చంద్రబాబు బావకు లేని బాధ వైసీపీ బ్యాచ్ కు ఎందుకు?

Update: 2022-03-03 23:30 GMT
ఎవరు చేశారన్నది కాసేపు పక్కన పెడదాం. ఎందుకంటే.. తీర్పులు ఇవ్వటానికి ప్రత్యేకమైన వ్యవస్థలు ఉన్నాయి. వారు ఆ పని చేస్తారు. కానీ.. అలాంటివేమీ పూర్తి కాక ముందే.. ఎవరికి వారు తీర్పులు చెప్పేసే తొందరపాటు ఏ మాత్రం సరికాదు. దారుణ రీతిలో వైఎస్ వివేకాను హత్య చేశారన్నది వాస్తవం.

ఇలాంటి దారుణ ఉదంతాల గురించి మాట్లాడే వేళలో.. హత్యకు  పాల్పడిన వాడు ఎవరైనా సరే వదిలిపెట్టకూడదన్న పట్టుదల ఉండాలి. అది మాటల్లో కానీ చేతల్లో కానీ. అయితే.. వైసీపీ నేతల తీరు మాత్రం అందుకు భిన్నంగా ఉంది.

వైఎస్ వివేకా హత్యకు సంబంధించి ఇప్పటివరకు బయటకు వచ్చిన వాంగ్మూలాలు వైసీపీ ఎంపీ అవినాశ్ రెడ్డి వైపు వేళ్లు చూపించేలా ఉన్నాయి. ఆయనతో పాటు మరికొందరి మీదా వేలు చూపిస్తున్నాయి. ఇలాంటి వేళ.. నిజంగానే అవినాశ్ రెడ్డి అమాయకుడనో.. ఆయనకు ఈ ఉదంతంతో అస్సలు సంబంధం లేదన్న ప్రగాఢ విశ్వాసం ఉండి ఉంటే.. అందుకు తగ్గ వాదనను వినిపించటం తప్పేం కాదు. ఉదాహరణకు.. వివేకా హత్యకు గురి కాలేదు.. గుండెపోటుతో మరణించారన్న మాట అవినాశ్ రెడ్డి నోటి నుంచి రాలేదు.. ఫలానా వ్యక్తి నోటి నుంచి వచ్చిందన్న ఆధారాలు చూపించొచ్చు.

అవినాశ్ రెడ్డి మీద ఉన్న ఆరోపణల్లో మరొకటి.. ఆయన ఆధ్వర్యంలోనే వివేకా రక్తాన్ని శుభ్రం చేసేయటం.. ఆయనకు తగిలిన గాయాలకు కుట్లు వేయటం.. కట్లు కట్టటం లాంటివి. అవేమీ అవినాశ్ రెడ్డి ఉన్నప్పుడు జరగలేదు.

అవన్నీ అయ్యాక.. ఫ్రీజర్ బాక్సులో పెట్టిన తర్వాత అవినాశ్ రెడ్డి అక్కడకు చేరుకున్నారన్న దానికి ఆధారం ఏదైనా ఉండి ఉంటే.. వాటిని మీడియాకు వెల్లడించొచ్చు. ఆ మాటకు వస్తే.. ఈ రెండు అంశాలే కాదు.. అవినాశ్ రెడ్డి సుద్దపూస.. ఆయనకు ఏ పాపం లేదు.. పాడు లోకం ఆయన్ను గద్దల్లా పొడుస్తుందన్న వేదన ఉంటే.. దాన్ని ఆధారాలు.. వాదన రూపంలో వినిపించటం బాగుంటుంది.

అంతే తప్పించి.. చంద్రబాబు తన సొంత బావను.. మేనల్లుడ్ని.. తోడల్లుడిని.. తమ్ముడిని వాడుకొని వదిలేశారన్న పులిసిపోయి పులిహోర మాటలు.. కాలం చెల్లిన ఉప్మా మాటలతో ఉపయోగం ఉండదన్నది మర్చిపోకూడదు. ఎప్పుడైనా చంద్రబాబు బావ (బాలక్రిష్ణ) తన బాధను చెప్పుకున్నారా? ఇలాంటి అర్థం లేని మాటల వల్ల లాభం కంటే నష్టమే ఎక్కువన్న లాజిక్ ఎందుకు మిస్ అవుతారు?

ప్రశ్నకు ప్రశ్న సమాధానం కాదు. ప్రశ్నకు సమాధానమే పరిష్కారం. ఆరోపణలు వెల్లువెత్తినప్పుడు.. అవన్నీ తప్పులుగా చెప్పాల్సి వస్తే.. అదెలానో చెప్పటం తప్పేం కాదు. ఆ స్వేచ్ఛ అందరికి ఉంటుంది. అయితే.. అందరూ కాకున్నా ఎక్కువ మంది నిజమే కదా? అన్న సంశయాన్ని వ్యక్తం చేసేలా ఉన్నా సరిపోతుంది. అంతేకానీ.. సంబంధం లేని అంశాల్ని ప్రస్తావిస్తూ.. లింకులు వేయటం వల్ల మరింత పలుచన కావటం తప్పించి మరింకేమీ కాదు. ఈ విషయాన్ని జగన్ అండ్ కో ఎప్పటికి అర్థం చేసుకుంటుందో?
Tags:    

Similar News