంది. పైగా రాణాకు టీమ్ ఇండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ ప్రోత్సాహం బాగుంది. దీంతో అతడు అన్ క్యాప్డ్ లిస్ట్ నుంచి బయటపడి రూ.11 కోట్లు కొట్టేయడం పక్కా. మొత్తానికి బీసీసీఐ రూల్ ఇలా ఉపయోగపడిందన్నమాట.

Tags:    

Similar News