ఆనం వారిని అధ్యక్షా అని పిలవాల్సిందేనా... ?

Update: 2022-03-19 00:30 GMT
వైసీపీలో సీనియర్ మోస్ట్ లీడర్ ఆనం రామనారాయణరెడ్డి. ఆయనది అతి పెద్ద రాజకీయ కుటుంబం. నెల్లూరు పెద్దాయనగా పేరు. ఆయన ఆర్ధిక శాఖ వంటి కీలక మంత్రిత్వ శాఖలను కాంగ్రెస్ ఏలుబడిలో చేపట్టారు. విభజన తరువాత టీడీపీ లో చేరినా కనీసం ఎమ్మెల్సీ కూడా ఇవ్వలేదు. దాంతో విసుగుచెంది 2019 ఎన్నికల  ముందు వైసీపీలో చేరారు.

చివరి నిముషంలో చేరినా కూడా ఆనం ఫ్యామిలీకి ఉన్న పొలిటికల్ హిస్టరీని చూసి జగన్ ఆయనకు వెంకటగిరి సీటుని సర్దుబాటు చేశారు. అలా అక్కడ ఆశావహుడిగా ఉన్న మాజీ ముఖ్యమంత్రి నేదురుమల్లి జనార్ధనరెడ్డి కుమారుడు రాం కుమార్ రెడ్డిని కూడా పక్కన పెట్టి సీటు ఇచ్చారు.

అంత వరకూ బాగానే ఉంది కానీ ఆనం కి వైసీపీలో తగిన గౌరవం దక్కలేదని అనుచరులు అయితే గత మూడేళ్ళుగా బాధపడుతున్నారు. దానికి కారణం ఫస్ట్ విడత లోనే ఆనం కి మంత్రి పదవి, కీలకమైన శాఖలు లభిస్తాయని వారంతా ఎదురు చూశారు. అయితే జగన్ నెల్లూరు జిల్లాలో జూనియర్స్ ని మంత్రులుగా చేసి ఆనం వారిని ఖంగు తినిపించారు.

పోనీ సరే అనుకున్నా పార్టీలో సరైన ప్రయారిటీ ఇవ్వడం లేదని ఆయన మధన పడిన సందర్భాలు చాలానే ఉన్నాయి. తన నియోజకవర్గం లో కూడా జోక్యం చేసుకుంటున్నారని, తాను చెప్పిన పనులు జరగడం లేదని కూడా ఆయన బాహాటంగానే అసంతృప్తి వ్యక్తం చేశారు కూడా.

ఇదిలా ఉంటే మంత్రివర్గ విస్తరణ త్వరలో జరుగుతుంది అన్న ప్రచారం నేపధ్యంలో ఆనం వారి ఆశలు ఇంకా సజీవంగానే ఉన్నాయని అంటున్నారు. గతం గతహా, జగన్ తనకు కచ్చితమైన స్థానాన్ని ఇస్తారని పెద్దాయన అయితే ఆశపడుతున్నారని టాక్. ఆయనకు గతంలో ఆర్ధిక శాఖ నిర్వహించిన అనుభవం ఉంది. చివరి నిముషం లో మార్పులు ఏమైనా జరిగి బుగ్గన రాజేంద్రనాధ్ రెడ్డిని కంటిన్యూ చేయక పోతే ఆర్ధిక శాఖతో పాటు మంత్రి పదవి ఆనంకి ఇస్తారని అంటున్నారు.

అదే టైంలో నెల్లూరు జిల్లాలో చూసుకుంటే తొలి నుంచి వైసీపీలో ఉంటూ రెండు సార్లు ఎమ్మెల్యేలుగా గెలిచిన వారు ఉన్నారు. వారిలో కాకాని గోవర్ధనరెడ్డి అసెంబ్లీ ప్రివిలేజ్ కమిటీ చైర్మన్ గా ఉంటున్నారు. ఆయన మంత్రి పదవిని చాలా గట్టిగా కోరుకుంటున్నారు. జగన్ సైతం ఆయనకు హామీ ఇచ్చారని తెలుస్తోంది.

దాంతో కాకాణికి కనుక మంత్రి పదవి దక్కితే ఆనం వారికి ఆశాభంగమే అవుతుంది. అయితే వయా మీడియాగా పెద్దాయన‌ను తెచ్చి అసెంబ్లీ స్పీకర్ ని చేస్తారు అని అంటున్నారు. అయితే ఇక్కడ కూడా ఈక్వేషన్స్ సరిపోవాలి. శ్రీ కాకుళం జిల్లాకు చెందిన స్పీకర్ తమ్మినేని సీతారాం ని మంత్రిగా చేస్తేనే ఆ కుర్చీ ఖాళీ అవుతుంది. అపుడే ఆనం వారు అధ్యక్ష స్థానంలోకి వస్తారు.

అయితే ఆనం కి ఈ స్పీకర్ పోస్ట్ నచ్చుతుందా. ఆయన దాంతో సంతృప్తి చెందుతారా అంటే అది ప్రశార్ధకమే. ఆనం అయితే చేస్తే మంత్రి పదవి లేకపోతే లేదు అని కనుక అనుకుంటే మాత్రం వైసీపీలో ఆయన సీనియర్ ఎమ్మెల్యేగా మిగిలిపోవాల్సి వస్తుంది. అంతే కాదు, ఆయన రేపటి రాజకీయం కూడా వేరేగా ఉండే అవకాశాలను ఎవరూ కొట్టిపారేయలేరు అంటున్నారు. చూడాలి మరి.
Tags:    

Similar News