బోయగూడ మృతులకు మోడీ, కేసీఆర్ నష్టపరిహారం

Update: 2022-03-23 10:32 GMT
సికింద్రాబాద్ బోయగూడలో ఘోర అగ్ని ప్రమాదం సంభవించింది. ఓ టింబర్, స్క్రాప్ దుకాణంలో నేడు జరిగిన ఈ దుర్ఘటనలో 11 మంది బీహార్ వలస కార్మికులు సజీవ దహనమయ్యారు. షార్ట్ సర్క్యూట్ కారణంగా ఈ ప్రమాదం జరిగినట్లు ప్రాథమిక అంచనా. ప్రమాద సమయంలో దుకాణంలో 15 మంది నిద్రిస్తుండగా ఇద్దరు వ్యక్తులు తప్పించుకొని ప్రాణాలతో బయటపడ్డారు. 11 మంది మృతి చెందగా...మరో ఇద్దరి ఆచూకీ తెలియాల్సి ఉంది. ఘటనా స్థలంలో అగ్నిమాపక సిబ్బంది ముమ్మరంగా సహాయక చర్యలు కొనసాగిస్తున్నారు.

ఈ నేపథ్యంలోనే ఈ ఘటనపై ప్రధాని మోడీ, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, జనసేన అధినేత పవన్ కల్యాణ్, వైఎస్సార్ టీపీ అధినేత్రి వైఎస్ ష‌ర్మిల స్పందించారు. ఈ ఘటనపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన మోడీ...మృతుల కుటుంబాలకు సంతాపం ప్రకటించారు. దీంతోపాటు, మృతుల కుటుంబాలకు రూ. 2 లక్షల చొప్పున నష్టపరిహారం ప్రకటించగా...తెలంగాణ ప్రభుత్వం తరఫున ఒక్కో కుటుంబానికి కేసీఆర్ రూ. 5 లక్షల చొప్పున నష్ట పరిహారం ప్రకటించారు. వారి మృతదేహాలను బీహార్ పంపేందుకు అవసరమైన ఏర్పాట్లు చేయాల్సిందిగా సీఎస్ సోమేశ్ కుమార్‌ను కేసీఆర్ ఆదేశించారు.

బోయగూడ ఘటన మృతుల కుటుంబాల‌కు ప‌వ‌న్ క‌ల్యాణ్ సానుభూతి తెలిపారు. ఈ ప్రమాదంలో వలస కార్మికుల సజీవ దహనం బాధాకరమ‌ న్నారు. ఈ ఘ‌ట‌న త‌న‌ను తీవ్రంగా క‌ల‌చివేసింద‌ని, ఉపాధి కోసం బీహార్ నుంచి వ‌ల‌స వ‌చ్చి మృత్యువాత ప‌డ‌డం అత్యంత దుర‌దృష్ట‌క‌ర‌మని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఘటన తనను ఎంతో క‌ల‌చివేసిందని వైఎస్సార్ టీపీ అధినేత్రి ష‌ర్మిల విచారం వ్యక్తం చేశఆరు. బాధిత కుటుంబాల‌కు ప్ర‌గాఢ సానుభూతి తెలిపారు. ఈ తరహా ఘ‌ట‌న‌లు పున‌రావృతం కాకుండా చూసుకోవాల్సిన బాధ్య‌త ప్ర‌భుత్వానిదేన‌ని అన్నారు.

మరోవైపు, గోదాం యజమాని నిర్లక్ష్యంతోనే ఈ ప్రమాదం జరిగిందని, ఆయ‌న‌ను అదుపులోకి తీసుకుని విచారణ జరుపుతున్నామని హోంమంత్రి మహమూద్ అలీ తెలిపారు. ప్రభుత్వ ఖర్చులతోనే మృతదేహాలను బీహార్‌కు తరలిస్తామన్నారు. ఇలాంటి గోదాంలు న‌గ‌రంలో ఎన్ని ఉన్నాయో తెలుసుకుని, రక్షిత చర్యలు తీసుకుంటామని వెల్లడించారు.
Tags:    

Similar News