అలీ ఏం చేశాడని ఎంపీ పదవి... ?

Update: 2022-03-03 08:30 GMT
పార్టీలో పని చేసిన వారికి న్యాయం చేస్తే రేపటి రోజున జెండా పట్టుకునే వారు కోకొల్లలుగా  ఉంటారు. అలా కాదు బయట నుంచి వచ్చిన వారికే  రెడ్ కార్పెట్ పరుస్తామని అనుకుంటే కార్యకర్తలే కనుమరుగు అవుతారు. అయితే ఇపుడు ఆల్ ఆఫ్ సడెన్ గా ఎంట్రీ ఇచ్చిన వారికే మన్ననలూ, మర్యాదలు. వారికే పదవులూ పరమాన్నాలూ. దీంతో జెండా ఎత్తిన కార్యకర్త రగిలిపోతున్నాడు అంటే న్యాయమే కదా అనిపించకమానదు.

ఇదంతా ఎందుకు అంటే అలీ అనే తెలుగు సినిమా నటుడు తొందరలో రాజ్యసభ ఎంపీగా పెద్దల సభలో కూర్చోబోతున్నాడు అని ప్రచారం అయితే పెద్ద ఎత్తున సాగుతోంది. ఈ మధ్యనే అలీ నేరుగా సీఎం జగన్ని కలసి వచ్చారు. ఆయనకు ఒక రకమైన భరోసా కూడా ఇచ్చారని అంటున్నారు. ఈ ఏడాది జూన్ లో ఖాళీ అయ్యే రాజ్యసభ సీటులో ఒక దాన్ని అలీకి కట్టబెడతారు అని అంటున్నారు.

సరే అలీకి రాజ్యసభ సీటు ఇస్తున్నారు అంటే ఏ లెక్కన ఇస్తున్నారు, దానికి పెట్టుకున్న కొలమానం ఏంటి, ప్రాతిపదిక ఏంటి అన్నది చర్చకు వస్తోంది. నిజానికి అలీ పొలిటికల్ బ్యాక్ గ్రౌండ్ అంతా టీడీపీ నుంచే అని అంటారు. ఆయన గత రెండు దశాబ్దాలుగా టీడీపీ తరఫునే ఎన్నికల్లో ప్రచారం చేస్తూ వచ్చారు. టీడీపీకి కరడు కట్టిన అభిమానిగా అలీ పనిచేశారు. ఎన్నో సార్లు చంద్రబాబుతోనూ ఆయన కనిపించారు.

ఇక నాడు సీఎం వైఎస్సార్ మైనారిటీల కోసం నాలుగు శాతం రిజవేషన్లు ఇస్తే కనీసం  ఏ రోజూ కూడా వైఎస్సార్ ని పొగడలేదు,  అలాగే ఏనాడు అయినా కలసి ధన్యవాదాలూ కూడా చెప్పలేదు. అలాంటి అలీకు వైసీపీ మీద మోజు ఒవర్ నైట్ వచ్చిందని విమర్శలు వస్తున్నాయి. ఇక వైసీపీలో ఎన్నికల ముందు అలీ చేరాడు. అంటే ఆయన వైసీపీలో ఉన్నది కచ్చితంగా మూడేళ్ళ లోపే అన్న మాట.

జస్ట్ అలా వైసీపీ కండువా అలీ కప్పుకున్నదుకు ఇంతటి పెద్ద పదవా అని వైసీపీలో రగులుతున్నారు అంటే అది సహజమే కదా అన్న భావన అయితే అందరిలో ఉంది. నిజానికి అలీ పార్టీకి ఏమి సేవ చేశారని రాజ్యసభ పదవి ఇస్తున్నారు అన్నదే పార్టీలో కొందరి నుంచి వస్తున్న సూటి ప్రశ్న.  గత పన్నెండేళ్ళుగా పార్టీ కోసం పనిచేసిన వాళ్ళు ఉన్నారు.

ఎంతో మంది తమ కాలాన్ని, ధనాన్ని లెక్కచేయకుండా వైసీపీ అధికారంలోకి రావాలని పనిచేశారు. మరి అలాంటి వారిని పక్కన పెట్టి నిన్నా మొన్నా వచ్చిన అలీ లాంటి వారికి ప్రతిష్టాత్మకమైన రాజ్యసభ సీటు ఇస్తే మాత్రం అది తీరని అన్యాయమే అంటున్నారు. అలీ లాంటి వారు పార్టీకి నికరంగా చేసిన సేవ ఏంటి అన్నది పెద్దలే చెప్పాలన్న మాట కూడా వినిపిస్తోంది. మొత్తానికి చూసుకుంటే అలీకి కనుక రాజ్యసభ సీటు ఇస్తే మాత్రం వైసీపీలో అసంతృప్తి తారస్థాయికి చేరే ప్రమాదం అయితే పొంచి ఉందని అంటున్నారు.
Tags:    

Similar News