‘ది వైర్’ తాజా కథనంలో.. అనిల్ అంబానీ

Update: 2021-07-23 03:43 GMT
రాజకీయ నేతలు.. పారిశ్రామికవేత్తలతోపాటు పలువురు ప్రముఖుల ఫోన్ నెంబర్లు నిఘాలో ఉన్నట్లుగా ‘ది వైర్’ మీడియా సంస్థ పబ్లిష్ చేసి కథనాలు దేశ వ్యాప్తంగా పెను సంచలనానికి తెర తీసిన సంగతి తెలిసిందే. గడిచిన రెండు..మూడు రోజులుగా పార్లమెంటు సమావేశాలు సైతం స్తంభించిపోవటంలో ఈ కథనాల ప్రభావం ఉందని చెప్పక తప్పదు.

ఈ సంచలన కథనాలు అధికారపక్షాన్ని ఇరుకున పడేలా చేస్తే.. విపక్షాలు తీవ్ర ఆందోళనను వ్యక్తం చేస్తున్నాయి. ఇదిలా ఉంటే..ఫోన్లపై నిఘా పెట్టిన ఉదంతంలో పలువురు పారిశ్రామికవేత్తల పేర్లు బయటకు రాగా.. తాజాగా ది వైర్ మరో సంచలన కథనంలో రిలయన్స్ అడాగ్ గ్రూపు ఛైర్మన్ అనిల్ అంబానీకి చెందిన ఫోన్ నెంబర్లు కూడా నిఘాలో ఉన్నట్లుగా పేర్కొంది.

అనిల్ అంబానీ ఎందుకు వచ్చినట్లు అంటే.. అతగాడికి రాఫెల్ యుద్ద విమానాల కొనుగోలు అంశానికి సంబంధించిన ఉదంతంలో ఆయన పేరు ఉండటం.. 36 యుద్ధ విమానాల్ని కొనుగోలు చేసే విషయంలో భారీ కుంభకోణం జరిగిందన్న మాట తరచూ వినిపిస్తూ ఉండటం తెలిసిందే. రాఫెల్ యుద్ధ విమానాల్ని తయారు చేసే దసాల్ట్ కు భారత భాగస్వామిగా అనిల్ అంబానీకి చెందిన సంస్థ ఉండటం తెలిసిందే. దీనిపై ఆయనపై పెద్ద ఎత్తున విమర్శలు.. ఆరోపణలు ఇప్పటికే వచ్చాయి.

ఇదిలా ఉంటే.. డసాల్ట్ ఏవియేషన్ కు భారత ప్రతినిధిగా వ్యవహరిస్తున్న వెంకటరావు.. బోయింగ్ ఇండియా అధిపతి ప్రత్యూష్ కుమార్ నెంబర్లు కూడా నిఘా నీడలో ఉన్నట్లుగా ‘ది వైర్’ పేర్కొంది. అంతేకాదు.. దలైలామా సన్నిహిత సలహాదారులపైనా నిఘా కొనసాగినట్లుగా ది వైర్ స్పష్టం చేసింది. సీబీఐ మాజీ డైరెక్టర్ అలోక్ వర్మను 2018లో పదవి నుంచి తొలగించిన తర్వాత ఆయన ఫోన్ మీదా నిఘా పెట్టినట్లుగా చెబుతున్నారు. ఇదిలా ఉంటే మరోవైపు.. కేంద్రం తమ ఫోన్ నెంబర్ల మీదా నిఘా ఉంచి ఉండొచ్చన్న కొత్త వాదనను తెర మీదకు తీసుకొచ్చారు రైతు సంఘాల నేతలు.

కేంద్రం తీసుకొచ్చిన మూడు వ్యవసాయ చట్టాల్ని వ్యతిరేకిస్తూ ఆందోళనలు చేస్తున్న తమ ఫోన్లపైనా నిఘా ఉంచి.. హ్యాకింగ్ కు పాల్పడ్డారేమోనన్న అనుమానాన్ని వారు వ్యక్తం చేస్తున్నారు. పెగాసన్ తో నిఘా పెట్టిన ఫోన్ నంబర్ల జాబితాలో తమ నంబర్లు కూడా ఉంటాయన్న అనుమానాన్ని రైతు నేతలు వ్యక్తం చేస్తున్నారు. తాజాగా వ్యవసాయ చట్టాల్ని వ్యతిరేకిస్తూ 200 మందితో కూడిన టీం ఒకటి ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద నిరసనను నిర్వహించారు. మొత్తంగా పెగాసన్ వ్యవహారం ఇప్పుడు సంచలనంగా మారటమే కాదు.. మోడీ సర్కారును ఇప్పట్లో విడిచిపెట్టే అవకాశం లేనట్లుగా ఉందన్న మాట వినిపిస్తోంది.
Tags:    

Similar News