కొత్త కరోనా వేళ.. బ్రిటన్ లో ఆంక్షలు ఎంత తీవ్రమంటే?

Update: 2020-12-27 05:50 GMT
కరోనా కొత్త స్ట్రెయిన్ తో బ్రిటన్ వణికిపోతున్న సంగతి తెలిసిందే. కరోనా వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చి.. యుద్ధ ప్రాతిపదికన పంపిణీ చేస్తున్న ఆనందం కాస్తా ఆవిరి అయ్యేలా కొత్త కరోనా వ్యాప్తి చెందుతున్న తీరు తీవ్ర ఆందోళనకు గురి చేస్తోంది. ఈ నేపథ్యంలో ఈ వైరస్ వ్యాప్తికి చెక్ పెట్టేందుకు వీలుగా ఇంగ్లండ్ లోని దాదాపు 60 లక్షల మంది ప్రజలపై కఠిన ఆంక్షల్ని విధిస్తూ నిర్ణయం తీసుకున్నారు.

దీంతో.. తూర్పు.. ఈశాన్య ఇంగ్లండ్ లోని పలు ప్రాంతాల్లో పెద్ద ఎత్తున పరిమితుల్ని విధించారు. దీంతో.. కఠినమైన లాక్ డౌన్ ఆంక్షలు మరోసారి అమల్లోకి వచ్చినట్లైంది. కరోనా కారణంగా బ్రిటన్ లో ఇప్పటివరకు 70 వేల మంది మరణించారు. క్రిస్మస్ కారణంగా కరోనా వ్యాప్తి పెద్ద ఎత్తున సాగినట్లుగా భావిస్తున్నారు. ఈ వాదనకు బలం చేకూరేలా కేసుల నమోదు సాగుతోంది. దీంతో.. క్రిస్మస్ తర్వాతి రోజు నుంచి భారీ ఎత్తున ఆంక్షల్ని తెర మీదకు తీసుకొచ్చారు.

తాజాగా స్కాట్లాండ్.. నార్తర్న్ ఐర్లాండ్ లో కరోనా కొత్త కేసులు వేగంగా విస్తరిస్తున్న వైనాన్ని గుర్తించారు. దీంతో.. అత్యవసరం కాని షాపులు.. బార్లు.. రెస్టారెంట్లను పూర్తిగా మూసేశారు. పౌరులంతా ఇళ్లకే పరిమితం కావాలని ప్రకటించారు. తాజా పరిణామాల నేపథ్యంలో నార్తర్న్ ఐర్లాండ్లో ఆరు వారాల లాక్ డౌన్ ను ప్రకటించారు. జిమ్ లు.. బ్యూటీ సెలూన్లు.. ఇతరత్రా షాపుల్ని మూసివేస్తూ నిర్ణయం తీసుకున్నారు. కేవలం ఆహార పదార్థాల్ని తీసుకెళ్లేందుకు మాత్రమే అనుమతులు ఇస్తున్నారు. ఇదంతా చూస్తుంటే.. రానున్న రోజుల్లో మనకు ఇలాంటి పరిస్థితులు తలెత్తనున్నాయా? అన్న సందేహం రాక మానదు.
Tags:    

Similar News