ఐసిస్‌ కు ఇంకో చావుదెబ్బ‌

Update: 2016-11-23 05:42 GMT
రాక్ష‌స మూక ఐసిస్‌ కు మ‌రో చావు దెబ్బ ఎదుర‌యింది. ఇరాక్‌ లోని మోసుల్‌ నగరంలో ఇప్పటికే చావుదెబ్బతింటున్న ఇస్లామిక్‌ స్టేట్‌ మిలిటెంట్‌ సంస్థకు ఇప్పుడు లిబియాలోని సిర్తే నగరంలో సైతం చుక్కెదురవుతోంది. ఉత్తరాఫ్రికా ప్రాంతంలో వ్యూహాత్మక నగరమైన సిర్తేలో లిబియన్‌ దళాలు గత కొద్ది రోజులుగా ముందడుగు వేస్తూ ఇస్లామిక్‌ స్టేట్‌ మిలిటెంట్లను ఎక్కడికక్కడ అడ్డుకుంటున్నాయి. ఐఎస్‌పై కొనసాగుతున్న యుద్ధ రంగంలో విజయం తమదే అయినప్పటికీ కొద్దిమంది మిలిటెంట్లు ఇంకా ఒక మారుమూల ప్రాంతంలో నక్కి ఉన్నారని అమెరికా - లిబిన్‌ దళాలు చెబుతున్నాయి. అయితే ఇస్లామిక్‌ స్టేట్‌ మిలిటెంట్లతో పోరు దీర్ఘకాలికమే కాకకొంత సంక్లిష్టమైనదేనన్న విషయం అమెరికా మద్దతునిస్తున్న సంకీర్ణ దళాలకు ఇటీవలి కాలంలో విస్తృత స్థాయిలో అనుభవంలోకి వచ్చింది. తమకు అనూహ్యరీతిలో ప్రతిఘటన ఎదురవుతున్నదని, తమచుట్టూ వున్న ఇళ్లు తమపై కూలిపోతున్నా మిలిటెంట్లు తామున్న చోటును దిలిపెట్టేందుకు అంగీకరించటం లేదని ఘిజాలో లిబిన్‌ దళాలతో కలిసి పోరాడుతున్న ఒసామా ఇస్సా అనే యువకుడు వివరించాడు.

లిబియాపై తమకున్న కొద్దిపాటి పట్టును చేజార్చుకోకుండా వుండేందుకు ఐఎస్‌ మిలిటెంట్లు లిబియా దళాలను తీవ్రంగా ప్రతిఘటిస్తున్నారు. చావో రేవో తేల్చుకోవాలన్న కృతనిశ్చయంతో వారు పోరాడుతున్నారని, సిర్తేలో ఓటమి ఎదురైతే ప్రపంచ వ్యాప్తంగా విస్తరించాలన్న వారి ఆశలకు గండిపడినట్లేనని పరిశీలకులు భావిస్తున్నారు. మోసుల్‌ ను కోల్పోయిన వెంటనే లిబియాలో పరాజయం ఎదురైతే ఆ సంస్థ శక్తి సామర్ధ్యాలతో పాటు - రిక్రూటీల విశ్వాసాన్ని కోల్పోయే పరిస్థితి ఉందని వారు చెబుతున్నారు.

ఇదిలాఉండ‌గా సిరియాలోని అలెప్పొ నగరంపై గత కొన్ని రోజులుగా జరుగుతున్న వైమానిక దాడులను ఐక్యరాజ్య సమితి ప్రధాన కార్యదర్శి బాన్‌ కీ మూన్‌ ఖండించారు. ఈ దాడుల్లో పలువురు పౌరులు మృతి చెందారు. పదుల సంఖ్యలో క్షతగాత్రులయ్యారు. మృతి చెందిన వారిలో పిల్లలు కూడా ఉన్నారు. అలెప్పొ దాడులను ఖండిస్తూ బాన్‌ కీ మూన్‌ ప్రతి నిధి ఒక‌ ప్రకటన విడుదల చేశారు. పౌరులను, వారి ఆస్తులను లక్ష్యంగా చేసుకుని దాడి చేయడం యుద్ధనేరమవుతుందని ఘర్షణలకు పాల్పడుతున్న అన్ని పార్టీలకు ఆ ప్రకటన గుర్తు చేసింది. దాడులను తక్షణమే ఆపివేయాలని కోరింది. సిరియాలో దాడులకు - ఇతర దౌర్జన్యాలకు పాల్పడుతున్న వారు ఎవరైనా సరే, ఎక్కడ ఉన్నా సరే ఏదో ఒక రోజు చట్టం ముందుకు రావలసిందేనని ఆ ప్రకటన స్పష్టం చేసింది. సిరియాలో పౌరులు స్వేచ్ఛగా సంచరించేలా చూడాలని, మానవతా సాయానికి తక్షణం అవరోధం లేకుండా చూడాలని పేర్కొంది. సిరియాలోని అలెప్పొపై గడిచిన 24 గంటల్లో జరిగిన దాడిలో 110 మంది మృతి చెందినట్లు గురువారం వార్తలు వెలువడ్డాయి. రష్యా, సిరియాలు అలెప్పొపై జరిపిన వైమానిక దాడిలో 90 మంది పౌరులు మృతి చెందినట్లు స్కై న్యూస్‌ అరేబియా టివి చానల్‌ పేర్కొంది. బటాబో పట్టణంపై జరిగిన దాడిలో మరో 20 మంది పౌరులు మృతి చెందారని తెలిపింది.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News